గత ప్రభుత్వంలో సీఎం జగన్ విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం
పలు రంగాల్లో ముందు వరుసలో రాష్ట్రం
2023–24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టీకరణ
మాతా, శిశు మరణాలు భారీగా తగ్గుదల
15.60% నుంచి 6.06%కి తగ్గిన పేదరికం
విద్యలో పెరిగిన నాణ్యత.. ఎలిమెంటరీ, ఉన్నత విద్యలో పెరిగిన ఎన్‌రోల్‌మెంట్
ఆస్పత్రుల్లోనే కాన్పులు 99.98 శాతం
ఆరోగ్యశ్రీతో నాలుగింట మూడోవంతుకు పైగా కుటుంబాలకు ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పలు రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫ్రంట్ రన్నర్‌గా ముందుకు దూసుకుపోతోంది. 2020–21తో పోల్చితే 2023–24లో పేదరికం, మాతా శిశు మరణాల రేటు భారీగా తగ్గింది.
ఆస్పత్రుల్లో కాన్పులు పెరగడంతో పాటు పిల్లలకు నూరు శాతం రోగ నిరోధక శక్తి టీకాలు విజయవంతంగా వేయించింది. విద్యలో నాణ్యత పెరగడంతో పాటు ఎలిమెంటరీ, ఉన్నత విద్యలో ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభించింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా రంగాల్లో తీసుకున్న విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం.
ఈ మేరకు నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023–24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ నిర్ధేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి సమీక్షించారు. అంతటితో ఆగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను అనుసంధానం చేశారు.
నవరత్నాలతో పేదరికం.. మాతా శిశు మరణాలు తగ్గించడం, నాణ్యమైన విద్య, అర్హులందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీని వర్తింప చేయడం, ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలాగ చర్యలు తీసుకోవడంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల్లో నిలిచింది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన మూడో నివేదికతో పోల్చితే నాలుగో నివేదికలో పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగతిలో దూసుకుపోతున్నట్లు స్పష్టమైంది. పేదరికం శాతం 15.60 నుంచి 2023–24 నాటికి 6.06 శాతానికి తగ్గింది. పేదరికం తగ్గించడంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
80.20% కుటుంబాలకు ఆరోగ్య భరోసా
ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య బీమా పధకాన్ని 80.20 శాతం కుటుంబాలకు వర్తింప చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది. అంతకు ముందు 74.60 శాతం కుటుంబాలకే ఆరోగ్య బీమాను వర్తింప చేశారని పేర్కొంది. మాతా శిశు మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ ఐదు రాష్ట్రాల్లో ముందుంది.
ప్రతి లక్ష జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తి 65 నుంచి 45కు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిందని, ప్రతి వెయ్యి సజీవ జననాల్లో ఐదేళ్లలోపు శిశు మరణాలు 33 నుంచి 27కు తగ్గాయని నివేదిక తెలిపింది. ఈ లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలను సాధించినట్లు నివేదిక వెల్లడించింది. 9 నుంచి 11 నెలల పిల్లలకు రోగ నిరోధక శక్తి టీకాలు ఇప్పించడంలో 87 శాతం నుంచి నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించిందని నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..
» ఆస్పత్రుల్లోనే 99.98 శాతం కాన్పులు
» 87.98 శాతం నుంచి 96.90 శాతానికి పెరిగిన ఎలిమెంటరీ ఎన్‌రోల్‌మెంట్
» 46.84 శాతం నుంచి 56.70 శాతానికి పెరిగిన ఉన్నత సెకండరీ ఎన్‌రోల్‌మెంట్
» స్కూల్స్‌లో 91.26 శాతం నుంచి 98.80 శాతానికి పెరిగిన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు
» సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం 75.18 నుంచి 82.50కి పెరుగుదల
» నూటికి నూరు శాతం మెరుగు పడిన గ్రామీణ జనాభాకు తాగునీటి సరఫరా
» పీడబ్ల్యూఎస్ ద్వారా 73.38 శాతం కుటుంబాలకు వారి ప్రాంగణాల్లోనే సురక్షిత తాగునీరు
» 44.17 శాతం నుంచి 28.30 శాతానికి తగ్గిన భూగర్భ జలాల వెలికితీత
» నూరు శాతం మందికి సరసమైన ధరలకు స్వచ్ఛమైన ఇంధనం సరఫరా
» విద్యుత్ కనెక్షన్లలో నూటికి నూరు శాతం లక్ష్య సాధన
» ఎల్‌పీజీ, పీఎస్‌జీ కనెక్షన్లలలో 103.56 శాతం లక్ష్య సాధన
» స్థిర ధరల ఆధారంగా 3.84 శాతం నుంచి 4.05 శాతానికి పెరిగిన తలసరి జీడీపీ వార్షిక వృద్ధి రేటు
» 5.70 శాతం నుంచి 4.40 శాతానికి తగ్గిన 15–59 ఏళ్ల మధ్య నిరుద్యోగిత
» రాష్ట్ర మొత్తం స్తూల ఉత్పత్తి విలువలో 9.5 శాతం నుంచి 12.79 శాతానికి పెరిగిన తయారీ రంగం విలువ
» ప్లాస్టిక్ వ్యర్థాలు 1.27 టన్నుల నుంచి 0.75 టన్నులకు తగ్గుదల (ఏటా ప్రతి 1000 మందికి లెక్కన)
» సున్నా నుంచి 0.25 శాతానికి పెరిగిన మడ అడవుల విస్తీర్ణం
» 17.88 శాతం నుంచి 18.28 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం
Comments
Please login to add a commentAdd a comment