బీడీ చుడితేనే బతుకు సాగేది! | special story on beedi workers lives | Sakshi
Sakshi News home page

బీడీ చుడితేనే బతుకు సాగేది!

Published Tue, Feb 6 2018 5:42 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

special story on beedi workers lives - Sakshi

సీసీకుంటలో బీడీల తయారీలో నిమగ్నమైన మహిళలు

బీడీలు చుడితేనే వారి బతుకుబండి సాగేది.. ఏళ్లకు ఏళ్లు కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వలేని దైన్యం. పీఎఫ్‌ లేదు.. వైద్యం లేదు. యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నా.. వీరు మాత్రం మరింత పేదరికంలోకి వెళ్తున్నారు. పిల్లలకు మంచి విద్య, వైద్యం అందించలేక కార్మికులు అవస్థల పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50వేలమంది కార్మికులు దీనావస్థలో ఉన్నారు. చిన్నచింతకుంట (దేవరకద్ర)

చిన్నచింతకుంట మండలంలోని ఫ్యాక్టరీలు..
కొన్నేళ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 50వేల మంది బీడీ కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. ఒక కార్మికుడు వెయ్యి బీడీలను చుడితే రూ.150లు దినసరి కూలీ చెల్లిస్తున్నారు. ప్రభుత్వం 41జీఓ ప్రకారం ఒక వెయ్యి బీడీలు చుడితే రూ.200చెల్లించాలని జీఓ విడుదల అయినప్పటికీ యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రోజు కార్మికులు ఇళ్లు గడవక తమ పిల్లలకు మంచివిద్య, వైద్యం అందించలేక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలతో పాటు చిన్నచింతకుంట మండల కేంద్రం బీడీ పరిశ్రమల కేంద్రంగా కొనసాగుతుంది. అనధికారికంగా 30ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా అందులో 50వేల మంది కార్మికులు రోజుకు 30లక్షల బీడీలను చుట్టి యాజమాన్యాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే చిన్నచింతకుంట మండలంలో దాదాపు 14ఫ్యాక్టరీలు ఉన్నాయి.  
 
రెడ్డి బీడి, వస్తాద్‌ బీడి, ఆజాం బీడి, 3నంబర్‌ బీడి, అమ్రుతం బీడి, రింగ్‌రెడ్డి బీడి, చండూల్‌ బీడి, చంద్రమార్క్‌ బీడి, వజీర్‌ బీడి, అమీర్‌ బీడి, సంఘం బీడి, సమ్మద్‌ బీడి, రఫిక్, రేఖా బీడి వంటి బీడి పరిశ్రమలు ఇక్కడ కొనసాగతున్నాయి. ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నా కార్మికులకు మాత్రం ఒకటి లేదా రెండు ఫ్యాక్టరీలలో మాత్రమే పీఎఫ్, ఈఎస్‌ఐ కార్డులను అందించి వారికి జీవనభృతి, గృహాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నారు. మిగతా ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్‌ కార్డులు లేక ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అందక కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్నేళ్ల నుంచి ఈ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ టీబీ, క్యాన్సర్‌ రోగాల బారిన పడుతూ మరణిస్తున్న వారికి బీడీ ఫ్యాక్టరీల యాజమాన్యం గాని ఇటు ప్రభుత్వం కాని ఎటువంటి గ్రాట్యూటీ అందించలేకపోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని కార్మికులు, ఆయా ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.

41జీఓతో మనుగడ ప్రశ్నార్థకం 
జీఓ నంబర్‌ 41 ద్వారా బీడీ కార్మికుల పరిశ్రమలపై పెనుప్రభావం చూపింది. బీడీ కట్టలపై క్యాన్సర్‌ బొమ్మను ముద్రించడం వల్ల మార్కెట్‌లో బీడీ కొనుగోలు తగ్గిపోయింది. దీంతో నెలలో 25రోజులు పనికల్పించే బీడీ ఫ్యాక్టరీలు నేడు 10నుంచి 15రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నాయని కార్మికసంఘాల నాయకులు మండిపడుతున్నారు.

గుర్తింపు కార్డుల జారీలో.. 
బీడీ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికులకు గుర్తింపుకార్డులను జారీచేయడంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు గుర్తింపుకార్డులను జారీచేసేలా పీఎఫ్‌ అమలు పరుస్తు కార్మిక సంక్షేమ శాఖకు కార్మిక వాటాను జమచేయాల్సి ఉంది. కాని వీటిని పట్టించుకోవడానికి యాజమాన్యాలు కేవలం కుటుంబానికి ఒక్క కార్డును మాత్రమే గుర్తింపుకార్డుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆర్థికసాయం అందిస్తున్నప్పటికీ పీఎఫ్‌ అమలుతో నిమిత్తం లేకుండా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కార్మికుడికి జీవనభృతి అందజేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

చిన్నప్పటి నుంచి చేస్తున్నా..  
పదేళ్ల వయస్సు నుంచి బీడీ తయారీ చేస్తు కుటుంబపోషణలో పాలుపంచుకుంటున్నాను. పెళ్లయిన తర్వాత కూడా బీడీల తయారీ తప్పలేదు. పిల్లల చదువులు, కుటుంబపోషణ కోసం రోజుకు వెయ్యి బీడీలను చుడుతున్నాను.  

– బి.లక్ష్మమ్మ, బీడీ కార్మికురాలు 

ఆదేశాలు జారీచేయాలి 
41జీఓ మేరకు వెయ్యి బీడీలు చుడితే రూ.200లు ఇవ్వాలి. అదేవిధంగా మండల కేంద్రంలో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. ప్రతి బీడీ కార్మికుడికి పీఎఫ్‌తో సంబంధం లేకుండా జీవనభృతి అందించాలి. త్వరలో బీడీ ఫ్యాక్టరీల యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర స్కీంలను వర్తింపజేయాలి. – కె.గణేష్, పీవైఎల్‌

 -రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

చిన్నచింతకుంటలో వందేళ్లుగా నడుస్తున్న చంద్రమార్క్‌ బీడీ ఫ్యాక్టరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement