ఆదాయం రూ. 63,973 కోట్లు
వచ్చే ఏడాది మరిన్ని ఉద్యోగాలు
ఒక్కో షేరుకి రూ. 76 డివిడెండ్
బెంగళూరులో భూమి కొనుగోలు
ముంబై: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.
విభాగాలవారీగా
ప్రధాన విభాగం బీఎఫ్‌ఎస్‌ఐసహా కన్జూమర్ బిజినెస్ వృద్ధి బాట పట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని విభాగాలలో విచక్షణాధారిత వినియోగం పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. వీటికితోడు ప్రాంతీయ మార్కెట్ల నుంచి డిమాండ్ బలపడుతున్నట్లు వివరించింది. వెరసి భవిష్యత్ వృద్ధి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు చేపడుతున్నట్లు మానవ వనరుల ప్రధాన అధికారి మిలింద్ లక్కడ్ తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరింత మందికి ఉపాధి కలి్పంచే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 1,625 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ కంపెనీ నుంచి బెంగళూరులో భూమిని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ పేర్కొంది.
ఇతర విశేషాలు
→ కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది.
→ ఉద్యోగుల సంఖ్యలో నికరంగా 5,370 కోతపడింది.
→ మొత్తం సిబ్బంది సంఖ్య 6,07,354 మందికి చేరింది.
→ ఈ ఏడాది 40,000 క్యాంపస్ ప్లేస్‌మెంట్ల సాధనవైపు సాగుతోంది.
→ డివిడెండుకు రూ. 21,500 కోట్లు వెచ్చించనుంది.
→ నిర్వహణ లాభ మార్జిన్లు 0.4 శాతం మెరుగుపడి 24.5 శాతాన్ని తాకాయి.
→ ఐటీ సర్విసుల ఉద్యోగ వలసల రేటు 13 శాతంగా నమోదైంది.
మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.7% క్షీణించి రూ. 4,037 వద్ద ముగిసింది.
ఆర్డర్ల జోరు
పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
– కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్
Comments
Please login to add a commentAdd a comment