నల్లగొండ రూరల్ : గత కాంగ్రెస్, టీడీపీ పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు వస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కేవలం హైడల్ థర్మల్ పవర్‌పైనే ఆధారపడాల్సి వస్తుందన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు నార్త్ కారిడార్ నుంచి సౌత్‌వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల సభలోనే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటుందని ప్రజలకు వివరించామన్నారు.
విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయని, ఇందుకు కారణం గత టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వైఖరేనని తెలిపారు. అలాంటి వారు నేడు ఫ్యాషన్ కోసం టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు. సీఎం మొదటి కేబినెట్‌లోనే 40 అంశాలమీద నిర్ణయం తీసుకుని చరిత్ర సృష్టించారన్నారు. వెయ్యిమంది అమరత్వంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీఆర్‌ఎస్ అంటే మలినం లేని, మలినమంటని పార్టీ అన్నారు. పార్టీలో పనిచేసిన వారికి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో చకిలం అనిల్‌కుమార్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, జి. వెంకటాచారి, ఫరీద్, పున్న గణేష్, షేక్ కరీంపాష, బోయపల్లి జానయ్య, చింత శివరామకృష్ణ, సాయి, జమాల్‌ఖాద్రి, శ్రీను, సురేందర్, అరుణాకర్ పాల్గొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కరెంట్ కష్టాలు
Published Thu, Aug 28 2014 3:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement