ఉమ్మడి జిల్లాకు.. ఆత్మీయ 'చంద్రమోహను'డు! | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాకు.. ఆత్మీయ 'చంద్రమోహను'డు!

Published Sun, Nov 12 2023 1:14 AM | Last Updated on Sun, Nov 12 2023 11:49 AM

- - Sakshi

మేనమామ చంద్రమోహన్‌తో బాలగంగాధర్‌తిలక్‌ (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ శనివారం కన్నుమూశారు. అందరికీ ఆత్మీయుడైన చంద్రమోహన్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థల కళాకారుడు, డిప్యూటీ డీఈఓ బూర విద్యాసాగర్‌గౌడ్‌ అధ్యక్షతన 1993లో వరంగల్‌ నటరాజ ఆర్ట్స్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి చంద్రమోహన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ నాటిక ప్రదర్శనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు నటులు రాళ్లపల్లి, పీజేశర్మ, సాయికుమార్‌, నటి కిన్నెర, వందేమాతరం శ్రీనివాస్‌ నటించారు.

చంద్రమోహన్‌తో కలిసి భోజనం చేస్తున్న మైక్రో ఆర్టిస్ట్‌ అజయ్‌కుమార్‌ (ఫైల్‌)

ఈ మేరకు రంగస్థల కళాకారుడు బూరవిద్యాసాగర్‌ గౌడ్‌, మైక్రోఆర్టిస్ట్‌ మట్టెవాడ అజయ్‌కుమార్‌, ఓరుగల్లు శారదానాట్యమండలి నిర్వాహకుడు జేఎన్‌ శర్మ, పద్యనాటక కళాకారుడు జూలూరు నాగరాజు, ఫ్రెండ్స్‌ కల్చరల్‌ సొసైటీ నిర్వాహకుడు బిటవరం శ్రీధరస్వామి, జేబీ కల్చరల్‌ సొసైటీ జడల శివ తదితరులు చంద్రమోహన్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్‌ అడుగు ఎత్తుంటే సినీ ఇండస్ట్రీని ఏలే వారని మహానటుడు ఎన్టీఆర్‌తో పాటు పలువురు సీనియర్‌ నటులు ప్రశంసించారని, చంద్రమోహన్‌కు నాటకాలంటే ప్రాణమని వరంగల్‌కు చెందిన కళాకారులు గుర్తు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement