government Help
-
సర్వస్వం పోయింది.. ఆదుకోండి..!
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరద ఉధృతిలో సర్వం కోల్పోయారు. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. వరదలో నిత్యావసరాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కోల్పోయారు. కట్టుకోవడానికి బట్టలు.. కప్పుకోవడానికి దుప్పటి కుడా లేని దుస్థితి నెలకొంది. వరదల నుంచి తేరుకొని మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నష్టపరిహారం ఇస్తుందా లేదా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆపన్నహస్తాల కోసం ఎదురు చుస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరిని కదిలించినా క‘న్నీరే’ ఉబికివస్తోంది. కాగా, నిత్యావసర వస్తులు అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందని తక్షణ సాయం ఊరికి ఊరంత వరదలో మునగడంతో కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులకు ప్రభుత్వం నుంచి కనీసం తక్షణ సాయం కూడా అందలేదు. నిత్యావసర వస్తువులు, బియ్యం కూడా పంపిణీ చేయలేదు. నష్టపోయిన ఆస్తికి, పశువులకు పరిహారం కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. 10 ఇళ్లు వరద తాకిడి దెబ్బతినగా చెంచుకాలనీకి చెందిన 18 గుడిసెలు వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాధితులు అందోళన చెందుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోరంచపల్లి బస్టాండ్ సమీపంలోని సంతోషిమాత సూపర్మార్కెట్లో రూ. 20లక్షల విలువైన కిరాణా సామగ్రి తడిసి పాడైంది. ముందుకు వస్తున్న పలువురు.. మోరంచపల్లిలో జరిగిన నష్టాన్ని చూసిన పలువురు చలించిపోతున్నారు. పగవారికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని వేడుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నాయకులు ముందుకు వచ్చి బియ్యం, కూరగాయలు, వంట సామాను, చద్దర్లు, మ్యాట్లు, పండ్లు, పప్పులు, చీరలు, ఇతర వస్తువులు ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు అందజేస్తున్నారు. రూ.20 లక్షల నష్టం జరిగింది మోరంచపల్లిలో వచ్చిన వరదతో మా సూపర్మార్కెట్లో రూ.20లక్షల విలువైన వస్తువులు తడిసి పాడయ్యాయి. చక్కెర, పప్పు, పిండి, బియ్యం ఇతర వస్తువులు పాడయ్యాయి. అప్పు తెచ్చి షాపు ఏర్పాటు చేసుకున్న. వస్తువులు కొనుగోలు చేసిన సెట్లకు ఇంకా డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – దొడ్డశాని సంతోష్, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ఇంటికి రూ. 4లక్షలు ఇవ్వాలి వరద ఉధృతిలో సర్వం కోల్పోయాం. ప్రతి ఇంటికీ ప్రభుత్వం రూ.4లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. వరదలో 3 తులాల బంగారం, రూ.15వేల నగదు, వంట గ్యాస్, భూమి పాస్‌పుస్తకాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి. మిగిలిన వస్తువులను కడుకుంటున్నాం. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా వచ్చి నష్టం గురించి సర్వే చేయలేదు. – సూరం రాజయ్య, వరద బాధితుడు -
థాంక్యూ జగనన్న.. మా పాప ప్రాణాన్ని నిలబెట్టారు
అమలాపురం టౌన్: గాకర్స్ వ్యాధి బాధితురాలు చిన్నారి హనీ తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిలు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వారు.. చిన్నారి హనీతో పాటు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులను మంగళవారం కలిశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, కమిషనర్ నివాస్, ఏపీ ఎంఎస్ఐడీఎస్ డైరెక్టర్ డి.మురళీధరరెడ్డిలను వారు వేర్వేరుగా కలిసి మాట్లాడారు. వీరంతా చిన్నారి హనీని ఎత్తుకుని మరీ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసే ఏర్పాటు చేస్తామన్నారని తండ్రి రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. వరదల పరిస్థితిని చూసేందుకు కోనసీమకు వచ్చిన సీఎం జగన్ చిన్నారి హనీ పరిస్థితిని తెలుసుకుని చలించారు. పాప వైద్యానికి ప్రభుత్వం తరఫున ఖర్చు చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. దీంతో రూ.కోటి కేటాయించి, ఖరీదైన ఇంజెక్షన్లను అమెరికా నుంచి రప్పించి వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబు సిగ్గుపడాలి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించి, వారికి ప్రకటించిన సాయం అందించాక.. సీఎం పర్యటనలో అక్కడి ప్రజల అభిప్రాయాలు విన్న తర్వాత కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా పర్యటిస్తున్నారని సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. నిజానికి.. బురద రాజకీయం చేసేందుకే ఆయన అక్కడ పర్యటిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలకు, నష్టాలకు చంద్రబాబే కారణమని, తన పదవీ కాలం సమయంలో ప్రజాసంక్షేమం పక్కనపెట్టి, రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ముంపు సమయాల్లో ఎప్పుడూ కూడా ఇంతవేగంగా సహాయం అందలేదని, ఇప్పుడు సహాయం అందకుండా ఒక్క కుటుంబం కూడా లేదని ఆయా గ్రామాల ప్రజలు సీఎం జగన్‌కు వివరించారన్నారు. వలంటీర్ల పనితీరుపై కూడా గ్రామస్తులు ప్రశంసలు కురిపించారని.. సీఎం తన పర్యటనలో బాధితులతో నేరుగా మాట్లాడి వారి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారని తెలిపారు. బాబువి బెదిరింపులు.. జగన్‌వి ఆత్మీయ పలకరింపులు ఇక వరద సమస్యలతో పాటు పలు ఇతర సమస్యలపైనా స్థానిక ప్రజలు సీఎంకు విజ్ఞప్తులు, అర్జీలు అందించారని.. పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సీఎం ఆదేశాలు జారీచేశారన్నారు. బాధితులతో సీఎం మాట్లాడుతూ.. వారికి భరోసా కల్పిస్తూ ముందుకుసాగారని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఇంటికీ, పంటకూ పరిహారం ఇస్తామని సీఎం స్పష్టంచేశారని, ఎవరూ ఆందోళన చెందొద్దని కూడా హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. అదే.. 2014లో హుద్‌హుద్ తుపాను బాధితులను చంద్రబాబు బెదిరిస్తూ మాట్లాడిన విధానాన్ని అందరం చూశామన్నారు. బాధిత ప్రజలు ఆనాడు మాట్లాడడానికి యత్నిస్తే.. ‘ఊరికే తమాషాలడొద్దు’.. అంటూ బెదిరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అదే ప్రస్తుత సీఎం జగన్ వరద బాధితులను ఆత్మీయంగా పలకరించి, ఓపిగ్గా వారి మాటలు విని సమస్యలు పరిష్కరించారన్నారు. -
అక్కా.. సాయం అందిందా?
వేలేరుపాడు, చింతూరు: ‘చరిత్రలో ఇప్పటి వరకు కన్నాయిగుట్ట గిరిజన గ్రామానికి ఏ ముఖ్యమంత్రీ రాలేదు. మొదటిసారిగా మా అభిమాన నేత కష్టాల్లో ఉన్న మమ్మల్ని పలకరించి మనోధైర్యాన్ని నింపేందుకు కొండలు, కోనలు దాటుకుని వచ్చారు. ఆయన రాకే మాకు కొండంత భరోసా ఇచ్చింది. ఆయన మాట్లాడాక మాలో భయం పోయింది’ అంటూ ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం హెలీప్యాడ్‌కు చేరుకున్నప్పటి నుంచి గ్రామంలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కాన్వాయి వెంట బారులు తీరి సీఎంతో కరచాలనం చేయడానికి పెద్ద ఎత్తున జనం పోటీపడ్డారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలతో, గ్రామస్తులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కా.. అన్నా.. సాయం అందిందా.. అంటూ ఆరా తీశారు. ప్రభుత్వ సాయం బాగా అందిందని, అందరూ ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. దాదాపు అర కిలోమీటరుకు పైగా సీఎం నడుచుకుంటూ వెళ్లి బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నీట మునిగిన ఇళ్లకు రూ.4 వేలు ఉన్న పరిహారాన్ని రూ.10 వేలు చేస్తాం అని చెప్పారు. అనంతరం ఫొటో ఎగ్గిబిషన్‌ను పరిశీలించారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం చింతూరు మండలం కుయిగూరులో పడిపోయిన ఇంటిని సీఎం తొలుత పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ముందు వరుసలో కూర్చొన్న ఓ బాలికను ఆప్యాయంగా పిలిచి దీవించడంతో పాటు ప్రసంగం ముగిసే వరకు తన వద్దే నిలబెట్టుకున్నారు. సూరన్నగొందికి చెందిన జానీ అనే యువకుడు తమ గ్రామంలో పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా వుందని, దానిని పూర్తి చేయాలని కోరాడు. నాడు–నేడులో పాఠశాలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చట్టి గ్రామానికి బస్సులో బయలుదేరిన సీఎం.. మార్గంమధ్యలోని నిమ్మలగూడెం వద్ద బస్సు నుంచి దిగి వారితో మాట్లాడారు. సరోజిని అనే వృద్ధురాలు గత ఆరు నెలలుగా తనకు గొంతు సరిగా పనిచేయక మాట రావడంలేదని చెప్పారు. ఆమెకు వైద్యం చేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎనిమిదేళ్ల దివ్యాంగ బాలిక మడకం దుర్గాభవానీకి పింఛను రావట్లేదని తెలపడంతో.. పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP Special: సానుభూతి వద్దు... సమాజంలో గౌరవం కావాలి
సమాజంలో మాకు తగిన గౌరవం కావాలి.. ఉద్యోగసానుభూతి వద్దు.. సమాజంలో ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సహకాలు ఇవ్వాలి.. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ పథకాలతో పూట గడుపుకుంటున్న శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అంటున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ‘మరోక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ అని వీరికి పేర్లు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైన వైకల్యం కలిగి ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లయితే.. అలాంటి వ్యక్తిని అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నిర్ధారిస్తారు. అంధత్వం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఎందరో దివ్యాంగులు వివిధ రంగాల్లో రాణిస్తూ మరి కొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన సి.ఆర్.వి. ప్రభాకర్ విద్యారంగంలో సాధించిన తాను సాధించిన విజయానలకు అంగవైకల్యం ఏ మాత్రం ఆటంకం కాదని నిరూపించాడు. ఈయన తండ్రి సి. వెంకటేశ్వర శర్మ, తల్లి విద్యావతి. తండ్రి సి.వెంకటేశ్వర శర్మ.. టీటీడీలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డు అయ్యారు. ఈ దంపతులకు ప్రభాకర్ రెండవ సంతానం. ప్రభాకర్.. గత 22 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చిన సమస్యను ఎప్పుడూ లోపంగా పరిగణించలేదు. కేవలం వీల్‌చైర్‌కే ఇతని జీవితం పరిమితమైనప్పటికీ ఎంతో కృషితో ఉన్నత చదువులు చదివారు. ఇటివల సీఏ(చార్టెర్డ్ అకౌంటెంట్) కోర్సును పూర్తిచేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఆత్మగౌరవంతో మరికొందరికి స్ఫూర్తి అవుతానని అభిప్రాయ పడ్డారు. అదే విధంగా.. వ్యాపార రంగంలో ప్రోత్సాహలు ఇవ్వాలని అన్నారు. మనదేశంలో అంగవైకల్య సమస్యకు సరైన మందులు, సర్జరీ సౌకర్యాలు లేవని అన్నారు. అమెరికా వంటి దేశంలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అయితే, రూ.15 కోట్ల ఖర్చు చేసిన అది తాత్కలిక వైద్యమే అన్నారు. తాను ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశానని అన్నారు. ఓ వ్యాపార సంస్థ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది తన జీవిత లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మరిన్నిసబ్సిడీతో కూడిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభాకర్ కోరాడు. తిరుత్తణి దేవ పెయింటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పూట గడుపుతున్నాం.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ప్రాథమిక వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నామని తిరుత్తణి దేవ అనే పెయింట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత 17 సంవత్సరాలుగా పెయింట్ చేస్తూ బతుకున్నానని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మఒడి, వికలాంగ పింఛను,వైఎస్సార్ ఆసరా, భరోసా వంటి పథకాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఆశయం గొప్పదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చిరు వ్యాపారాలు ప్రారంభించాలని , అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యాయని వాపోయాడు. బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని తెలిపారు. తనలాంటి దివ్యాంగులకు ఎలాంటి సిఫారసు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని పెయింటర్ తిరుత్తణి దేవ కోరుతున్నాడు. -
సంధి ముగిసె.. ఇక వేటకు వెడలవలె!
సాక్షి, ఒంగోలు : గంగమ్మ తల్లిని నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి ముందు వేట.. వెనుక అప్పులు అన్నచందంగా మారింది. మరో 24 గంటల్లో మత్స్యకారులు వేటకు బయలుదేరే సమయం ఆసన్నమైంది. వేట నిషేధ సంధికాలం ముగియనుండటంతో మత్స్యకారులు వేటకు కావాల్సిన వలలు, పడవలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 60 రోజుల పాటు సముద్రంలో వేట లేక పూట గడవక నానా తంటాలు పడిన మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సంధికాలం ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం త్వరగా అందించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. సముద్రంలో వేటనిషేధ సమయంలో ప్రభుత్వం అందించే కరువుభత్యం సాయం గత టీడీపీ ప్రభుత్వం సరిగా అందించకపోవడంతో జాలర్లు నానా కష్టాలు పడ్డారు. అయితే గతనెల 30న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి తమకు అండగా నిలుస్తాడని మత్స్యకారులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. బాబు హయాంలో అరకొరగా సాయం.. సముద్రంలో మత్స్య సంపంద పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట నిషేధాన్ని విధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఏటా వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి జీవనభృతి కింద 31 కేజీల బియ్యాన్ని అందించేందుకు చట్టాన్ని రూపొందించింది. అయితే 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత మాజీ సీఎం చంద్రబాబు జీవన భృతి కింద ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. సంధికాలం సాయం అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారు. వేట నిషేధ కాలం శుక్రవారంతో పూర్తవుతున్నప్పటికి ధా సమయంలో అందించాల్సిన ప్రభుత్వ సాయం (జీవన భృతి) నేటికి ఒక్కరికి కూడా మత్య్సకారులకు అందలేదు. అయితే ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్య్సకారులకు జీవనభృతి కింద ఒకొక్కరికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో గంగపుత్రులు గండెడాశతో ఎదురు చూస్తున్నారు. ప జిల్లాలో 102 కిలో మీటర్ల మేర తీరం ఉండగా 74 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 80వేలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, కఠారివారిపాలెం గ్రామాల్లో మత్య్సకారులే అధికం. వీరందరికి సముద్రంలో వేటే జీవన ఆధారం. ఈ గ్రామాల్లోని ప్రజలందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేట, మత్య్స సంపద అమ్మకాలపైనే ఆదారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సాయానికి మెలికలు పెట్టి కొందరికే తూతూ మంత్రంగా చంద్రబాబు సాయం అందించారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి ఆ ఇబ్బందులు ఉండవని వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే సాయం సరైన సమయంలో వైఎస్ జగన్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
బీడీ చుడితేనే బతుకు సాగేది!
బీడీలు చుడితేనే వారి బతుకుబండి సాగేది.. ఏళ్లకు ఏళ్లు కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వలేని దైన్యం. పీఎఫ్ లేదు.. వైద్యం లేదు. యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నా.. వీరు మాత్రం మరింత పేదరికంలోకి వెళ్తున్నారు. పిల్లలకు మంచి విద్య, వైద్యం అందించలేక కార్మికులు అవస్థల పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50వేలమంది కార్మికులు దీనావస్థలో ఉన్నారు. చిన్నచింతకుంట (దేవరకద్ర) చిన్నచింతకుంట మండలంలోని ఫ్యాక్టరీలు.. కొన్నేళ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 50వేల మంది బీడీ కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. ఒక కార్మికుడు వెయ్యి బీడీలను చుడితే రూ.150లు దినసరి కూలీ చెల్లిస్తున్నారు. ప్రభుత్వం 41జీఓ ప్రకారం ఒక వెయ్యి బీడీలు చుడితే రూ.200చెల్లించాలని జీఓ విడుదల అయినప్పటికీ యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రోజు కార్మికులు ఇళ్లు గడవక తమ పిల్లలకు మంచివిద్య, వైద్యం అందించలేక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలతో పాటు చిన్నచింతకుంట మండల కేంద్రం బీడీ పరిశ్రమల కేంద్రంగా కొనసాగుతుంది. అనధికారికంగా 30ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా అందులో 50వేల మంది కార్మికులు రోజుకు 30లక్షల బీడీలను చుట్టి యాజమాన్యాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే చిన్నచింతకుంట మండలంలో దాదాపు 14ఫ్యాక్టరీలు ఉన్నాయి. రెడ్డి బీడి, వస్తాద్ బీడి, ఆజాం బీడి, 3నంబర్ బీడి, అమ్రుతం బీడి, రింగ్రెడ్డి బీడి, చండూల్ బీడి, చంద్రమార్క్ బీడి, వజీర్ బీడి, అమీర్ బీడి, సంఘం బీడి, సమ్మద్ బీడి, రఫిక్, రేఖా బీడి వంటి బీడి పరిశ్రమలు ఇక్కడ కొనసాగతున్నాయి. ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నా కార్మికులకు మాత్రం ఒకటి లేదా రెండు ఫ్యాక్టరీలలో మాత్రమే పీఎఫ్, ఈఎస్ఐ కార్డులను అందించి వారికి జీవనభృతి, గృహాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నారు. మిగతా ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ కార్డులు లేక ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అందక కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్నేళ్ల నుంచి ఈ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ టీబీ, క్యాన్సర్ రోగాల బారిన పడుతూ మరణిస్తున్న వారికి బీడీ ఫ్యాక్టరీల యాజమాన్యం గాని ఇటు ప్రభుత్వం కాని ఎటువంటి గ్రాట్యూటీ అందించలేకపోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని కార్మికులు, ఆయా ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. 41జీఓతో మనుగడ ప్రశ్నార్థకం జీఓ నంబర్ 41 ద్వారా బీడీ కార్మికుల పరిశ్రమలపై పెనుప్రభావం చూపింది. బీడీ కట్టలపై క్యాన్సర్ బొమ్మను ముద్రించడం వల్ల మార్కెట్లో బీడీ కొనుగోలు తగ్గిపోయింది. దీంతో నెలలో 25రోజులు పనికల్పించే బీడీ ఫ్యాక్టరీలు నేడు 10నుంచి 15రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నాయని కార్మికసంఘాల నాయకులు మండిపడుతున్నారు. గుర్తింపు కార్డుల జారీలో.. బీడీ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికులకు గుర్తింపుకార్డులను జారీచేయడంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు గుర్తింపుకార్డులను జారీచేసేలా పీఎఫ్ అమలు పరుస్తు కార్మిక సంక్షేమ శాఖకు కార్మిక వాటాను జమచేయాల్సి ఉంది. కాని వీటిని పట్టించుకోవడానికి యాజమాన్యాలు కేవలం కుటుంబానికి ఒక్క కార్డును మాత్రమే గుర్తింపుకార్డుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆర్థికసాయం అందిస్తున్నప్పటికీ పీఎఫ్ అమలుతో నిమిత్తం లేకుండా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కార్మికుడికి జీవనభృతి అందజేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చిన్నప్పటి నుంచి చేస్తున్నా.. పదేళ్ల వయస్సు నుంచి బీడీ తయారీ చేస్తు కుటుంబపోషణలో పాలుపంచుకుంటున్నాను. పెళ్లయిన తర్వాత కూడా బీడీల తయారీ తప్పలేదు. పిల్లల చదువులు, కుటుంబపోషణ కోసం రోజుకు వెయ్యి బీడీలను చుడుతున్నాను. – బి.లక్ష్మమ్మ, బీడీ కార్మికురాలు ఆదేశాలు జారీచేయాలి 41జీఓ మేరకు వెయ్యి బీడీలు చుడితే రూ.200లు ఇవ్వాలి. అదేవిధంగా మండల కేంద్రంలో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. ప్రతి బీడీ కార్మికుడికి పీఎఫ్‌తో సంబంధం లేకుండా జీవనభృతి అందించాలి. త్వరలో బీడీ ఫ్యాక్టరీల యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ తదితర స్కీంలను వర్తింపజేయాలి. – కె.గణేష్, పీవైఎల్ -రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
క్యూ3 ఫలితాల తర్వాత పీఎస్బీలకు ప్రభుత్వ సాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ)కు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో, తుది విడత నిధుల సాయాన్ని మూడో త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రభుత్వం ప్రకటించనున్నట్టు ఆర్థిక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 26 పీఎస్బీల్లో ఇప్పటి వరకు ఐదు బ్యాంకులు మాత్రమే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 పీఎస్బీలకు ప్రభుత్వం రూ.25వేల కోట్ల నిధులను కేటాయించగా, అందులో రూ.22,915 కోట్లను అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మొదటి విడత సాయాన్ని గతేడాది జూలైలో అందించింది. రుణ కార్యకలాపాలను మెరుగుపరచుకోవడం ద్వారా మార్కెట్ నుంచి మరిన్ని నిధుల సమీకరణకు వీలుగా ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటికే అందించిన సాయం పోను మిగిలిన మేరకు నిధులను అందించనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
మంత్రి దేవినేని ఉమ కానూరు (పెనమలూరు) : ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కానూరులో జరుగుతున్న ఫొటోట్రేడ్షోలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో వచ్చిన నూతన మార్పులను గుర్తించి సమాజానికి మరింత ఉన్నత సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సంఘ అధ్యక్షుడు మాదాల రమేష్, సభ్యులు జానకీరామ్, శ్రీనివాస్, కృష్ణా, గుంటూరు జిల్లాల ఫోటో, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
నడిపించండి మా జీవన నావ
పార్వతీపురంరూరల్: ఆ భార్యాభర్తలిద్దరూ పుట్టుకతో అంధులు. అయినా సరే వారి ఆత్మవిశ్వాసమే అందరిలా వారిని ముందుకు నడిపిస్తోంది. అయితే ఆ దంపతులకు రోజురోజుకూ బతుకుభారం పెరిగిపోవడంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బందలుప్పి గ్రామానికి చెందిన బోగారపు లక్ష్మణరావు పుట్టుకతో అంధుడు, ఆయన తన జీవనం కోసం ఒక వైపు ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ బీఏ పూర్తి చేశాడు. జీవనభృ తికోసం ఈ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు ఆర్కెస్ట్రా బృందాల్లో పాటలు పాడుతున్నాడు. ఈ తరుణంలో ఆయనకు ప్రకాశంజిల్లా ఒంగోలుకు చెందిన అంధురాలు అనూరాధతో పరిచయమయ్యింది. ఆమె ఇంటర్మీడియెట్ చదువుకుంది. ఆమెకూడా ఆర్కెస్ట్రా బృందాల్లో పాటలు పాడడంతో వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి పెళ్లికి దారితీసింది. ఇద్దరూ ఒక ఇంటివారై సంచార జీవనం వీడి బందలుప్పిలో ఉన్న లక్ష్మణరావు ఇంటికి చేరుకున్నారు. అయితే పెరుగుతున్న నిత్యావసర ధరలు వీరి బతుకును భారంగా మార్చాయి. దీంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టు వికలాంగుల కోటాలో మంజూరైంది. దీనికోసం అనూరాధ దరఖాస్తుచేసుకుంది. అయితే రాజకీయ నాయకుల పలుకుబడి ఆమెకు ఆ పోస్టు రానీయకుండా అడ్డుకుంది. సరే పోస్టు పోతే పోయింది కనీస సహాయం ఏదైనా తమకు అందించాలంటూ ఈ దంపతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం వికలాంగుల పింఛనునైనా ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికైనా ఏదో ఒక సహాయం చేసి తమను ఆదుకోవాలని ఆ దంపతులిద్దరూ వినయపూర్వకంగా కోరుకుంటున్నారు. -
సర్వే..శ్వరా!
శ్రీకాకుళం అగ్రికల్చర్: హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో పంటలన్నీ కోల్పోయిన అన్నదాతలు ప్రభుత్వం సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కొత్త కొత్త నిబంధనలు.. ఆంక్షలతో వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. హుదూద్ తీరం దాటి పది రోజులవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు సిద్ధం కాలేదు. ఇప్పటికీ తొలి రోజు అంచనాలనే అధికారులు చెబుతున్నారు.ఇవీ లెక్కలు: వరి 74351 హెక్టార్లు, మొక్కజొన్న 2680, పత్తి పంట 6090, చెరకు 3818, అపరాలు, ఇతర పంటలు 122 హెక్టార్లు వెరసి.. సుమారు 87,151 హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అరటి 1,578, కొబ్బరి 1,082 హెక్టార్లు, జీడిమామిడి 376, బొప్పాయి 38, మామిడి 24 మొత్తం 3,758 హెక్టార్లలోనూ నష్టం వాటిల్లిందనేది అధికారుల అంచనాలు. కానీ జిల్లాలో వరి పంట ఒక్కటే 1.50 లక్షల హెక్టార్ల పైబడి నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అన్ని పంటలూ అధికారుల అంచనాలకు రెట్టింపులోనే ఉన్నాయని ఆవేదనభరితంగా చెబుతున్నారు. అంచనాల కోసం అధికారుల సర్వే మూడు రోజులుగా గ్రామాల్లో నష్టం అంచనాలకు అధికారులు రైతులతో కలిసి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు జియోగ్రాఫికల్ సర్వే చేపట్టడంతో ఈ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఇలా అయితే జిల్లాలో పంట నష్టం అంచనాలు పూర్తి కావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులే చెబుతున్నారు. కారణం.. ఒక్కో రైతుకు చెందిన ఒక సర్వే నంబరు వివరాలను అప్లోడ్ చేయడానికి కనీసం అర్ధగంట సమయం పైబడి పడుతోంది. పంట ఎంతమేరకు పోయినా 50శాతం మాత్రమే చూపుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో జియెటాకింగ్ విధానంలో పంటనష్టం సర్వే చేయొద్దని పలు గ్రామాల్లో రైతులు అడ్డుకుంటున్నారు. సవాలక్ష ఆంక్షలు పంట నష్టం అంచనాల తయారీకి ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధించింది. రైతు ఆధార్ నంబర్, పేరు.. తదితర కుటుంబ వివరాలతోపాటు మొబైల్ నంబరు తదితర అన్ని వివరాలూ అవసరమని పేర్కొంది. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా జియోమెట్రిక్ విధానంలో సర్వేకు వీలుకాదు. సర్వే నంబర్లు విషయానికోస్తే సర్వే నంబరు, మొత్తం విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది/ఎన్ని మొక్కలకు నష్టం జరిగింది. పంట కేటగిరి, చిన్నా, సన్నకారు రైతా.. పెద్ద రైతా.. పంట నష్టం శాతం ఎంతఅనేవి నమోదు చేయాలి. ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులు పంటలు వేస్తే ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులతో జియోటాకింగ్ విధానంలో వారందరికీ ఫోటోలు తీయాలి. అంతేకాకుండా ఒకే సర్వే నంబరులో ఒకే రైతు వేర్వేరు పంటలు వేసినా అప్పుడు కూడా ఒకే రైతు అన్ని పంటల వద్ద ఫొటోలు తీయించాలి. ఇలా చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలంలో సుమారు 19 వేలకు పైబడి సర్వే నంబర్లున్నారు. ఒక్కో సర్వే నంబరులో సుమారు 10 నుంచి 20 పైబడి సబ్ డివిజన్లుంటాయి. వీటిలో అన్నదమ్ముల వాటాలు, ఇతరత్రా కారణాల వల్ల ఎ, బీ, సీ వంటి విభజనలు జరిగి ఉంటే మరిన్ని ఉంటాయి. వీటన్నంటికీ రైతులను పెట్టి ఫొటోలు తీయాలంటే కష్టమేనని రైతులు తీవ్రస్థాయిలో మథనపడుతున్నారు. వీటితో పాటు బ్యాంకు పేరు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబరు, అక్షాంశ.. రేఖాంశాలు, ఫొటో ఉండాలి. ఆధార్, ఫోన్ నంబర్లు లేని రైతులు అనేకం జిల్లాలో ఆధార్‌కార్డులు లేని రైతులు అనేకమంది ఉన్నారు. నేటికీ ఆధార్ కార్డుల కోసం త హశీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రద క్షణలు చేస్తున్నారు. అలాంటిది ఆధార్ నంబర్లు అంటే ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్లు లేనివారు లెక్కలేనంతమంది. దీంతో రైతులను మభ్యపెట్టి పరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఈ కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి -
గుండె కోత
సాక్షి, కడప : నందలూరు మండలం నల్లదిమ్మాయపల్లె గ్రామంలో అధికారులు పంటకోత ప్రయోగాలుచేస్తే ఎకరాకు దాదాపు 765 కేజీల దిగుబడిమాత్రమే వచ్చింది. ఎకరాకు 10 బస్తాల దిగుబడి మాత్రమే రావడం గమనార్హం. చెన్నూరులో పంట కోత ప్రయోగాలు చేస్తే ఎకరాకు 988 కేజీల దిగుబడి మాత్రమే వచ్చింది. తుపాన్ కారణంగా ఎక్కువ తాలు పోయినట్లు రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది వరి సాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. తెల్లదోమ, అగ్గితెగులుతో పాటు తుపాన్ల ధాటికి అన్నదాతలు విలవిల్లాడారు. పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరాకు 2 నుంచి 20 బస్తాలలోపే సరాసరిన పంట దిగుబడి వచ్చే పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇటీవల జిల్లాలో చేపట్టిన పంటకోత ప్రయోగాల్లో ఈ వాస్తవాలు వెల్లడైనట్లు సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,16,375 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. సరాసరిన ఎకరాకు రూ. 15 నుంచి రూ. 20 వేల పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉంది. సరాసరిన 20 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తారు. ఇలా వస్తే కనీసం పెట్టుబడులతో నష్టాలు లేకుండా గట్టేక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి ధాన్యం బస్తా రూ. 1200 పలుకుతోంది. పంట కోత ప్రయోగాల లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది రైతుకు కనీసం పంట పెట్టుబడులు కూడా రావడం గగనమే. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వరి రైతుకు గుండె‘కోత’నే మిగిల్చింది. పంట కోత ప్రయోగాలిలా... వరికి పంటల బీమాకు సంబంధించి గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. జిల్లాలోని 51మండలాల్లోని 228 గ్రామాల్లో సరాసరిన 1224 చోట్ల 5 ఇన్టు 5 విస్తీర్ణంలో పంటకోత ప్రయోగాలు చేస్తారు. ప్రతి గ్రామంలో నాలుగు చోట్ల 5 ఇన్టు 5 విస్తీర్ణంలో పంటకోత ప్రయోగాలు చేసి ఎకరాకు 162 ప్లాట్లుగా చేసి సరాసరిన దిగుబడిని లెక్కగడతారు. ఈ దిగుబడి వివరాలను ప్రభుత్వానికి పంపుతారు. వీటి ఆధారంగా జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం (ఎన్ఏఐఎస్) రైతులకు పంటల బీమాను చెల్లిస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం 5 ఇన్ టు 5మీటర్ల విస్తీర్ణంలో 16 కేజీలు అంటే ఎకరాకు 1875 కేజీల వరి ధాన్యం రావాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఈఏడాది కొన్ని మండలాల్లో 2 నుంచి 10 బస్తాలలోపే పంట దిగుబడి రావడం గమనార్హం. దీంతో అన్నదాతలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంట రుణాలు ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గిరి సీమ సంపూర్ణ అభివృద్ధి కృషి
ఉట్నూర్, న్యూస్‌లైన్ : సమగ్ర గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఐటీడీఏ ఆధీనంలోని 4.95లక్షల మంది ఆదివాసీ గిరిజనుల ప్రగతికి బాటలు వేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ అన్నారు. గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న 905 ప్రాథమిక పాఠశాలల్లో 983 మంది ఉపాధ్యాయులతో 19,212 మంది విద్యార్థులకు ప్రాథమిక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. మరో 256 మంది ఎస్జీటీల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నత విద్యాభివృద్ధికి 577 మంది సీఆర్టీలను నియమించామని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 146 ఆశ్రమ, వసతి, కస్తూరిబా, గురుకుల, మినీ గురుకుల పాఠశాలలు, ఆరు గురుకుల కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల ద్వారా 42,493 మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్నామని వివరించారు. పునాది, క్వెస్ట్, రూపాంతర్, దిశ కార్యక్రమాలతో మెరుగైన విద్యకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హరివిల్లు కింద 137 పాఠశాలల్లో సర్వే నిర్వహించామని అన్నారు. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 89.68 శాతం ఉత్తీర్ణత సాధించగా 92 మంది గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించామని పేర్కొన్నారు. 31 పీహెచ్‌సీల్లో 186 ఉప కేంద్రాలు, 11క్లస్టర్ల ద్వారా గిరిజనులకు నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పిన్ పాయింట్, ర్యాపిడ్ ఫీవర్ సర్వేల్లో గుర్తించిన జ్వర పీడితులు, రక్తహీనత, అతిసార, మలేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. 27 పీహెచ్‌సీలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించామని, ఏజెన్సీలో వ్యాధుల నివారణకు టోల్‌ఫ్రీ నంబరు 18004255226 ఏర్పాటు చేశామన్నారు. నాలుగు డీఆర్‌డిపోల నిర్మాణానికి రూ.48.40 లక్షలు, 12 అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ.51 లక్షలు నాబార్డు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఐఏపీ పథకం కింద రూ.34.60 కోట్లతో 229 రకాల పనులు చేపట్టామన్నారు. అర్హులైన 37,589 మంది గిరిజనులకు 4,05,628.14 ఎకరాల భూములపై అటవీ హక్కు పత్రాలు అందజేశామని వివరించారు. ఆమ్ఆద్మీ, జనశ్రీ యోజన పథకాల కింద 1,085 మంది విద్యార్థులకు రూ.12.91 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ చెశారు. ఈ వేడుకల్లో ఐటీడీఏ ఏపీఓ(జనరల్) వెంకటేశ్వర్లు, మలేరియా అధికారి అల్హం రవి, ఈఈటీడబ్ల్యు శంకరయ్య, ఏఓ భీం, ఈజీఎస్ఏపీడీ(టీపీఏంయూ) నూరొద్దీన్, ఐటీడీఏ మేనేజర్ స్వామి, ఈజీఎస్ అంబుడ్సుమెన్ నాగోరావు, జన వికాస జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి పాల్గొన్నారు