అనిల్ (ఫైల్), అఖిల (ఫైల్)
సాక్షి, బల్మూర్(అచ్చంపేట): పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమజంట కలిసి బతకకపోయినా.. కలిసి తనవు చాలించాలని నిర్ణయించుకొని ఉరేసుకొని మృతిచెందారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బిల్లకల్ అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. బిల్లకల్‌కు చెందిన రాయ అఖిల(19), చెంచుగూడెంకు చెందిన అనిల్(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబాల పెద్దలకు తెలియటంతో పెళ్లికి నిరాకరించి మందలించారు. దీంతో కలిసి చావాలని నిర్ణయించుకొని సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రుసుల చెరువు అటవీశాఖ బేస్ క్యాంప్ వద్దకు బైక్‌పై వెళ్లారు.
క్యాంప్ వెనుక భాగంలో ఉన్న చెట్టుకు చున్నీతో ఇద్దరూ ఉరేసుకుని మృతిచెందారు. అటుగా వెళ్లిన మేకల కాపరులు గుర్తించి ఇరువురి కుటుంబ»సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనలో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఎంపీపీ అరుణ, సర్పంచ్ అంజనమ్మ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
పోక్సో కేసు నమోదు
గోపాల్‌పేట: మండలంలోని తాడిపర్తికి చెందిన సురేశ్‌పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామగౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువతిని సురేశ్ ప్రేమించి ఆరునెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరకట్నం తీసుకురావాలని సురేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు.
యువకుడి బలవన్మరణం
పెబ్బేరు(కొత్తకోట): మండలంలోని తోమాలపల్లిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ జయన్న కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుడిసె వెంకటేష్ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకుని మృతిచెందాడు. పారిశుద్ధ్య పనులకు వెళ్లిన తల్లి ఇంద్రమ్మ ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అయిదు నెలల క్రితమే వివాహమైందని.. తరచూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి ఇంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఏఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment