జిల్లాల ఏర్పాటుపై వ్యతిరేకత మూర్ఖత్వం
♦ కాంగ్రెస్, టీడీపీల వ్యతిరేకతకు కారణం చెప్పాలి
♦ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలను త్వరితగతిన అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించడం మూర్ఖత్వమని శాసన మండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ పేర్కొనారు. ఏర్పాటు ప్రక్రియకు అడ్డుపడటం కాంగ్రెస్, టీడీపీల అజ్ఞానానికి పరాకాష్ట అని అన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమగ్ర అభివృద్ధి కోసమే జిల్లాలు ఏర్పాటవుతున్నాయన్నారు. అయినా కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎందుకు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కరువును పోగొట్టేందుకే...
తెలంగాణలో కరువును శాశ్వతంగా పారదోలేందుకే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్, టీడీపీల తీరు చూస్తుంటే, తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడమే వారి ఏకైక ఎజెండాగా కనిపిస్తోందని విమర్శించారు.