వర్షాలు, వరదలతో రైతులు విలవిల
ప్రాథమికంగా 5.03 లక్షల ఎకరాల్లో పంటలు మునక
4.54 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు దెబ్బ
49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం
వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.342.32 కోట్ల నష్టం
మత్స్యశాఖకు రూ.141.90 కోట్లు.. పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది, బుడమేరుకు పోటెత్తిన వరదలు తోడవటంతో రైతుల ఆశలన్నీ గల్లంతయ్యాయి. గడచిన 10 రోజులుగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ ముంపు నీటిలో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 జిల్లాల పరిధిలో 5.03 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4,53,845 ఎకరాల్లో వ్యవసాయ, 12 జిల్లాల పరిధిలో 49,340 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాల్లో 2,475 గ్రామాల పరిధిలో 2.50 లక్షల మంది రైతులు ముంపు ప్రభావానికి గురైనట్టుగా లెక్కతేల్చారు.
వరి పంటకు ఎనలేని నష్టం
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు అపారమైన నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా.. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న, అపరాలు, చిరుధాన్యాలు, మిరప, అరటి, పసుపు, కంద, నిమ్మ, కూరగాయలు, ఉల్లి, ఆయిల్‌పామ్, బొప్పాయి, పూలు, కొబ్బరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడం ద్వారా 525 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. కృష్ణా జిల్లాలో 140 ఎకరాల్లో మల్బరీ తోటలకు నష్టం వాటిల్లింది.
పాడి, మత్స్య రైతులకు తీవ్ర నష్టం
ఓ మత్స్యకారుడు మృతి చెందగా.. 83 బోట్లు పూర్తిగాను, 202 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు మత్స్య శాఖ గుర్తించింది. 349 మోటర్ బోట్లు పూర్తిగా దెబ్బతినగా.. 2,440 వలలు ధ్వంసమయ్యాయి. 10వేల హెక్టార్లలో ఫిష్ సీడ్ ఫామ్స్, ఇసుక మేటలు వేయడం వల్ల 18 వేల హెక్టార్లలో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 10 జిల్లాల పరిధిలో 116 పశువులు, 340 మేకలు, గొర్రెలు, 5 ఎద్దులు, 32 దూడలతో పాటు 71,639 కోళ్లు చనిపోగా, 92 పశువుల షెడ్లు కూలిపోయినట్టు లెక్కతేల్చారు. అత్యధికంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ఏలూరు జిల్లాల పరిధిలోని 73 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల పరిధిలో 46,826 పశువులపై తీవ్ర ప్రభావం చూపింది.
వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్ల నష్టం
ఎస్‌డీఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిబంధనల ప్రకారం ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్లు, ఉద్యాన పంటలకు, రూ.40.97 కోట్లు, మత్స్య శాఖకు రూ.141.90 కోట్లు, సెరీ కల్చర్‌కు రూ.2.68 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.66.60 నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. కాగా.. తుది నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 10వ తేదీలోగా పంట నష్టం అంచనాలు రూపొందించి, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద రైతు సేవా కేంద్రా(ఆర్బీకే)ల్లో జాబితాలు ప్రదర్శించనున్నారు. 18న తుది అంచనాల జాబితాలను ప్రదర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment