
ప్రతీకాత్మక చిత్రం
పాలమూరు: మారిన జీవన శైలితో ఎక్కువగా వస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలా జిల్లాలో ఎవరికైనా గుండెపోటు వచ్చిందా.. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొస్తే చికిత్స అందే పరిస్థితులు లేవు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యి నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం లేకపోవడం దురదృష్టకరం. నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రిలో అత్యంత ముఖ్యమైన విభాగాల్లో అవసరమైన నిపుణులు లేకపోవడంతో అత్యవసర కేసులను హైదరాబాద్ పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయలేక.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు.
సాధారణ వైద్యమే..
మూత్రపిండాల సమస్య ఉందా.. ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందా.. కేన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే హైదరాబాద్, లేదంటే ఇతర ఇతర నగరాలకు వెళ్లాల్సిందేనంటూ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రే కాదు.. ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు ఇచ్చే సలహా ఇది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీజనల్ వ్యాధులకు చికిత్స చేసే వైద్యులు తప్ప పెద్ద జబ్బులకు ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా భావించే మహబూబ్‌నగర్‌లోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఖాళీల కారణంగా పేద ప్రజలు వేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడి పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తద్వారా అత్యవసర విభాగాల్లోనూ ఎంబీబీఎస్, శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులతోనే వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి చేజారాక అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాల్సి వస్తే మధ్యలో ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చి నాలుగేళ్లవుతున్నా నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉండాల్సిన విభాగాలు, వైద్యులు, వసతులు కల్పించకపోవడం గమనార్హం.
ప్రైవేట్‌లోనూ లేరు
మహబూబ్‌నగర్ పట్టణంలో గుండెకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ లేవు. ఇక గుండె సంబంధిత నిపుణులు లేకపోవడంతో పేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది.
ఇవీ పోస్టులు
గుండె సంబంధిత నిపుణులే కాదు.. జనరల్ ఆస్పత్రిలో ఇతర విభాగాల్లోనూ వైద్యుల కొర త ఉంది. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 పోస్టులకు ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక జనరల్ సర్జరీలో 14 మందికి ఇద్దరు, ఆర్థోలో ఆరుగురికి ఒకరు, పీడియాట్రిక్‌లో 12 మందికి ముగ్గురు, గైనిక్‌లో 12 మందికి ముగ్గురు, ఈఎన్‌టీలో ముగ్గురికి ఒక్కరు, డెర్మటాలజీలో ముగ్గురికి ఒక్కరు, అనస్థీషియాలో 14 మంది కి నలుగురు వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నా రు. దీంతో పేదలకు నిరాశే ఎదురవుతోంది.
కార్డియాలజీ సేవలు అవసరం
జనరల్ ఆస్పత్రిలో ఒక్కరైనా కార్డియాలజిస్ట్ ఉండాలి. ఈ విభాగం లేకపోవడం, వైద్యుల నియామకం జరకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైనా వస్తే జనరల్ మెడిసిన్ వైద్యులు చూస్తున్నారు అత్యవసరమైతే హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో నిపుణులను నియమించాల్సి ఉంది.
– డాక్టర్ రామకిషన్, సూపరింటెండెంట్