క్యూ3 ఫలితాల తర్వాత పీఎస్‌బీలకు ప్రభుత్వ సాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ)కు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో, తుది విడత నిధుల సాయాన్ని మూడో త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రభుత్వం ప్రకటించనున్నట్టు ఆర్థిక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 26 పీఎస్‌బీల్లో ఇప్పటి వరకు ఐదు బ్యాంకులు మాత్రమే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 పీఎస్‌బీలకు ప్రభుత్వం రూ.25వేల కోట్ల నిధులను కేటాయించగా, అందులో రూ.22,915 కోట్లను అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మొదటి విడత సాయాన్ని గతేడాది జూలైలో అందించింది. రుణ కార్యకలాపాలను మెరుగుపరచుకోవడం ద్వారా మార్కెట్ నుంచి మరిన్ని నిధుల సమీకరణకు వీలుగా ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటికే అందించిన సాయం పోను మిగిలిన మేరకు నిధులను అందించనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.