Himachal Rain Devastation In Numbers, 80 Killed And Rs 3000 Crore Damage, More Details Inside - Sakshi
Sakshi News home page

Himachal Heavy Rains Damages: జలప్రళయంతో హిమాచల్ విలవిల.. 80 మంది మృతి.. రూ. 4000 కోట్ల ఆస్తి నష్టం

Published Wed, Jul 12 2023 3:08 PM | Last Updated on Wed, Jul 12 2023 4:21 PM

Himachal Rain Devastation 80 Killed Rs 3000 Crore Damage - Sakshi

సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్‌ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్‌-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్‌వే ట్రాఫిక్‌ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. 

కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్‌ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు.

గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లింది.

కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్‌ మార్క్‌ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్‌..

     
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement