సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధిలో దూసుకెళుతున్న విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 1వతేదీన శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల్ని అందించే లక్ష్యంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు మంగళవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ అదేరోజు జీవీఎంసీ పరిధిలో మరో 50 పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.
ఐటీ టవర్స్‌పై సానుకూలం..
ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఐటీ హబ్‌గా మార్చేందుకు బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో దిగ్గజ సంస్థలను ఆహ్వనించిన ప్రభుత్వం పర్యాటక రంగంలోనూ అదే ఒరవడిని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్నవరం సమీపంలో రూ.350 కోట్లతో ఒబెరాయ్ లగ్జరీ రిసార్టుల ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. తాజాగా దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ భారీ మాల్‌ని నిర్వించనుంది. మాల్ శంకుస్థాపనకు ఆహ్వనించేందుకు రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న మాల్‌ని మూడేళ్లలోగా పూర్తి చేయాలని రహేజా లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ రహేజా గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు
ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ, 15వ ఆరి్థక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టనున్న 50 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. శివారు, జీవీఎంసీ విలీన ప్రాంతాలైన మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్‌లైన్ ప్రాజెక్టులు, మురికివాడల్లో అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.6.4 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో యూరోపియన్ స్టైల్‌లో సాగర్‌నగర్, డిఫెన్స్ కాలనీ వద్ద నిర్వించనున్న ఈట్ స్ట్రీట్స్‌తో పాటు రూ.6 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్, రూ.12 కోట్లతో విశాఖ నగరంలోని పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా..
- ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు.
- ఏయూలో రూ.21 కోట్లతో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన ఏయూ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్(అ–హబ్)ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్ కంపెనీలకు చోటు కల్పించారు.
- రూ.44 కోట్లతో 55 వేల చ.అడుగుల విస్తీర్ణంలో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం నిర్మించిన ఎలిమెంట్ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయోలాజికల్ మానిటరింగ్ హబ్)ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
- రూ.35 కోట్లతో 60 వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన అల్గారిథమ్ (ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)ని సీఎం జగన్ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు.
- ఐఐఎంతో ఒప్పందంలో భాగంగా రూ.18 కోట్లతో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్‌లో ప్రత్యేక కోర్సులందించేందుకు నిర్వించిన ఏయూ–సిబ్(ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)ని సీఎం ప్రారంభించనున్నారు.
- రూ.11 కోట్లతో అవంతి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.11 కోట్లతో మెరైన్ అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో యువతకు నైపుణ్యం అందించేందుకు నిర్వించిన ఏయూ అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్‌ని ముఖ్యమంత్రి జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివీ..
నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్
విస్తీర్ణం : 17 ఎకరాలు (6 లక్షల చ.అడుగులు)
ఎక్కడ : విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో
ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ
లీజు వ్యయం: 30 ఏళ్లకు రూ.125 కోట్లు
శంకుస్థాపన : ఆగస్ట్ 1వ తేదీన
పూర్తి : మూడేళ్ల వ్యవధిలో
నిర్మాణం ఇలా: రెండు బేస్‌మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్, 5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7, 8వ ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్‌లో హోటల్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు
సరికొత్త విశాఖ ఆవిష్కృతం
విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యాయి. పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఐటీ సంస్థల రాకతో నగరం కళకళలాడుతోంది. ఆగస్ట్ 1 న దాదాపు రూ.865 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment