
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించి, వారికి ప్రకటించిన సాయం అందించాక.. సీఎం పర్యటనలో అక్కడి ప్రజల అభిప్రాయాలు విన్న తర్వాత కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా పర్యటిస్తున్నారని సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. నిజానికి.. బురద రాజకీయం చేసేందుకే ఆయన అక్కడ పర్యటిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలకు, నష్టాలకు చంద్రబాబే కారణమని, తన పదవీ కాలం సమయంలో ప్రజాసంక్షేమం పక్కనపెట్టి, రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్నారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ముంపు సమయాల్లో ఎప్పుడూ కూడా ఇంతవేగంగా సహాయం అందలేదని, ఇప్పుడు సహాయం అందకుండా ఒక్క కుటుంబం కూడా లేదని ఆయా గ్రామాల ప్రజలు సీఎం జగన్‌కు వివరించారన్నారు. వలంటీర్ల పనితీరుపై కూడా గ్రామస్తులు ప్రశంసలు కురిపించారని.. సీఎం తన పర్యటనలో బాధితులతో నేరుగా మాట్లాడి వారి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారని తెలిపారు.
బాబువి బెదిరింపులు.. జగన్‌వి ఆత్మీయ పలకరింపులు
ఇక వరద సమస్యలతో పాటు పలు ఇతర సమస్యలపైనా స్థానిక ప్రజలు సీఎంకు విజ్ఞప్తులు, అర్జీలు అందించారని.. పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సీఎం ఆదేశాలు జారీచేశారన్నారు. బాధితులతో సీఎం మాట్లాడుతూ.. వారికి భరోసా కల్పిస్తూ ముందుకుసాగారని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఇంటికీ, పంటకూ పరిహారం ఇస్తామని సీఎం స్పష్టంచేశారని, ఎవరూ ఆందోళన చెందొద్దని కూడా హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. అదే.. 2014లో హుద్‌హుద్ తుపాను బాధితులను చంద్రబాబు బెదిరిస్తూ మాట్లాడిన విధానాన్ని అందరం చూశామన్నారు. బాధిత ప్రజలు ఆనాడు మాట్లాడడానికి యత్నిస్తే.. ‘ఊరికే తమాషాలడొద్దు’.. అంటూ బెదిరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అదే ప్రస్తుత సీఎం జగన్ వరద బాధితులను ఆత్మీయంగా పలకరించి, ఓపిగ్గా వారి మాటలు విని సమస్యలు పరిష్కరించారన్నారు.