ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జేసీ వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మా గోడు వినండయ్యా అంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ సమావేశం హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కొమురయ్య, మెప్మా పీడీ గోపాల్ ప్రజలనుంచి వినతలు, ఫిర్యాదులు స్వీకరించారు. తిరిగి తిరిగి అలిసిపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
భూసమస్యలు, పెన్షన్లు, రుణాలు, సర్వే సమస్యలపై పలువురు ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదని కలెక్టర్ సూచించారు. మొత్తం 89 ఫిర్యాదులు, వినతులు అధికారులకు అందాయి. ప్రజావాణి కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఫిర్యాదుదారులకు ఉచితంగా ఫిర్యాదులను రాసిచ్చారు.
ఫిర్యాదులు ఇలా.
- పాలమూర్ స్యాండ్ వెబ్‌సైట్‌లో హన్వాడ మండలం పేరు లేకపోవడంతో ఇసుకను బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని, స్థానిక వాగుల్లో ఇసుక తీసుకునేందుకు అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణయ్య, లక్ష్మయ్య, బసిరెడ్డి, జంబులయ్య తదితరులు కోరారు.
- తమకు ఉన్న కొంచెం భూమి కోయిల్‌సాగర్ కాల్వలో పోగా.. మిగిలిన కొంత భూమిని జాతీయ రహదారి 167 నిర్మాణానికి తీసుకుంటామని చెబుతున్నారని దేవరకద్ర మండలం గోప్లాపూర్ రైతులు పేర్కొన్నారు. తమ భూమి కాకుండా అవతలి వైపు రోడ్డు నిర్మించాలని కోరారు.
- గ్రామంలో తమ భూమిని దౌర్జన్యంగా ప్లాట్లుగా మారుస్తున్నారని, సహాయం చేయాల్సిన గ్రామ ప్రజా ప్రతినిధి, న్యాయవాది తమపై దౌర్జన్యం చేస్తూ మా భూమిని ప్లాట్లుగా మార్చారని నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్, కుమారుడు బాబా తమ ఆవేదనను అధికారులకు చెప్పుకున్నారు.
- కోస్గి మండల కేంద్రంలో నెహ్రూ పార్కు వద్ద కూరగాయలు అమ్ముకునే 30మందిని ఖాళీ చేయించి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ మహిళలు, గ్రామస్తులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
- గ్రామ సమీపంలోని మొగుళ్ల కుంటను తొలగించి అక్రమంగా ప్లాట్లుగా మార్చేందుకు కబ్జాదారులు వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని భూత్పూర్ మండలం తాటిపర్తికి చెందిన మత్స్య సహకార సంఘం సభ్యులు డి.కృష్ణయ్య, బాలకిష్టయ్య, వెంకటయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment