వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరద ఉధృతిలో సర్వం కోల్పోయారు. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. వరదలో నిత్యావసరాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కోల్పోయారు. కట్టుకోవడానికి బట్టలు.. కప్పుకోవడానికి దుప్పటి కుడా లేని దుస్థితి నెలకొంది.
వరదల నుంచి తేరుకొని మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నష్టపరిహారం ఇస్తుందా లేదా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆపన్నహస్తాల కోసం ఎదురు చుస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరిని కదిలించినా క‘న్నీరే’ ఉబికివస్తోంది. కాగా, నిత్యావసర వస్తులు అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.
ప్రభుత్వం నుంచి అందని తక్షణ సాయం
ఊరికి ఊరంత వరదలో మునగడంతో కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులకు ప్రభుత్వం నుంచి కనీసం తక్షణ సాయం కూడా అందలేదు. నిత్యావసర వస్తువులు, బియ్యం కూడా పంపిణీ చేయలేదు. నష్టపోయిన ఆస్తికి, పశువులకు పరిహారం కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. 10 ఇళ్లు వరద తాకిడి దెబ్బతినగా చెంచుకాలనీకి చెందిన 18 గుడిసెలు వరదలో కొట్టుకుపోయాయి.
ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాధితులు అందోళన చెందుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోరంచపల్లి బస్టాండ్ సమీపంలోని సంతోషిమాత సూపర్‌మార్కెట్‌లో రూ. 20లక్షల విలువైన కిరాణా సామగ్రి తడిసి పాడైంది.
ముందుకు వస్తున్న పలువురు..
మోరంచపల్లిలో జరిగిన నష్టాన్ని చూసిన పలువురు చలించిపోతున్నారు. పగవారికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని వేడుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నాయకులు ముందుకు వచ్చి బియ్యం, కూరగాయలు, వంట సామాను, చద్దర్లు, మ్యాట్లు, పండ్లు, పప్పులు, చీరలు, ఇతర వస్తువులు ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు అందజేస్తున్నారు.
రూ.20 లక్షల నష్టం జరిగింది
మోరంచపల్లిలో వచ్చిన వరదతో మా సూపర్‌మార్కెట్‌లో రూ.20లక్షల విలువైన వస్తువులు తడిసి పాడయ్యాయి. చక్కెర, పప్పు, పిండి, బియ్యం ఇతర వస్తువులు పాడయ్యాయి. అప్పు తెచ్చి షాపు ఏర్పాటు చేసుకున్న. వస్తువులు కొనుగోలు చేసిన సెట్లకు ఇంకా డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – దొడ్డశాని సంతోష్, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు
ఇంటికి రూ. 4లక్షలు ఇవ్వాలి
వరద ఉధృతిలో సర్వం కోల్పోయాం. ప్రతి ఇంటికీ ప్రభుత్వం రూ.4లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. వరదలో 3 తులాల బంగారం, రూ.15వేల నగదు, వంట గ్యాస్, భూమి పాస్‌పుస్తకాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి. మిగిలిన వస్తువులను కడుకుంటున్నాం. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా వచ్చి నష్టం గురించి సర్వే చేయలేదు. – సూరం రాజయ్య, వరద బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment