ముంచుకొస్తున్న ముప్పు! | Another 12 hours of the storm turns Hudood | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు!

Published Fri, Oct 10 2014 1:33 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM

ముంచుకొస్తున్న ముప్పు! - Sakshi

ముంచుకొస్తున్న ముప్పు!

 మరో 12 గంటల్లో పెను  తుపానుగా మారనున్న హుదూద్

విశాఖపట్నం/న్యూఢిల్లీ : పెనువేగంతో వస్తున్న హుదూద్ తుపానుతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. బంగాళాఖాతంలో అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్ వద్ద ఏర్పడిన హుదూద్ తుపాను క్రమంగా తీవ్రరూపు దాల్చి విశాఖపట్నంవైపు దూసుకువస్తోంది.  మరో 12 గంటల్లో పెను తుపానుగా మారనుంది. బుధవారం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాను ఏమాత్రం దిశ మార్చుకోకుండా స్థిరంగా కదులుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయ దిశగా 675 కి.మీ. దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ పెను తుపాను ఆదివారం మధ్యాహ్నానికి విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. హుదూద్ ప్రభావంతో ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు 60-70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది సముద్ర తీరం సమీపానికి వస్తున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పెను గాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (6.5 సెంటీమీటర్ల నుంచి 12.4 సెం.మీ.), అతి భారీ వర్షాలు (12.5 సెం.మీ. నుంచి 24.4 సెం.మీ.) కురుస్తాయని తెలిపింది. ఒడిశాలోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 24.5 సెం.మీ.కంటే ఎక్కువగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదివారానికి గాలుల తీవ్రత విపరీతంగా పెరుగుతుందని తెలిపింది. ఆదివారం 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీవ్రత ఒక్కసారిగా పెరిగి గంటకు 180 కి.మీ. వేగంతో పెనుగాలులు విరుచుకుపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు 2 మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చు. ఈ తుపానుకు కచ్చా ఇళ్లు కూడా దెబ్బ తినే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు, సమాచార వ్యవస్థ దెబ్బ తినే అవకాశముందని తెలిపింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశముందని చెప్పింది. గాలి దుమారం, వరదల ప్రమాదం ఉందని హెచ్చరించింది. హుదూద్ పరిధి 600 కి.మీ. వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఆ మేరకు ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

హుదూద్ ముప్పును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. తీరప్రాంతంలోని మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 11 మండలాల పరిధిలోని 50 గ్రామాలకు ముప్పు ఉందని గుర్తించారు. శుక్రవారం ఈ గ్రామాలకు చెందిన 76 వేల మందిని  సహాయక శిబిరాలకు తరలించాలని నిర్ణయించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరూ 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను సహాయక చర్యలపై చర్చించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కూడా విశాఖలో అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. డిస్కంలు కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాయి. మరోపక్క.. ముందస్తు, సహాయక చర్యలపై  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ సేథ్ గురువారం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్) 5 వేల మందితో కూడిన ఐదు బెటాలియన్లను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలోని ఈ ఐదు ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్లలోని 51 బృందాలను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్నంలకు రెండేసి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఒక్కో బృందాన్ని పంపారు. ఒడిశాకు 9 బృందాలను పంపనున్నారు.

ఒడిశాలోని గంజం జిల్లాలో మూడు, ఖుర్దాలో రెండు, గజపతి, కటక్, పూరి, బాలేశ్వర్ జిల్లాల్లో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్ నిర్ణయించింది. పాట్నా, కోల్‌కతా, చెన్నైల నుంచి నాలుగేసి చొప్పున బెటాలియన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు బయల్దేరాయి. తుపాను సమయంలో వరదల నుంచి బాధితులని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 54 మంది గజ ఈతగాళ్లను, 162 పడవలను అత్యాధునిక పరికరాలతో పంపనున్నారు. మిలటరీకి చెందిన 4 బెటాలియన్లు కూడా రాష్ట్రానికి రానున్నాయి. నేవీ కూడా 30 బోట్లను, సిబ్బందిని సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు 14 శాటిలైట్ ఫోన్లను సమకూర్చింది. కాగా, తుపాను నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల వినియోగదారుల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూంలలో నిరంతరం అందుబాటులో ఉండే మానిటరింగ్ సెల్‌లు ఏర్పాటు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement