సర్వే..శ్వరా!
శ్రీకాకుళం అగ్రికల్చర్: హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో పంటలన్నీ కోల్పోయిన అన్నదాతలు ప్రభుత్వం సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కొత్త కొత్త నిబంధనలు.. ఆంక్షలతో వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. హుదూద్ తీరం దాటి పది రోజులవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు సిద్ధం కాలేదు. ఇప్పటికీ తొలి రోజు అంచనాలనే అధికారులు చెబుతున్నారు.ఇవీ లెక్కలు: వరి 74351 హెక్టార్లు, మొక్కజొన్న 2680, పత్తి పంట 6090, చెరకు 3818, అపరాలు, ఇతర పంటలు 122 హెక్టార్లు వెరసి.. సుమారు 87,151 హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అరటి 1,578, కొబ్బరి 1,082 హెక్టార్లు, జీడిమామిడి 376, బొప్పాయి 38, మామిడి 24 మొత్తం 3,758 హెక్టార్లలోనూ నష్టం వాటిల్లిందనేది అధికారుల అంచనాలు. కానీ జిల్లాలో వరి పంట ఒక్కటే 1.50 లక్షల హెక్టార్ల పైబడి నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అన్ని పంటలూ అధికారుల అంచనాలకు రెట్టింపులోనే ఉన్నాయని ఆవేదనభరితంగా చెబుతున్నారు.
అంచనాల కోసం అధికారుల సర్వే
మూడు రోజులుగా గ్రామాల్లో నష్టం అంచనాలకు అధికారులు రైతులతో కలిసి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు జియోగ్రాఫికల్ సర్వే చేపట్టడంతో ఈ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఇలా అయితే జిల్లాలో పంట నష్టం అంచనాలు పూర్తి కావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులే చెబుతున్నారు. కారణం.. ఒక్కో రైతుకు చెందిన ఒక సర్వే నంబరు వివరాలను అప్‌లోడ్ చేయడానికి కనీసం అర్ధగంట సమయం పైబడి పడుతోంది. పంట ఎంతమేరకు పోయినా 50శాతం మాత్రమే చూపుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో జియెటాకింగ్ విధానంలో పంటనష్టం సర్వే చేయొద్దని పలు గ్రామాల్లో రైతులు అడ్డుకుంటున్నారు.
సవాలక్ష ఆంక్షలు
పంట నష్టం అంచనాల తయారీకి ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధించింది. రైతు ఆధార్ నంబర్, పేరు.. తదితర కుటుంబ వివరాలతోపాటు మొబైల్ నంబరు తదితర అన్ని వివరాలూ అవసరమని పేర్కొంది. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా జియోమెట్రిక్ విధానంలో సర్వేకు వీలుకాదు. సర్వే నంబర్లు విషయానికోస్తే సర్వే నంబరు, మొత్తం విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది/ఎన్ని మొక్కలకు నష్టం జరిగింది. పంట కేటగిరి, చిన్నా, సన్నకారు రైతా.. పెద్ద రైతా.. పంట నష్టం శాతం ఎంతఅనేవి నమోదు చేయాలి. ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులు పంటలు వేస్తే ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులతో జియోటాకింగ్ విధానంలో వారందరికీ ఫోటోలు తీయాలి. అంతేకాకుండా ఒకే సర్వే నంబరులో ఒకే రైతు వేర్వేరు పంటలు వేసినా అప్పుడు కూడా ఒకే రైతు అన్ని పంటల వద్ద ఫొటోలు తీయించాలి. ఇలా చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలంలో సుమారు 19 వేలకు పైబడి సర్వే నంబర్లున్నారు. ఒక్కో సర్వే నంబరులో సుమారు 10 నుంచి 20 పైబడి సబ్ డివిజన్లుంటాయి. వీటిలో అన్నదమ్ముల వాటాలు, ఇతరత్రా కారణాల వల్ల ఎ, బీ, సీ వంటి విభజనలు జరిగి ఉంటే మరిన్ని ఉంటాయి. వీటన్నంటికీ రైతులను పెట్టి ఫొటోలు తీయాలంటే కష్టమేనని రైతులు తీవ్రస్థాయిలో మథనపడుతున్నారు. వీటితో పాటు బ్యాంకు పేరు, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబరు, అక్షాంశ.. రేఖాంశాలు, ఫొటో ఉండాలి.
ఆధార్, ఫోన్ నంబర్లు లేని రైతులు అనేకం
జిల్లాలో ఆధార్‌కార్డులు లేని రైతులు అనేకమంది ఉన్నారు. నేటికీ ఆధార్ కార్డుల కోసం త హశీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రద క్షణలు చేస్తున్నారు. అలాంటిది ఆధార్ నంబర్లు అంటే ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్లు లేనివారు లెక్కలేనంతమంది. దీంతో రైతులను మభ్యపెట్టి పరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఈ కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి