అనకొండలు! | many trains are stopped due to heavy rains | Sakshi
Sakshi News home page

అనకొండలు!

Published Wed, Jul 30 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

అనకొండలు!

అనకొండలు!

వరుణుడు మూడో కన్ను తెరిచాడు. కొండలను పిండి చేశాడు. భారీ వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించాడు. రహదారులను కోసేశాడు. వీధులను, ఇళ్లను జలమయం చేశాడు... బుధవారం కురిసిన వర్షం గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే అనిపించేలా విధ్వంసం సృష్టించాడు. సముద్ర  తీరప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికాయి. మరో 48 గంటలపాటు భారీగానే  వర్షం కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కుండపోత వర్షానికి విరిగిపడిన సహ్యాద్రి పర్వతశ్రేణులు
పుణే, నాసిక్, ఠాణే జిల్లాలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం

 
సాక్షి, ముంబై: వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడా? జలాశయాలు ఎప్పుడు నిండుతాయా? తాగునీరు, సాగునీరు ఇంకెప్పుడు అందిస్తాడంటూ వర్షం కోసం ఎదురుచూసిన ప్రజలకు బుధవారం పీడకలగా మారింది. ఉగ్రుడై వచ్చిన వరుణుడు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతాల్లో తీరని విషాదం మిగిల్చాడు. కుండపోతగా కురిసిన వర్షానికి రాష్ట్రంలోని పుణే, నాసిక్, ఠాణే జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రజారవాణాకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రహదారులు, వీధులు జలమయం కావడంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేక అవస్థలు పడ్డారు. పుణేలో నష్టం ఎక్కువగా జరిగింది. నాసిక్‌లో ైరె ళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాసిక్‌లోనూ జనం అనేక ఇబ్బందులు పడ్డారు.
 
వివరాల్లోకెళ్తే...నాసిక్ జిల్లాలో నిలిచిపోయిన రైళ్లు
...
ముంబైకి సుమారు 132 కిలోమీటర్ల దూరంలో నాసిక్ జిల్లా ఇగత్‌పురీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ రైల్వే ఇగత్‌పురి-కసారా రైల్వేస్టేషన్‌ల మధ్య ఇగత్‌పురీ రైల్వేస్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ దుర ్ఘటన చోటుచేసుకుంది. దీంతో హౌరా-ముంబై దురంతో(12262) ఎక్స్‌ప్రెస్, పాట్నా-లోకమాన్యతిలక్ టెర్మినస్(13201) ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇగత్‌పురీ సమీపంలో ఆగిపోయాయి.
 
పలు రైళ్లను దౌండ్, పుణే మార్గం మీదుగా దారి మళ్లించగా మరికొన్నింటిని మార్గమధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. దారి మళ్లించిన రైళ్లలో వారణాసి-ముంబై మహానగరి ఎక్స్‌ప్రెస్, పాట్నా-ముంబై సీఎస్టీ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్-ముంబై గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. నాగపూర్-ముంబై సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఇగత్‌పురీలో రద్దు చేసి అక్కడి నుంచి మళ్లీ తిరిగి నాగపూర్‌కు పంపారు. ఔరంగాబాద్-దాదర్ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను లహవిత్ రైల్వేస్టేషన్‌లో రద్దు చేసి మళ్లి అక్కడి నుంచి ఔరంగాబాద్‌కు నడిపారు. ముంబై - భుసవల్‌ల మధ్య నడిచే ప్యాసింజర్ రైలును కూడా కసారాలో రద్దు చేసి తిప్పి పంపారు. ఇక భుసవల్-ముంబైల మద్య నడిచే ప్యాసింజర్ రైలును మన్మాడ్‌లో రద్దు చేసి తిరిగి భుసవల్‌కు పంపించారు.
 
యుద్ధప్రతిపాదికపై...
రైల్వేట్రాక్‌లపై పడిన కొండచరియలు విరిగిపడిన చోట పునరుద్ధరణ చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. శిథిలాలను తొలగించే పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ఇగత్‌పురీ ఘటనను తెలుసుకున్న సెంట్రల్ రైల్వేఅధికారులు కూడా ముంబై నుంచి ఘటన స్థలానికి వచ్చి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ మార్గంలో రైళ్లన్నింటిని వీలైనంత త్వరగా పునరుద్ధరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సెంట్రల్ రైల్వేపేర్కొంది.
 
పుణేలో భారీ వర్షం
పుణేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మూడురోజులుగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్లచెట్లు నేల కూలాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇంట్లోనే కూర్చుంటున్నారు. పలుప్రాంతాల్లో రహదారులు సరస్సులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకెళ్తే... దాపోడిలోని అరుణ్ టాకీస్ వద్ద సుమారు వందకుపైగా ఇళ్లలో వర్షపు నీరు చేరి ఫర్నీచర్, వంట సామాగ్రి నీట మునిగింది.
 
దీంతో కార్పొరేషన్ అత్యవసర విభాగం, అగ్ని మాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తేర్‌గావ్ ఫినిక్స్ ఆస్పత్రి వద్ద ఫ్లాట్లలోకి, అశోకా హౌజింగ్ సొసైటీ, బిర్లా మెమోరియల్ ఆస్పత్రి వద్ద, పింప్రి తపోవన్ మందిర పరిసరాలతోపాటు నవీ సాంగ్వీలోని సహ్యాద్రి కాలనీ, పింపలే గురవ్‌లోని జవలకర్‌నగర్, కాలేవాడిలోని నడేనగర్, ప్రీతంనగర్, బోసిరిలోని లాండేవాడి పరిసరాలు, హింజ్వాడీ, వాకడ్, చించ్వాడ్, ఆకృడి, దేహురోడ్డు, ఆదర్శ్‌నగర్, నిగిడి, పింప్రి నది తీర ప్రాంతాలు, నిగిడి రూపీనగర్, మావల్, లోనవాలా, ఘోర్వాడి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
 
ఘోర్వాడి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం సగానికిపైగా కూలింది. దీంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటలలో లోనవాలా పరిసరాల్లో 340 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, గత మూడు రోజులుగా 650 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటలు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పుణే వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
 
ఠాణేలోనూ కొనసాగిన వర్షం జోరు...
జిల్లాలోని 50 గ్రామాలు వర్షం తాకిడికి విలవిల్లాడాయి. మిగతా గ్రామాలతో వీటికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ముర్బాద్, పాల్ఘర్ తాలూకాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తుల నిర్వహణ అధికారి జైదీప్ విసావే తెలిపారు. వసయి, డహణు, విక్రమ్‌గఢ్, మానోర్‌లోని లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైతర్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో మరో రెండ్రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
మాస్వాన్ వంతెన మీదుగా నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వరద నీటిలో కొట్టుకుపోయి ఓ పిల్లాడు మరణించినట్లు జైదీప్ తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని, వర్షం జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో తీవ్ర ఆటంకం కలుగుతోందని, భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు.
 
భివండీలో...
భివండీ, న్యూస్‌లైన్ : భివండీలో నాలుగు రోజులుగా నిలకడ లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి భివండీ అతలాకుతమైంది. పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. రంజాన్ పండుగ జరుపుకోవడానికి ముస్లింలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి. ఇళ్లలో రెండు, మూడు అడుగులు ఎత్తు వరకు నీరు రావడంతో విలువైన వస్తువులు నీటి పాలయ్యాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
 
పట్టించుకోని కార్పొరేషన్
ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ అత్యవసర విభాగ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్  రెండు నెలల క్రితం మురికి కాలువలు శుభ్రం చేయడానికై ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో శుభ్రం చేయలేదు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించినప్పటికీ సంబంధిత అధికారులు చూచి చూడనట్లు వ్యవహరించారు. ఈ విషయంపై కొందరు కార్పొరేటర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.
 
మునిగిన వంతెనలు
భివండీలో ఉన్న పెద్ద మురికి కాలువలతో పాటు కామ్‌వారి నదిని  కార్పొరేషన్ శుభ్రం చేయలేక పోవడంతో వర్షం నీరు నిండి కాడిపార్, కోనిగావ్ ప్రాంతాలలోని వంతెనలను ముంచెత్తింది. శనివారం నుంచి బుధవారం వరకు రాకపోకలు పూర్తిగా నిల్చిపోయాయి. పట్టణంలోని లోతట్టు ఈదగా రోడ్, కారోళి రోడ్, అంబికా నగర్, శివాజీ నగర్, నజరాణ కంపౌండ్, అజయ్ నగర్, ఠాంగేఆలి-భాజీ మండాయి, శివాజీ చౌక్, మాడా కాలనీ, నదినాక, శేలార్ తదితర ప్రాంతాలలోని మురికి వాడలు, రోడ్లపై  ఐదు అడుగుల వరకు వర్షం నీరు నిలిచింది.  ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడంలో అధికారులు  విఫలమాయ్యారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొంత వరకు వర్ణుడు కరునించినప్పటికీ కొన్ని పాంతాలలో వర్షం నీరు అలాగే నిల్వ ఉన్నది. స్థానిక సేవా సంఘాలు, స్థానిక కార్పొరేటర్లు కొన్ని ప్రాంతాల ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేశారు.
 
పోలీస్‌స్టేషన్‌లోకి నీరు..
బజార్‌పేట్ ప్రాంతంలోని నిజాంపూర్ పోలీస్ స్టేషన్‌లోకి వర్షం నీరు వెళ్లడంతో విలువైన కాగితాలు, అస్త్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి సంవత్సరం ఈ పోలీస్ స్టేషన్‌లో నీరు చేరుతున్నప్పటికీ కార్పొరేషన్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అదే దుస్థితి పునరావృతమవుతోంది. అదే విధంగా కామత్‌ఘర్ ప్రాంతంలోని వరాలదేవి చెరువులో ఉన్న మురికిని తీయకపోవడంతో చెరువు నిండి పొర్లుతోంది. చెరువును శుభ్ర పరచడానికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement