బీభత్సం
గురజాల/దాచేపల్లి, న్యూస్‌లైన్: భీకర ఉరుములు గుండెల్లో దడపుట్టించాయి. మిరుమిట్లు గొలిపే మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. పెనుగాలులు విధ్వసం సృష్టించాయి. పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు భారీగా నీరుచేరింది. ప్రధాన రహదారులు, రైలు మార్గాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మట్టిమిద్దెలు కుప్పకూలాయి. పల్లెల్లో విద్యుత్ సరఫరా లేక అంధకారం నెలకొంది. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంమీద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాను అతలాకుతలం చే సింది. ఈదురుగాలుల ధాటికి దాచేపల్లి-మాచర్ల ప్రధాన రహదారిలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జివద్ద భారీగా పెరిగిన చింతచెట్లు నేలకొరిగాయి. ఆర్‌అండ్ అధికారులు చెట్ల తొలగింపు చర్యలు తీసుకున్న తరువాత వాహనాలు రాకపోకలు ప్రారంభమయ్యాయి.
నడికుడి రైల్వేస్టేషన్‌లో ఒకటి, మూడవ నంబర్ ప్లాట్‌ఫాంలపై ఉన్న చెట్లు విరిగి పట్టాలపై పడ్డాయి. అతికష్టం మీద రైల్వే సిబ్బంది వాటిని తొలగించారు. చెట్టు విరిగి పడటంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లన్నీ రెండవ నంబర్ ప్లాట్‌ఫాం నుంచే వెళ్లటంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ స్టేషన్‌లో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో పలు రైళ్లు నడికుడి రైల్వేస్టేషన్‌లో కొద్దిసేపు ఆపివేశారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం రైళ్లు పునరుద్ధరించారు.ధాటికి నడికుడి గ్రామంలో వేల్పుల రాజారావుకు చెందిన రేకుల ఇల్లు నేలమట్టం అయింది. ఇంటిపైకప్పు లేచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. అదే గ్రామంలో చెందిన మంగళగిరి మరియదాసుకు చెందిన రేకుల ఇల్లు కూడా కూలిపోయింది.
కార్యాలయాల్లో తడిచిన రికార్డులు
గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో నాలుగు మట్టిమిద్దెలు కూలినట్టుగా రెవెన్యూ వర్గాలు గుర్తించాయి.స్థానిక ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయంలో రికార్డులు, ఫర్నిచర్‌లు తడిసిపోయాయి. లోపల నీరు నిలవడంతో సిబ్బంది ఆరుబయటే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. మండలంలో 7.4 సెం,మీ వర్షపాతం నమోదు జరిగినట్లు తహశీల్దార్ కార్యాలయం వర్గాలు తెలిపాయి.
వృద్ధుల మృతి..: భీకర శబ్ధంతో కూడిన ఉరుముల ధాటికి జిల్లాలో ఇద్దరు వృద్ధులు గుండె ఆగి మృతిచెందారు. అచ్చంపేట మండలం హసనాబాద్ ఎస్సీ కాలనీకి చెందిన ఆపత్తుల చిట్టెమ్మ (50) ఉరుముల ధాటికి గుండెపోటుతో మరణించింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు మద్దురి కాశమ్మ(75) ఉరుములకు భయపడి బంధువుల ఇంటికి వెళ్తూ దారిలోనే మృతిచెందింది.