నోటి ముద్ద నీటి పాలు
♦ రైతన్న కష్టం వర్షార్పణం అకాల వర్షానికి భారీ నష్టం
♦ 1,135 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
♦ 1034 హెక్టార్లలో మామిడి, కూరగాయలు..
♦ నష్టం విలువ రూ. 2.24 కోట్లు
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటనష్టం మరింత పెరిగింది. ఉద్యాన పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఆస్తినష్టం సైతం సంభవించింది. 27 మండలాల్లో వర్షాల వల్ల భారీగా పంట, ఆస్తినష్టం జరిగింది. రామచంద్రాపురంలో అత్యధికంగా 79.6 మి.మీ.వర్షపాతం నమోదైంది. పటాన్‌చెరు, జిన్నారం పారిశ్రామిక వాడల్లో గాలిదుమారం, వర్షం కారణంగా పరిశ్రమల షెడ్లు దెబ్బతినగా ఐలాపూర్ గ్రామంలో 20 మేకలు చనిపోయాయి.
జిల్లా వ్యాప్తంగా 1135 హెక్టార్లలో వరి, మొక్కొజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పంటనష్టం విలువ సుమారు రూ.2.24 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, కల్హేర్, జిన్నారం, కౌడిపల్లి, నంగునూరు మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. ఆకాల వర్షాలతో 1034.20 హెక్టార్లలో మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 794 హెక్టార్లలో మామిడి పంట దెబ్బతినగా 240 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.
గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, జిన్నారం ప్రాంతాల్లో మామిడి, కూరగాయల పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. వీటి విలువ రూ.1.73 కోట్లు ఉంటుందని అంచనా. మార్కెట్‌యార్డుల్లో ఉంచిన వరిధాన్యం సైతం పెద్ద మొత్తంలో తడిసిముద్దయింది. ఇదిలా ఉంటే అకాల వర్షాలతో 35 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 127 ఇళ్లు పాక్షి కంగా దెబ్బతిన్నాయి.