రైతులకు కోలుకోలేని దెబ్బ
ఉత్తరాంధ్ర వ్యవసాయ రంగానికి రూ.2 వేల కోట్ల నష్టం
హైదరాబాద్/అనకాపల్లి: హుదూద్ తుపాను ఉత్తరాంధ్ర వ్యవసాయాన్ని కష్టాల కడలిలోకి తోసేసింది. తుపాను దెబ్బతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నీట మునిగిన పంటలు.. ప్రత్యేకించి వరి పంట ఆ నీరు బయటక పోయే మార్గం లేక కుళ్లిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 70 వేల హెక్టార్లలో పంట నీట మునిగి ఉన్నట్టు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా.
విజయనగరం జిల్లాలో సుమారు 62 వేల హెక్టార్లలో, విశాఖలో సుమారు 20 వేల హెక్టార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 15 వేల హెక్టార్ల విత్తనాభివృద్ధి క్షేత్రాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొత్తంగా తుపాను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో రూ.2 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్రలో ఆరు లక్షల 60 వేల హెక్టార్ల సాధారణ విస్తార్ణం కాగా, ఈఏడాది ఖరీఫ్‌లో 5 లక్షల 82 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయి. దాదాపు అన్ని పంటలు హుదూద్ కారణంగా దెబ్బతిన్నాయని ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన కేంద్రం సహసంచాలకులు కె.వీరభద్రరావు తెలిపారు. వరి, చెరకు, మొక్కజొన్న, అపరాలు, కొబ్బరి, అరటి, బొప్పాయి, నూనె గింజలు, ఉద్యాన పంటలు హుదూద్ విధ్వంసానికి నేలకొరిగాయి. ప్రాథమిక అంచనాగా 85 శాతం పంట నష్టపోయినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.