అలజడి పట్టదా..
విశాఖ తీరాన్నిపట్టించుకోని ప్రభుత్వం
కార్యకర్తలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికే చూస్తోంది
ప్రభుత్వంపై మండిపడ్డ విపక్ష నేత
సింహాచలం అప్పన్ననుదర్శించుకున్న జగన్
శారదా పీఠంలో ప్రత్యేక పూజలు
కోలాహలంగా పర్యటన
తీరం కోతపై చలించారు. ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు...హెడ్ గ్రోయిన్ బ్రేక్ వాటర్ విధానాన్ని అమలు చేయాలని కర్తవ్యబోధ చేశారు. సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు... రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.. తాము అధికారంలోకి రాగానే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శారదా పీఠం పూజల్లో పాల్గొన్నారు. అడుగడుగునా తనను కలిసిన అభిమానులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ఇదీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖ నగరంలో పర్యటన సంగ్రహంగా...
విశాఖపట్నం: ఒక రోజు పర్యటనకు విశాఖపట్నం వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రోజంతా క్షణం తీరిక లేకుండా గడిపారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్న వై.ఎస్.జగన్‌కు విమానాశ్రయం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నగరంలోని సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా వ్యవహారాలపై చర్చించారు. కార్యకర్తలతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తీరం కోత పరిశీలన: కొంతకాలంగా కోతకు గురవుతున్న ఆర్కేబీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియం సమీప ప్రాంతాన్ని పరిశీలించారు. విశాఖ తీరాన్ని జగన్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు పరిశీలించారు. అక్కడి పరిస్థితిని చూసి ప్రతిపక్ష నేత చలించిపోయారు. ఇంతగా బీచ్ కోతకు గురవుతున్నా, పెను ప్రమాదం పొంచి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. జపాన్, అమెరికా, సింగపూర్ వంటి సముద్ర తీర దేశాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశాలు తీర రక్షణకు తీసుకుంటున్న చర్యలను కనీసం చూడలేకపోయారెందుకని ప్రశ్నించారు. తాత్కాలిక చర్యలతో సరిపుచ్చడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ విధానంలో శాశ్వత చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. గ్రామాలకు గ్రామాలే సముద్రంలో కలిసిపోతున్నా, ప్రజల జీవనోపాధి దెబ్బ తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక చర్యలంటూ అలలకు కొట్టుకుపోయే నాలుగురాళ్లు వేసి ఏదో చేసేస్తున్నామంటున్న అధికారులు, పాలకుల తీరును జగన్ ఎండగట్టారు. టీడీపీ నాయకుల జేబులు నింపేందుకు నామినేషన్ పద్ధతిలో ఏకంగా మూడున్నర కోట్లు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. అక్కడి నుంచి సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లారు.
జగన్‌మోహన్‌రెడ్డి సింహాచలం దేవస్థానానికి వెళ్లి శ్రీ వరాహలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంలోని కప్పస్తంభాన్ని జగన్ ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం దేవస్థానం అంతరాయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వై.ఎస్. జగన్ పేరు మీద అష్టోత్తర పూజ చేశారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు వై.ఎస్.జగన్‌ను వేదమంత్రోచ్ఛరణతో ఆశీర్వదించారు. అప్పన్న భూముల సమస్యపై ఈ సందర్భంగా జగన్ స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ భూములను ఇప్పటికే క్రమబద్దీకరించి ఉండేవాళ్లమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం శారదాపీఠానికి బయలు దేరారు.
ఈ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ డి. సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యేలు సుజయ్‌కష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తి రెడ్డి, చెంగల వెంకట్రావు, పాలవలస రాజశేఖరం, నియోజవర్గాల సమన్వయకర్తలు వంశీకష్ణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, పెట్ల ఉమా శంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోక్, సీఈసీ సభ్యుడు దామ సుబ్బారావు, పార్టీ నేతలు ఉషా కిరణ్, పక్కి దివాకర్, రవిరెడ్డి, బల్లాడ జనార్ధన్‌రెడ్డి, హేమామాలిని రెడ్డి, విల్లూరి భాస్కర్‌రెడ్డి, పీలా వెంకటలక్ష్మి, జియ్యాని శ్రీధర్, అంగ అప్పలరాజు, శానాపతి అప్పారావు కార్యకర్తలు పాల్గొన్నారు. +
రాష్ట్రానికి మంచి జరగాలని
పెందుర్తి నియోజకవర్గం చినముషిడివాడలోని శారాదా పీఠాన్ని జగన్ సాయంత్రం 5 గంటలకు సందర్శించారు. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్ నేరుగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో సమావేశమై పీఠం గురించి తెలుసుకున్నారు.స్వామీజీతో కలసి రాష్ట్రానికి మంచి జరగాలని జగన్ పీఠ ప్రాంగణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి కళశారాధన చేశారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. పీఠం సంప్రదాయం ప్రకారం వేదపండితులు వై.ఎస్.జగన్‌ను సత్కరించారు. క్షణం తీరిక లేకుండా సాగిన సుడిగాలి పర్యటన ను ముగించుకుని జగన్ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.