అంతటా..దుర్గంధం
ఇంకా ముంపులోనే గ్రామాలు
ఎక్కడికక్కడపేరుకుపోయిన చెత్త
మురుగునీటిలోనే రాకపోకలు
సాంత్వనకోసం జనం ఎదురుచూపులు
హుదూద్ బీభత్సం సృష్టించి ఐదు రోజులవుతున్నా జిల్లాలో పరిస్థితులు దుర్భరంగానే ఉన్నాయి. పలు గ్రామాలు, కాలనీలను ముంపు ఇంకా వీడలేదు. వీధుల్లో నిలిచిన వర్షపునీరు అలాగే ఉండిపోయింది. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెలువడుతోంది. నిలిచిన వర్షపునీరు మురిగిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. అందులోనుంచే రాకపోకలతో జనం చర్మవ్యాధులకు గురయి నరకయాతన అనుభవిస్తున్నారు.
యలమంచిలి : జిల్లాలో పరిస్థితి అధ్వానంగా ఉంది. యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. సహాయ పునరావాస కార్యక్రమాలూ కొన్నిప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి.
రహదారుల్లో అడ్డంగా కూలిన వక్షాలను తొలగించినా రోడ్డుకిరువైపులా వాటిని అలాగే వదిలేయడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీటి కాలువలు దోమల పెంపకం కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఇళ్ల అవసరాలకు కలుషిత నీటినే జనం వినియోగించాల్సిన దుస్థితి. పారిశుద్ధ్య నిర్వహణ కూడా నామమాత్రంగానే ఉంది.
అంటువ్యాధుల భయం ప్రజలను వెంటాడుతోంది. పేదప్రజలు ఉన్నచోటే ఎక్కువ సహాయక చర్యలు ఉంటున్నాయి. మధ్య తరగతివారిని పట్టించుకునేవారే కరువయ్యారు. మన్యంలోని మారుమూల గూడేల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇళ్ల పరిసరాల్లోనే పశువులశాలలు ఉండడంతో పరిస్థితి దుర్భరంగా ఉంది.