నరకం చూపించారు | Hudood storms rtc passenger Problems | Sakshi
Sakshi News home page

నరకం చూపించారు

Published Wed, Oct 15 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

నరకం చూపించారు

నరకం చూపించారు

 సాక్షి, రాజమండ్రి :హుదూద్ తుపాను తీరాన్ని దాటి బలహీనపడినా.. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. మంగళవారం విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ఆర్టీసీ ప్రయాణికులు నానా ఇబ్బందులూ పడ్డారు. తుపాను నేపథ్యంలో శనివారం నుంచి విశాఖ - రాజమండ్రి మధ్య రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. ఆదివారం నుంచి ఆర్టీసీ కూడా విశాఖపట్నం వెళ్లే సర్వీసులను నిలుపు చేసింది. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. తుపాను అనంతరం 16వ నంబరు జాతీయ రహదారిపై అడ్డంకులను పాక్షికంగా తొలగించడంతో సోమవారం ఉదయం నుంచి విశాఖ - రాజమండ్రి మధ్య ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి మంగళవారం కూడా రైళ్లు   తిరగకపోవడంతో ప్రయాణికులు పూర్తిగా ఆర్టీసీపైనే ఆధారపడ్డారు. ఈ పరిస్థితుల్లో వారిని సౌకర్యవంతంగా గమ్యానికి చేర్చడంపై దృష్టి పెట్టాల్సిన ఆర్టీసీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించ డం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. విశాఖపట్నం, రాజమండ్రి, అనకాపల్లి, కాకినాడ తదితర డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. విశాఖలోని సిటీ సర్వీసులను, పల్లెవెలుగు బస్సులను రాజమండ్రి, విజయవాడలకు స్పెషల్ సర్వీసులుగా తిప్పారు. వీటిల్లో సీట్లు సరిగ్గా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
 
 ఎక్కడపడితే అక్కడే ఆపేసి..
 ఆర్టీసీ నిబంధనల ప్రకారం బస్సు స్టేషన్లలో తప్ప వేరే అనధికార ప్రదేశాల్లో బస్సులను ఆపి భోజనాలు, టిఫిన్లు చేయడం నిషిద్ధం. ఈ చర్యలు ప్రయాణీకుల భద్రతపై కూడా ప్రభావం చూపుతాయి. కానీ, ఈ నిబంధనను ఆర్టీసీ సిబ్బంది బేఖాతరు చేశారు. తుని నుంచి కత్తిపూడి మధ్య జాతీయ రహదారిపై ఉన్న ధాబాలవద్ద భోజన విరామం పేరుతో ఇష్టానుసారం ఆపేశారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో.. అన్నవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దాటిన తరువాత రాజమండ్రి మార్గంలోని ఒక ధాబా వద్ద సుమారు 40 బస్సులను ఆపారు. ఒకేసారి అధిక సంఖ్యలో బస్సులు రావడంతో ఆ ప్రాంతం ఆర్టీసీ బస్సు డిపోను తలపించింది. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు అసహనానికి గురై పలు డ్రైవర్లు, కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు. అయితే, తుని తర్వాత రాజమండ్రి వరకూ బస్ కాంప్లెక్స్‌లలో హోటళ్లు లేవని, అందుకే బస్సులను అనధికారిక ప్రాంతాల్లో నిలుపు చేస్తున్నారని ఆర్టీసీ రాజమండ్రి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వరప్రసాద్ చెప్పారు. మొత్తమ్మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేయడంతో.. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య విశాఖలో బయలుదేరిన సర్వీసులు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో రాజమండ్రి చేరాయి. మామూలుగా నాలుగున్నర గంటలు పట్టే ప్రయాణానికి సగటున ఆరు గంటలు పట్టిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement