లోహిత(ఫైల్)
వరంగల్: పశువులు మేపేందుకు వెళ్లి ప్యారంకుంటలో మునిగి యువతి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉనికిచర్ల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉనికిచర్ల చెందిన ఆక లోహిత(21) ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే ఆమె తండ్రి శ్రీనివాస్ సొంత పనులకు శనివారం ముల్కనూర్‌కు వెళ్లగా ఇంటి వద్ద ఉన్న తమ గేదెలను మేపడానికి ఉనికిచర్ల శివారులోని ప్యారంకుంట వైపు వెళ్లింది.
ఈ క్రమంలో సాయంత్రం వేళ గేదెలు ప్యారంకుంటలో నుంచి మరో పక్కకు వెళ్లాయి. అటువైపున పొలంపని చేస్తున్న ఓ వ్యక్తి ఆ యువతికి ఫోన్ చేసి గేదెలను అటు వైపునకు తోలుతున్నానని చెప్పాడు. అనంతరం మరోసారి ఫోన్ చేయగా యువతి ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి యువతి తండ్రికి ఫోన్ చేసి లోహిత ఫోన్ ఎత్తడం లేదని చెప్పగా ఇద్దరు కలిసి ప్యారంకుంట వద్దకు వెళ్లారు.
కుంట కట్టపై యువతి చెప్పులు, కర్ర, లంచ్ బాక్స్, సెల్‌ఫోన్ కనిపించాయి. దీంతో వారు కుంటలోకి దిగి వెతకగా లోహిత మృతదేహం లభ్యమైంది. కాగా కుంటలోని గేదెలను ఇటువైపునకు తోలుకొని రావడానికి కుంటలోకి దిగగా ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెంది ఉంటుందని ఆదివారం మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment