BFSI
-
టీసీఎస్ లాభం అప్ క్యూ3లో రూ. 12,380 కోట్లు
ముంబై: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది. విభాగాలవారీగా ప్రధాన విభాగం బీఎఫ్ఎస్ఐసహా కన్జూమర్ బిజినెస్ వృద్ధి బాట పట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని విభాగాలలో విచక్షణాధారిత వినియోగం పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. వీటికితోడు ప్రాంతీయ మార్కెట్ల నుంచి డిమాండ్ బలపడుతున్నట్లు వివరించింది. వెరసి భవిష్యత్ వృద్ధి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు మానవ వనరుల ప్రధాన అధికారి మిలింద్ లక్కడ్ తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరింత మందికి ఉపాధి కలి్పంచే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 1,625 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ కంపెనీ నుంచి బెంగళూరులో భూమిని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ పేర్కొంది.ఇతర విశేషాలు → కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. → ఉద్యోగుల సంఖ్యలో నికరంగా 5,370 కోతపడింది. → మొత్తం సిబ్బంది సంఖ్య 6,07,354 మందికి చేరింది.→ ఈ ఏడాది 40,000 క్యాంపస్ ప్లేస్మెంట్ల సాధనవైపు సాగుతోంది. → డివిడెండుకు రూ. 21,500 కోట్లు వెచ్చించనుంది. → నిర్వహణ లాభ మార్జిన్లు 0.4 శాతం మెరుగుపడి 24.5 శాతాన్ని తాకాయి. → ఐటీ సర్విసుల ఉద్యోగ వలసల రేటు 13 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.7% క్షీణించి రూ. 4,037 వద్ద ముగిసింది. ఆర్డర్ల జోరు పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. – కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్ -
బీఎఫ్ఎస్ఐలో జోరుగా నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వ్యక్తిగత రుణాలతో పాటు టూవీలర్లు, కార్లు మొదలైన వాహన రుణాలకు డిమాండు 12 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్లో వినాయక చవితితో మొదలై నవంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్లో కార్యకలాపాలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు ఈ బిజీ వ్యవధిలో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు అందించగలిగే, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే నైపుణ్యాలున్న సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం బీఎఫ్ఎస్ఐ రంగంలో రిటైల్ రుణాలు, సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), పేమెంట్ సేవల విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. పండుగ సీజన్ దన్నుతో జూలై–నవంబర్ మధ్య కాలంలో ఈ విభాగాల్లో కొలువులు సంఖ్య 12,000 నుంచి 19,000కు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ పేర్కొంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడం, చిన్న మొత్తాల్లో రుణాలివ్వడంపై మైక్రోఫైనాన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో ఎంఎఫ్ఐ సరీ్వసులకు డిమాండ్ 25 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, పేమెంట్ సరీ్వసుల్లో హైరింగ్ 41 శాతం పెరుగుతుందని, క్రెడిట్ కార్డుల విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ 32 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ వివరించింది. కొత్త నైపుణ్యాల్లో సిబ్బందికి శిక్షణ .. ఆర్థిక సేవల సంస్థలు కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడమే కాకుండా బిజీ సీజన్లో మార్కెట్ డిమాండ్‌కి తగ్గ సేవలందించేలా ప్రస్తుత ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపైనా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఎప్పుడైనా సరే పండుగ సీజన్లో బీఎఫ్‌ఎస్‌ఐపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. రిటైల్ రుణాల నుంచి పేమెంట్ సేవల వరకు ఈ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా డేటా ప్రకారం కంపెనీలు కూడా పరిస్థితులకు తగ్గట్లే స్పందిస్తున్నాయి. కీలకమైన ఈ సీజన్లో నిరంతరాయ సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతున్నాయి’’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వీపీ కృషే్ణందు చటర్జీ తెలిపారు. -
ఏడాదిలో 61,600 మంది ఉద్యోగులు రాక! కారణం..
తెలంగాణ రాష్ట్రంలో నికరంగా వైట్‌కాలర్(ప్రొఫెషనల్) ఉద్యోగులు పెరుగుతున్నారని ఎక్స్‌ఫెనో సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల నుంచి 61,600 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారని, వివిధ కారణాలతో 41,400 మంది రాష్ట్రాన్ని వీడారని సంస్థ పేర్కొంది. ఈమేరకు సంస్థ సహవ్యవస్థాపకులు కమల్ కరంత్ ‘టాలెంట్ పాజిటివ్ తెలంగాణ 2024’(రెండో ఎడిషన్) పేరుతో నివేదిక విడుదల చేశారు.నివేదికలోని వివరాల ప్రకారం..తెలంగాణలో వైట్‌కాలర్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 12 నెలల కాలంలో 61,600 వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వివిధ కారణాలతో 41,400 మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. నికరంగా తెలంగాణ 20,200 మంది వైట్‌కాలర్ ఉద్యోగులను సంపాదించింది.రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ వైట్‌కాలర్ ఉద్యోగులు 41.8 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ఏటా 12 శాతం పెరుగుతోంది. అందులో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగిన వారు 50% మంది ఉన్నారు.కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 18.7 లక్షల మంది అనుభవజ్ఞులైన వైట్ కాలర్ ఉద్యోగులున్నారు.హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, హనుమకొండలో అధికంగా ఈ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు.2023 లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో పురుషులు 68 శాతం, మహిళలు 32 శాతం ఉన్నారు. 2023తో పోలిస్తే 2024లో మహిళా ఉద్యోగులు సంఖ్య ఒక శాతం పెరిగింది.టెక్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, హెచ్ఆర్ విభాగాలను ఎంచుకుంటున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే వారి సంఖ్య 12.3 లక్షలు, మాస్టర్స్ డిగ్రీ 4.61 లక్షలు, ఎంబీఏ 3.35 లక్షలు, పీహెచ్డీ 41 వేలు, అసోసియేట్ డిగ్రీ 20 వేలుగా ఉంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీదేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హరియాణా, గుజరాత్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయా మినహా అన్ని రాష్టాల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది.తెలంగాణకు వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారున్నారు. గడిచిన ఏడాది కాలంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 55,400గా ఉంది.తెలంగాణ నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు ఎక్కువ మంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 38,700గా ఉంది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపించడం ద్వారా ఇతర దేశాల్లోని వారు తెలంగాణకు వస్తున్నారు. యూఎస్, యూకే, యూఏఈ, కెనడా నుంచి అధికంగా వలసలున్నాయి. ఏడాదిలో వీరి సంఖ్య 20,400గా ఉంది.ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 50,700గా ఉంది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!నివేదిక విడుదల సందర్భంగా ఎక్స్‌ఫెనో సహవ్యవస్థపకులు కమల్ కరంత్ మాట్లాడుతూ..‘తెలంగాణ వివిధ రంగాల్లోని వైట్‌కాలర్ ఉద్యోగులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మౌలికసదుపాయాలు పెరిగాయి. వ్యూహాత్మక పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ప్రగతిశీల విధానాలు రూపొందించడం, వ్యాపార ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలతో ఇది సాధ్యమవుతోంది. అయితే రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో మెరుగైన వసతులు, వేతనాలు ఉండడం ఇందుకు కారణం. ఉద్యోగులు ప్రమోషన్ కోసం, ఇతర రంగాలను ఎంచుకోవడానికి, తమ అభివృద్ధికి అనువైన నాయకత్వం..వంటి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. -
యువతకు నైపుణ్యమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసి పరిశ్రమలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామని వివరించారు. పరిశ్రమల డిమాండ్‌కు తగినట్టుగా అభ్యర్థులను తయారు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. బుధవారం జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ‘బీఎఫ్ఎస్ఐ స్కిల్ డెవలప్మెంట్’కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. బీఎఫ్ఎస్ఐ వెబ్‌సైట్‌ను ప్రారంభించి, కోర్సులతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రతి విద్యా సంవత్సరం సగటున లక్ష మంది ఇంజనీర్లు, రెండు లక్షల మంది డిగ్రీ కోర్సులు పూర్తి చేసి పట్టా పొందుతున్నారు. గత పదేళ్లలో ముప్పై లక్షల మంది గ్రాడ్యుయేట్లుగా అర్హత సాధించినప్పటికీ.. మెజార్టీ పిల్లలు ఇప్పటికీ ఉద్యోగాలు సాధించలేదు. ఇందుకు కారణం వారికి పరిజ్ఞానం ఉన్నా సరైన నైపుణ్యం లేకపోవడమే. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఈ అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. మా ప్రభుత్వం ఈ అంశంపై చొరవ తీసుకుని వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది..’’అని రేవంత్ చెప్పారు. డిమాండ్‌కు తగినట్టుగా.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి వాటి భర్తీకి చర్యలు వేగవంతం చేశామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసినంత మాత్రాన నిరుద్యోగం తొలగిపోదు. ప్రైవేటు మార్కెట్లో డిమాండ్‌కు తగినట్లుగా అభ్యర్థులను తీర్చిదిద్దే బాధ్యతను స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలను ఈ వర్సిటీ పాలకమండలిలో భాగస్వామ్యం చేశాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో దాదాపు 5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థుల తయారీ కోసం బీఎఫ్ఎస్ఐని సంప్రదించాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేలా కోర్సును ప్రారంభించాం..’’అని తెలిపారు. పదివేల మంది అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను సీఎస్ఆర్ కింద పారిశ్రామికవేత్తలే సమకూర్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. డ్రగ్ పెడ్లర్లుగా మారడం ఆందోళనకరం రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరగడం ఆందోళనకరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్లలో ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని ఆరోపించారు. ‘‘కొందరు ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన పట్టభద్రులు డ్రగ్ పెడ్లర్లుగా మారడం బాధాకరం. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులు, పట్టుబడుతున్నవారి సమాచారాన్ని వింటున్నప్పుడు ఎక్కువగా యువత ఉండటం కలిచివేస్తోంది..’’అని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడంతోపాటు ఐటీకి డెస్టినీగా అభివృద్ధి చేస్తామని.. వచ్చే ఏడాది కాలంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచబ్యాంకు చైర్మన్ అజయ్‌బంగా, శంతను నారాయణన్, సత్య నాదెళ్ల, అజీమ్ ప్రేమ్‌జీ వంటి ప్రముఖులతో డిసెంబర్లో ప్రత్యేక సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజిద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజీ విద్య కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాకల్టీ లేకుంటే కాలేజీల అనుమతులు రద్దు కొన్ని వృత్తి విద్యా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ఇకపై పూర్తిస్థాయి ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలను నిర్వహిస్తే అనుమతులు రద్దు చేసేందుకు వెనుకాడం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా అప్‌గ్రేడ్ చేశాం. వాటి ఆధునీకరణ కోసం టాటా సంస్థ ముందుకు రావడం శుభపరిణామం. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి పక్కాగా ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా బీఎఫ్ఎస్ఐ కోర్సులు అమలు చేస్తున్న 38 కాలేజీల్లో శిక్షణ పొందిన వారికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’’అని పేర్కొన్నారు. కోర్సు ముగిసిన వెంటనే ఆరు నెలల ఇంటర్న్‌షిప్: మంత్రి శ్రీధర్‌బాబు బీఎఫ్ఎస్ఐ కోర్సు ముగిసిన వెంటనే అభ్యర్థులకు ఆరు నెలలపాటు వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో చూపిన నైపుణ్యానికి అనుగుణంగా వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఒక్కో అభ్యర్ధికి కనిష్టంగా రూ.25 వేల వరకు వేతనం అందుతుందన్నారు. బీఎఫ్ఎస్ఐ కోర్సు నేర్చుకోవాలంటే బహిరంగ మార్కెట్లో వేల రూపాయలను ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇక్విప్ సంస్థ సహకారంతో పదివేల మంది అభ్యర్థులకు ఉచితంగా కోర్సును అందిస్తోందని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఆ సంస్థ రూ.2.5 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. పదేళ్లపాటు ఎలాంటి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చని గత పాలకులు.. ఇప్పుడు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. -
38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కచ్చితమైన ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత కాలేజీల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జాబ్ గ్యారంటీ కోర్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ డిగ్రీతోపాటు మినీ డిగ్రీ కోర్సుగా ‘బీఎఫ్ఎస్ఐ’ నైపుణ్య శిక్షణను అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది. ఈ కాలేజీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌తో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ‘బీఎఫ్ఎస్ఐ’ కోర్సులు అందేవిధంగా కాలేజీలను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకోనున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది. ఆ కంపెనీలు ఈ పోర్టల్‌లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో డిగ్రీ, ఇంజనీరింగ్‌లో కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ భరోసా దక్కనుంది. జాబితాలోని నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ– వడ్డేపల్లి, హన్మకొండ ఎస్ఆర్–బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ– ఖమ్మం నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల– నల్గొండ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్ భవన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి నిజాం కాలేజీ, హైదరాబాద్ ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహదీపట్నం, హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం హైదరాబాద్ తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్‌నగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్ జాబితాలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. బీవీఆర్ఐటీ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జేఎన్టీయూహెచ్) గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేబి ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (జేఎన్టీయూహెచ్) జేఎన్టీయూ కూకట్పల్లి ప్రధాన క్యాంపస్ (జేఎన్టీయూహెచ్) కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్టీయూహెచ్) వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (జేఎన్టీయూహెచ్) కిట్స్ వరంగల్ (కాకతీయ వర్సిటీ) చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ) మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) మెథడిస్ట్ ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ) బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జేఎన్టీయూహెచ్) -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!
Jobs In Festival Season: త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలు ఇప్పటికే క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ అండ్ రిటైల్ బీమాలలో పెరుగుదలను ఆశిస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 50వేల ఉద్యోగాలు.. నివేదికల ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయి. మునుపటి ఏడాదికంటే కూడా ఈ సారి ఈ రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నామని టీమ్‌లీజ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్-BFSI కృష్ణేందు ఛటర్జీ తెలిపారు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! పండుగ సీజన్లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్ 1 నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలైన కొచ్చి, వైజాగ్, మధురై.. లక్నో, చండీగఢ్, అమృత్సర్, భోపాల్, రాయ్‌పూర్‌లలో కూడా ఎక్కువగా ఉండనుంది. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ వేతనం వివరాలు.. నిజానికి ఈ టెంపరరీ ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే కూడా 7 నుంచి 10 శాతం పెరిగాయి. కావున ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో జీతాలు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు.. అదే సమయంలో చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు & కలకత్తాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే జీతాలు కూడా ఓ రకంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
12 శాతం అధికంగా నియామకాలు
ముంబై: దేశంలో ఉద్యోగ నియామకాలు ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో (జనవరి–మే) 12 శాతం పెరిగినట్టు ఆల్‌సెక్ టెక్నాలజీస్ ప్రకటించింది. నైపుణ్య సేవలు, తయారీరంగం, బీఎఫ్ఎస్ఐ, ఈ కామర్స్, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలపై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా కంపెనీలు కఠిన విధానాలను అవలంబిస్తున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం నియామకాలు గతేడాదితో పోలిస్తే మెరుగుపడ్డాయి. 2023 జనవరి–మే మధ్య నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 12 శాతం పెరిగాయి. భారత కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతులను అధిగమించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్ పెట్టుబడులు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది రానున్న సంవత్సరాల్లో ఉపాధికి ఊతమిస్తుంది’’అని ఆల్‌సెక్ టెక్నాలజీస్ సీఈవో నాజర్ దలాల్ తెలిపారు. భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. నిపుణులకు డిమాండ్ నైపుణ్య సేవల రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు రెట్టింపయ్యాయి. ట్యాక్సేషన్, బిజినెస్ కన్సలి్టంగ్, రిస్క్ అడ్వైజరీ, డీల్ అడ్వైజరీ, టెక్నాలజీ సేవలు, పర్యావరణం, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ) సేవల్లో నియామకాల జోరు కనిపించింది. తయారీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూడగా 50 శాతం వృద్ధి కనిపించింది. భారత ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతుండడం సానుకూలంగా ఈ నివేదిక తెలిపింది. ఫలితంగా ఇది ఉపాధికి మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ, ఈ–కామర్స్ రంగాల్లోనూ నియామకాలు 16 శాతం అధికంగా జరిగాయి. బ్యాంక్‌లు పనితీరు మెరుగుపడడం, రుణాలకు డిమాండ్ పెరగడం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. ఇంటర్నెట్ విస్తరణ ఈ కామర్స్ రంగానికి అనుకూలమని తెలిపింది. వ్యాపారానికి మరింత అనుకూలమైన వాతావరణం, భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా చేయాలని కేంద్రం భావిస్తుండడం భవిష్యత్తులో మరింతగా ఉపాధి కల్పనకు దారితీస్తుందని విశ్లేశించింది. -
టెక్నాలజీయేతర రంగాల్లో టెకీలకు డిమాండ్
ముంబై: టెక్నాలజీయేతర రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 2027–28 నాటికి 6 పరిశ్రమలు 10 లక్షల మందికి పైగా టెకీలను నియమించుకోనున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టెక్నాలజీయేతర రంగాలైన బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా).. కన్సల్టింగ్, కమ్యూనికేషన్ మీడియా, రిటైల్, లైఫ్ సైన్సెస్.. హెల్త్‌కేర్ తదితర రంగాల సంస్థలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 లక్షల మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ రంగాల్లో 7 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రమేయం ఉంటోంది. 5జీ సేవలు ప్రారంభం కావడం, డిజిటల్ చెల్లింపుల వృద్ధి, కొత్త తరం వ్యాపారాల వస్తుండటం, ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం పెరుగుతుండటం, డిజిటల్ పరివర్తన మొదలైన పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో టెక్నాలజీయేతర రంగాల్లోనూ టెకీలకు డిమాండ్ ఏర్పడుతోంది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ తెలిపారు. నిపుణుల కొరత.. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ నిపుణుల లభ్యత ఆ స్థాయిలో లేకపోవడం పరిశ్రమలకు పెద్ద సవాలుగా ఉంటోందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ (స్పెషలైజ్డ్ స్టాఫింగ్ విభాగం) మునీరా లోలివాలా తెలిపారు. టెకీలను నియమించుకోవడంతో పాటు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ వ్యవస్థను నైపుణ్యాల ఆధారితమైనదిగా తీర్చిదిద్దుకునేందుకు పటిష్టమైన పునాది వేసుకోవచ్చని మునీరా వివరించారు. ‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీయేతర రంగాల్లో ఇప్పటికీ నియామకాలనేవి పర్మనెంట్ ఉద్యోగాల ప్రాతిపదికన ఉండటం లేదు. 54 శాతం సంస్థలు మాత్రమే పర్మనెంట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఏకంగా 30 శాతం సంస్థల్లో నియామకాలు రకరకాల కాంట్రాక్టుల రూపంలో ఉంటున్నాయి‘ అని ఆమె పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్రాంతం, వేతనాలపరంగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ మెరుగ్గా ఉంటున్నాయి. బెంగళూరులో టెకీల్లో 27 శాతం మందికి, హైదరాబాద్‌లో 16 శాతం, ఢిల్లీ.. పుణెల్లో 13 శాతం మందికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. -
ఐటీకి బ్యాంకింగ్ షాక్!
రెండు వారాలుగా అమెరికా, యూరప్ ప్రాంతాల బ్యాంకింగ్ రంగంలో ఒకేసారి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. పలు బ్యాంకులు మూత పడుతున్నాయి. దీంతో దేశీ ఐటీ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ ఆదాయంలో అత్యధిక వాటాకు ప్రాతినిధ్యం వహించే బీఎఫ్ఎస్ఐ విభాగం ఇందుకు కారణం కానున్నట్లు అంచనా. సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్దిరోజులుగా అటు అమెరికా, ఇటు యూరప్ బ్యాంకింగ్ రంగాలలో ప్రకంపనలు పుడుతున్నాయి. అమెరికాలో ఉన్నట్టుండి సిల్వర్‌గేట్ క్యాపిటల్ మూతపడగా.. వైఫల్యాల బాటలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎఫ్‌డీఐసీ) టేకోవర్ చేసింది. ఈ బాటలో సిగ్నేచర్ బ్యాంక్ సైతం దివాలాకు చేరగా.. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ ఆదుకుంది. అనుబంధ సంస్థ ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ ద్వారా ఆస్తుల కొనుగోలుకి అంగీకరించింది. ఇక మరోపక్క యూరోపియన్ బ్లూచిప్ క్రెడిట్ సూసీ దివాలా స్థితికి చేరడంతో స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని ఫైనాన్షియల్ రంగ దిగ్గజం యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకోవాలని జేపీ మోర్గాన్ ఇతర దిగ్గజాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2008 తదుపరి మరోసారి ఫైనాన్షియల్ రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవల రంగాన్ని దెబ్బ తీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోలుకుంటున్న వేళ కోవిడ్–19 సవాళ్లలో ఊపందుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇటీవల రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కొంత అనిశ్చిత వాతావరణాన్ని చవిచూస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగ నియామకాలు మందగించగా.. వచ్చే ఏడాదిపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇంతలోనే బ్యాంకింగ్ రంగ సంక్షోభం ద్వారా మరో షాక్ తగలనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో కుదుపుల కారణంగా దేశీ ఐటీ దిగ్గజాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు. బీఎఫ్ఎస్ఐ దెబ్బ దేశీ ఐటీ సేవల రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సాఫ్ట్వేర్ రంగ సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 20–40 శాతం వాటాను ఆక్రమిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈ వాటా 41 శాతాన్ని తాకనున్నట్లు అంచనా. ఇటీవల సవాళ్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు ప్రధానంగా దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్ సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసీ, యూబీఎస్లకు టీసీఎస్ ఐటీసర్వీసులు సమకూర్చుతోంది. ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం సైతం సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనే ఈ కంపెనీలు ప్రొవిజన్లు చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తదుపరి బ్యాంకులు వ్యయాల తగ్గింపు, బిజినెస్ పెంపు ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో దీర్ఘకాలంలో ఐటీ రంగం బలపడిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి డీల్స్ తగ్గనుండగా.. కాంట్రాక్ట్ ధరలపై సైతం ఒత్తిడి తలెత్తవచ్చని అంచనా. దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల్లో ఉత్తర అమెరికా, యూరోపియన్ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది క్యూ4పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది ప్రతికూలతలు కనిపించవచ్చని నిపుణులు తెలియజేశారు. మందగమనం అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కొత్త డీల్స్ మందగించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ఆటోమేషన్ ప్రాసెస్, ట్రాన్స్ఫార్మేషన్ ప్రణాళికలు తదితరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే వీలున్నట్లు తెలియజేశారు. ఇది ఐటీ కాంట్రాక్టులు ఆలస్యమయ్యేందుకు కారణంకావచ్చని విశ్లేషించారు. తాజా ఐటీ వ్యయ ప్రణాళికలు వాయిదా పడవచ్చని, కొత్త ఆర్డర్లకు విఘాతం కలగవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎఫ్ఎస్ఐ అతిపెద్ద విభాగమని దీంతో దేశీ సాఫ్ట్వేర్ సేవలకు దెబ్బ తగలవచ్చని పేర్కొన్నారు. -
జోరుగా హైరింగ్.. టెలికం, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో భారీగా నియామకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో నెలా నియామకాలకు డిమాండ్ కొనసాగింది. ప్రధానంగా టెలికం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), దిగుమతి .. ఎగుమతి రంగాల్లో హైరింగ్ పెరిగింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి మే లో 9 శాతం వృద్ధి నమోదైంది. రిక్రూట్మెంట్ సమాచార సంస్థ మాన్స్టర్డాట్కామ్కు చెందిన ఉద్యోగాల సూచీ (ఎంఈఐ) ప్రకారం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘దేశవ్యాప్తంగా వివిధ వ్యాపార విభాగాలు కోలుకోవడం, 5జీ సేవలు ప్రారంభం కానుండటం తదితర అంశాల ఊతంతో నియామకాలకు సంబంధించి 2022–23 ఆర్థిక సంవత్సరం ఘనంగానే ప్రారంభమైంది. ఇప్పటివరకూ అయితే దేశీ జాబ్ మార్కెట్ మెరుగ్గానే ఉంది‘ అని మాన్‌స్టర్‌డాట్‌కామ్ సీఈవో శేఖర్ గరిశా తెలిపారు. ప్రతిభావంతులను నియమించుకోవాలని రిక్రూటర్లు భావిస్తున్నారని, మార్కెట్లో కచి్చతంగా వారికి డిమాండ్ నెలకొంటుందన్నారు. నివేదికలో ప్రధాన అంశాలు.. సరఫరా వ్యవస్థలు మెరుగుపడటంతో దిగుమతులు, ఎగుమతుల విభాగంలో జాబ్ పోస్టింగ్‌లు 47 శాతం పెరిగాయి. డిజిటైజేషన్, నగదురహిత చెల్లింపులు, డిజిటల్ మనీ తదితర విధానాలు బీఎఫ్‌ఎస్‌ఐకి దన్నుగా ఉన్నాయి. ఈ విభాగంలో నియామకాలు 38 శాతం పెరిగాయి. 5జీ సేవల ప్రారంభం అంచనాలపై టెలికం/ఐఎస్పీ విభాగాల్లో జాబ్ పోస్టింగ్‌ల వృద్ధి 36 శాతంగా ఉంది. ట్రావెల్, టూరిజం విభాగాలు పూర్తిగా కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటిలో నియామకాల పోస్టింగ్‌లు 29 శాతం పెరిగాయి. వాస్తవానికి ఏప్రిల్‌తో పోలిస్తే (15 శాతం) ఈ విభాగం దాదాపు రెట్టింపు అయ్యింది. ఉద్యోగులు క్రమంగా ఆఫీసు బాట పడుతుండటంతో ఆఫీస్ పరికరాలు, ఆటోమేషన్ విభాగాల్లో నియామకాలు 101 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 25 శాతం మేర పెరిగాయి. రిటైల్ విభాగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. 2021 సెప్టెంబర్ నుండి మీడియా, వినోద రంగంలో క్షీణత కొనసాగుతోంది. మే నెలలో హైరింగ్ 19 శాతం తగ్గింది. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఐరన్..స్టీల్ విభాగాల్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు 9 శాతం మేర తగ్గాయి. షిప్పింగ్, మెరైన్‌లో 4% క్షీణత నమోదైంది. కరోనా మహమ్మారి అనంతరం రికవరీలో ద్వితీయ శ్రేణి పట్టణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా నగరాలవారీగా చూస్తే కోయంబత్తూర్‌లో అత్యధికంగా నియామకాల పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 27 శాతం పెరిగాయి. ముంబైలో ఇది 26 శాతంగా ఉంది. ఇక ఢిల్లీ–రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), హైదరాబాద్‌లో జాబ్ పోస్టింగ్‌ల వృద్ధి 16 శాతంగా నమోదైంది. చెన్నై (15 శాతం), పుణె (13%), బెంగళూరు (9%), కోల్‌కతా (6%) పెరిగాయి. -
ఫిబ్రవరి 11–13 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 11 –13 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ 11వ ఎడిషన్ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. మూడు రోజుల ప్రదర్శన లేఅవుట్‌ను క్రెడాయ్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), సేవల రంగాలలో స్థిరమైన ఉపాధి కారణంగా ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని తెలిపారు. దీంతో యువతరంలో ఆకాంక్షలు పెరుగుతున్నాయని ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు దోహదమవుతుందని పేర్కొన్నారు. రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టే కొనుగోలుదారుల సగటు వయస్సు 35 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కొనుగోలుదారుల జనాభా తక్కువగా ఉందని వివరించారు. కరోనా తర్వాతి నుంచి హైబ్రిడ్ పని విధానంతో అపార్ట్మెంట్ సైజ్లు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్ రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత భవనాల ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటించే విధంగా ప్రదర్శనలో స్టాల్స్, ఎగ్జిబిషన్ లేఅవుట్‌ను రూపొందించామన్నారు. నిర్మాణ సంస్థలతో పాటూ మెటీరియల్ వెండర్లు, తయారీ కంపెనీలు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రదర్శనలో స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జి. ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావు, ట్రెజరర్ ఆదిత్యా గౌర, జాయింట్ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
ధరల స్పీడ్ కట్టడికి కేంద్రం చర్యలు దోహదం
ముంబై: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో సానుకూల అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కట్టడిలోనే ఉన్నప్పటికీ, మొత్తంగా అన్ని విభాగాలూ చూస్తే, ద్రవ్యోల్బణం పెరుగుదల కనబడుతోందని ఆయన అన్నారు. అయితే సరఫరాల సమస్య భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణమని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాల విషయంలో సరఫరాల సమస్యలను తొలగించంతోపాటు, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ఇటీవల తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కదలికలను ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సదస్సులో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రసంగం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి కీలకమైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధర ణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. క్రిప్టో కరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై గవర్నర్ మరోసారి తన ‘‘తీవ్ర ఆందోళన’’ను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వం కోణంలో పరిశీలిస్తే, రెగ్యులేటర్‌గా తమకు క్రిప్టో కరెన్సీలపై ఆందోళన ఉందని వివరించారు. క్రిప్టో మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్యను భారీగా పెంచి చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయితే పరిమాణం పరంగా సంఖ్య పెరుగుతోందని మాత్రం అంగీకరించారు. క్రిప్టో మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని గవర్నర్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సవివరమైన నివేదికను సమర్పించిందని, ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్బీఐ నిర్వహి స్తుందా? అన్న ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్ నిరాకరించారు. ఈ ఏడాది మేల్లో కూడా దాస్ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి ప్రతికూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగు తోందని ఈ వార్తల కథనం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై దాస్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది. -
‘క్యూ2’ కిక్!
కరోనా కల్లోలం నుంచి భారత కంపెనీలు కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు దీనికి స్పష్టమైన సంకేతాలిచ్చాయి. చాలా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. రానున్న త్రైమాసికాల్లోనూ ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విస్తృతస్థాయి రికవరీతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అందించిన ప్యాకేజీల దన్ను దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు. కరోనా కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో చరిత్రలో మునుపెన్నడూ చూడనంత దారుణమైన స్థాయిలో క్యూ1 ఫలితాలను కంపెనీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోలం కారణంగా పలు కంపెనీలు పటిష్టమైన వ్యయ నియంత్రణ చర్యలు తీసుకున్నాయి. ఈ చర్యలకు కొన్ని కంపెనీల ‘లో బేస్ ఎఫెక్ట్’ కూడా తోడవడంతో ఈ క్యూ2లో 2,371 కంపెనీల నికరలాభం రెండున్నర రెట్లు పెరిగింది. నికర అమ్మకాలు మాత్రం 4.5 శాతం తగ్గాయి. అమ్మకాలు తగ్గడం ఇది వరుసగా మూడో త్రైమాసికం అయినప్పటికీ, అంతకు ముందటి రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఒకింత మెరుగుపడ్డాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో కంపెనీల ఆదాయాలు 26 శాతం, నికర లాభం 67 శాతం చొప్పున క్షీణించాయి. డౌన్‌గ్రేడ్ రేటింగ్‌లకు బ్రేక్... కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ అనలిస్ట్ గౌతమ్ దుగ్గడ్ పేర్కొన్నారు. ఈ క్యూ2లో నిఫ్టీ కంపెనీల ఆదాయాలు 6 శాతం, నికర లాభాలు 2 శాతం మేర తగ్గుతాయని అంచనా వేశామని తెలిపారు. కానీ ఈ క్యూ2లో నిఫ్టీ కంపెనీల ఆదాయాలు 7 శాతం తగ్గగా, నికర లాభాలు మాత్రం 22 శాతం మేర పెరిగాయని వివరించారు. మూడేళ్లుగా రాజ్యం చేస్తున్న డౌన్గ్రేడ్ల రేటింగ్‌కు ఈ క్యూ2 ఫలితాలు అడ్డుకట్ట వేశాయని వ్యాఖ్యానించారు. అదరగొట్టిన ఎఫ్ఎమ్సీజీ, హెల్త్‌కేర్... వినియోగం ప్రధానంగా వ్యాపారాలు చేసే కంపెనీల ఫలితాలు అంచనాలను మించాయి. ముఖ్యంగా ఎఫ్ఎమ్సీజీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీలు అదరగొట్టాయి. బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్), సిమెంట్, ఫార్మా, టెక్నాలజీ, కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు ఓ మోస్తరుగా రాణించాయి. వాహన, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగ కంపెనీలు అంతంత మాత్రం పనితీరును కనబరిచాయి. బ్యాంకులకు క్యూ3 ఫలితాలు కీలకం..! మారటోరియం రుణాల కచ్చితమైన ప్రభావం కనబడే డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసు రంగాల కంపెనీలకు కీలకం కానునున్నాయి. అలాగే క్యూ1, క్యూ2ల్లో పతనాన్ని చవిచూసిన పర్యాటక, వినోద, రిటైల్, రెస్టారెంట్ల షేర్లు డిసెంబర్ క్వార్టర్లో ఒకింత మెరుగుపడవచ్చని అంచనాలున్నాయి. క్యూ3, క్యూ4ల్లో మరింత జోరుగా! డిసెంబర్ క్వార్టర్లో కంపెనీల పనితీరు మరింత మెరుగుపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక నాలుగో క్వార్టర్లో మరింత జోరుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి మరో దఫా ఉద్దీపన ప్యాకేజీ లభించే అవకాశాలుండటం, ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా రికవరీ అవుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో కంపెనీల ఆదాయాలు క్రమంగా మెరుగవుతాయని హెచ్డీఎఫ్సీ అనలిస్ట్ దేవర్‡్ష వకీల్ పేర్కొన్నారు. నిఫ్టీ 50 కంపెనీల షేర్‌వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.456గా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.651గా నమోదుకావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఆల్–టైమ్ హైకి కంపెనీల లాభాలు రూ. 1.60 లక్షల కోట్లకు నిర్వహణ లాభం క్రిసిల్ రిపోర్ట్ కంపెనీల నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 15 శాతం పెరిగి జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గి మార్జిన్లు పెరగడం, ఉత్పాదకత స్థాయిలు మరింతగా మెరుగుపడటం దీనికి కారణాలని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఎన్ఎస్ఈలో లిస్టైన 800 కంపెనీల(బ్యాంక్, ఆర్థిక, ఆయిల్, గ్యాస్ కంపెనీలను మినహాయించి) ఆర్థిక ఫలితాలను విశ్లేíÙంచి ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే... ► ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీల నిర్వహణ లాభం ఈ సెప్టెంబర్ క్వార్టర్లో రూ.1.60 లక్షల కోట్లకు పెరిగింది. ► కరోనా కల్లోలం కారణంగా ఆర్థిక వృద్ధి తిరోగమనంలో ఉన్నా కంపెనీల లాభాలు పెరగడం విశేషం. పెరుగుతున్న అసమానతలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ► ఈ క్యూ2లో ముడి పదార్థాల ధరలు పెరిగినప్పటికీ, నిర్వహణ లాభ మార్జిన్లు 1 శాతం మేర పెరిగాయి. ► ఉద్యోగుల వ్యయాలు తయారీ రంగ కంపెనీల్లో 4 శాతం తగ్గగా, సేవల రంగ కంపెనీల్లో ఓ మోస్తరుగా పెరిగాయి. ► నికర లాభాలు పెరిగినా, ఆదాయాల్లో మాత్రం పెరుగుదల లేదు. అయితే ఈ క్యూ1లో కంపెనీల ఆదాయాలు 29 శాతం మేర తగ్గగా, ఈ క్యూ2లో మాత్రం ఒకింత నిలకడగా ఉన్నాయి. ► ఆదాయాల పరంగా చూస్తే, పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీలపైనే అధికంగా ప్రభావం పడింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో టాప్ వంద కంపెనీల్లో 35% కంపెనీల ఆదాయం పెరిగింది. ఇదే కాలంలో 400 చిన్న కంపెనీల్లో 20% కంపెనీల ఆదాయం తగ్గింది. ► వినియోగం, కమోడిటీ ఆధారిత రంగాల్లోని పెద్ద కంపెనీలు అంతంత మాత్రం వృద్ధిని సాధించాయి. ఈ రంగాల్లోని చిన్న కంపెనీలు క్షీణతను నమోదు చేశాయి. ► చిన్న టెక్స్టైల్స్ వ్యాపార సంస్థలు, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ కంపెనీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. ► ఐటీ రంగంలోని చిన్నా, పెద్ద కంపెనీలు మాత్రం సీక్వెన్షియల్‌గా మంచి వృద్ధిని సాధించాయి. -
విప్రో లాభం రూ.2,456 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.2,456 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని విప్రో సీఈఓ, ఎమ్డీ అబిదాలి జడ్ నీముచ్వాలా తెలిపారు. ఆదాయం మాత్రం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.15,470 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి కంపెనీ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..... మార్చి క్వార్టర్లో ఐటీ సేవల విభాగం ఆదాయం 2 శాతం (సీక్వెన్షియల్‌గా)మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. డిసెంబర్ క్వార్టర్లో 209 కోట్ల డాలర్ల మేర ఉన్న ఐటీసేవల విభాగం ఆదాయం ఈ మార్చి క్వార్టర్లో 210–214 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని పేర్కొంది. ఈ క్యూ3లో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 3 శాతం వృద్ధితో రూ.4.30కు పెరిగింది. పది కోట్ల డాలర్ల డీల్స్‌ను నాలుగింటిని సాధించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఈ క్యూ4లో మంచి డీల్స్నే సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. డిజిటల్ విభాగం మంచి వృద్ధిని సాధిస్తోంది. గత క్యూ3లో మొత్తం ఆదాయంలో 23 శాతం వాటా ఉన్న ఈ విభాగం వాటా ఈ క్యూ3లో 40 శాతానికి ఎగసింది. 1,891 మందికి కొత్త ఉద్యోగాలు.... ఈ క్యూ3లో 1,891 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.87,318కు పెరిగింది. ఆట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) 15.7 శాతానికి తగ్గింది. అమెరికాలోని మొత్తం ఉద్యోగుల్లో స్థానికుల వాటా 70 శాతానికి పెరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో విప్రో షేర్ స్వల్పంగా లాభపడి రూ.257 వద్ద ముగిసింది. నికర లాభం 2 శాతం తగ్గడంతో అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన విప్రో ఏడీఆర్ 3.5 శాతం నష్టంతో 3.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంచి వృద్ధి సాధించాం... ఈ క్యూ3లో మంచి వృద్ధి సాధించాం. అన్ని విభాగాలు, అన్ని మార్కెట్లలో కూడా మంచి పనితీరునే చూపించాం. క్లయింట్లతో సత్సంబంధాలపై దృష్టి పెడుతున్నాం. భారీ డీల్స్ సాధించడంపైననే ప్రధానంగా దృష్టి పెట్టాం. –అబిదాలి జడ్ నీముచ్వాలా,సీఈఓ, విప్రో కంపెనీ -
ఇన్ఫీ కొత్త చీఫ్.. కత్తిమీదసామే!
♦ ఎంపికపై వెంటాడుతున్న మూర్తి నీడ ♦ ప్రమోటర్ల జోక్యంతో అభ్యర్థుల వెనుకంజ! ♦ ఎవరూ పెద్దగా ఆసక్తి వ్యక్తంచేయకపోవచ్చు.... ♦ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం... ♦ సీఈఓ ఎంపికకు 2018 మార్చి వరకూ గడువు న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ప్రమోటర్లు–మేనేజ్మెంట్ మధ్య పోరు తీవ్రతరం కావడంతో ఇప్పుడు ఆ కంపెనీ కొత్త చీఫ్ ఎంపిక కత్తిమీద సాముగా మారుతోంది. ప్రధానంగా ఇన్ఫీ విధానాలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తితో సహా మరికొందరు ప్రమోటర్లు నీడలా వెంటాడుతుండటంతో... కంపెనీకి సారథ్యం వహించేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడకపోవచ్చని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనపై కంపెనీ ప్రమోటర్లు పదేపదే నిరాధార ఆరోపణలు, విమర్శల దాడి చేయడాన్ని సహించలేక సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా గత శుక్రవారం అర్ధంతరంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన గుడ్‌బై చెప్పడానికి మూర్తే కారణమని ఇన్ఫోసిస్ బోర్డు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా గుప్పించింది. దీంతో ప్రమోటర్లకు ప్రస్తుత మేనేజ్మెంట్కు మధ్య వ్యవహారం మరింత చెడింది. కాగా, కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ డెడ్‌లైన్‌ను బోర్డు నిర్ధేశించింది. తాత్కాలిక సీఈఓగా కంపెనీ ప్రస్తుత సీఎఫ్ఓ యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. కొత్త చీఫ్ అన్వేషణలో కంపెనీలోని వ్యక్తులతోపాటు బయటివారిని కూడా బోర్డు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇన్ఫీకి తొలి ప్రమోటరేతర సీఈఓగా ఏరికోరి తీసుకొచ్చిన సిక్కాపై ప్రమోటర్ల ధోరణిని చూస్తుంటే బయటి వ్యక్తులు అంతగా ఆసక్తి చూపకపోవచ్చనేది నిపుణుల వాదన. కంపెనీలోని వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తే గనుక... ప్రవీణ్ రావుతో పాటు సీఎఫ్ఓ డి. రంగనాథ్, డిప్యూటీ సీఓఓ రవికుమార్, కీలకమైన బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ విభాగాల హెడ్ మోహిత్ జోషి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగ విమర్శలతో కష్టమే... కంపెనీ తీసుకునే విధానపరమైన చర్యలను గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, బహిరంగంగా విమర్శించడం వంటి ప్రమోటర్ల చర్యలతో ఎవరైనా మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థులు సీఈఓగా రావాలనుకున్నా జంకుతారని ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అడ్వయిజరీ సర్వీసెస్ అనే సంస్థ వ్యాఖ్యానించింది. ప్రమోటర్లకు నమ్మకంగా ఉండే కంపెనీలోని వ్యక్తులను ఎంపికచేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సులువైన వ్యవహారమని పేర్కొంది. అయితే, సయోధ్య కోసం ఇలా రాజీపడిపోవడం కంపెనీ పోటీతత్వం, ప్రతిష్టపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి లోపాలు ఉన్నాయంటూ ప్రమోటర్లు ప్రధానంగా మూర్తి బహిరంగంగా ఆరోపణల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క, కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ కు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వడాన్ని, సీఈఓ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ పెంపుపైనా మూర్తి బహిరంగంగా విమర్శలు గుప్పించడంతోపాటు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫీకి కొత్త సీఈఓ అన్వేషణ చాలా కష్టతరమైన అంశమేనని ఐటీ పరిశ్రమ నిపుణుడు ప్రమోద్ బాసిన్ పేర్కొన్నారు. విశ్వాసం పెంచాలి: నటరాజన్ విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలూ లేవన్న భరోసాను, నమ్మకాన్ని కల్పించే చర్యలు ఇప్పుడు చాలా అవసరమని ఐటీ పరిశ్రమకు చెందిన గణేశ్ నటరాజన్ వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొత్త సీఈఓ అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సిక్కా వెళ్లిపోయినా... కంపెనీని ముందుండి నడిపించేందుకు, సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు చాలామంది నిపుణులు వరుసలో ఉన్నారన్న బలమైన సందేశాన్ని ఇన్ఫోసిస్ యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రొఫెషనల్ నాయకత్వం దిశగా భారత్ కొర్పొరేట్లు అడుగులేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్ఫీలో తలెత్తిన సంక్షోభం.. చాలా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తిందని ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు. కంపెనీ యాజమాన్య వ్యవహరాల నుంచి పూర్తిగా వైదొలగిన ఓనర్లు/వ్యవస్థాపకులు... భావి నాయకత్వ ప్రణాళికలకు సంబంధించి తమ పాత్ర ఏంటనే విషయంలో చాలా జాగ్రత్తగా, స్పష్టమైన రీతిలో వ్యవహరించాలని మిట్టల్ సూచించారు. క్లయింట్లు చేజారే ప్రమాదం...! ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు ఉన్నాయంటూ స్వయంగా ప్రమోటర్లే గొంతెత్తడం.. చివరకు ఇది సిక్కా వైదొలగేవరకూ వెళ్లడంతో ఇప్పుడు కంపెనీలో ఉద్యోగులు, క్లయింట్లలో స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో సిబ్బంది వలసలు పెరిగిపోవడంతోపాటు కొంతమంది క్లయింట్లు కూడా చేజారే ప్రమాదం పొంచి ఉందని పేరువెల్లడించడానికి ఇష్టపడని ఐటీ రంగానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇన్ఫీలో జరుగుతున్న ఉదంతంపై క్లయింట్లలో కచ్చి తంగా ఆందోళన నెలకొంటుంది. పటిష్టమైన నాయకత్వం లేకపోవడంతో కంపెనీని మరిన్ని సమస్యలు చుట్టుముట్టొచ్చు. ఐటీ పరిశ్రమలో తీవ్ర పోటీ దృష్ట్యా.. ప్రత్యర్థి కంపెనీలు దీన్ని అనుకూలంగా మలచుకొని ఇన్ఫీ క్లయింట్లను తమవైపు తిప్పుకోడానికి అవకాశం లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై అమెరికాలో క్లాస్ యాక్షన్ దావాలు దాఖలయ్యే అవకాశాలు ఉండటం కూడా అటు క్లయింట్లు ఇటు ఇన్వెస్టర్లలో భయాందోళనలు సృష్టించవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిచ్చురేపిన పనయా డీల్! సిక్కా సారథ్యంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీ పనయాను ఇన్ఫోసిస్ 2015లో 20 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 1250 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే, ఈ డీల్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కంపెనీ అంతర్గత వేగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపించడం, నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. దీనిపై ఆతర్వాత ప్రమోటర్లు కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో స్వతంత్ర న్యాయ సంస్థతో కంపెనీ దర్యాప్తు జరిపించడం తెలిసిందే. అయితే, ఎలాంటి అవకతవకలూ జరగలేదని న్యాయ, ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థలు నివేదిక ఇచ్చాయి. ఈ నివేదికను బహిరంగపరచాలన్న మూర్తి డిమాండ్‌ను కంపెనీ బోర్డు తోసిపుచ్చింది. నివేదికను బయటపెట్టకపోవడం అంటే దర్యాప్తు పారదర్శకంగా జరగలేదనే అర్ధమంటూ మూర్తి వ్యాఖ్యానించడం, ఆయనకు మరికొందరు మాజీలు మద్దతుతెలపడంతో యాజమాన్యానికి, ప్రమోటర్లకు మధ్య విభేదాలను మరింత పెంచేలా చేసింది. ఇది కూడా సిక్కా రాజీనామాకు ప్రధాన కారణాల్లో ఒకటని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
మురిపించని టీసీఎస్!
♦ నికర లాభం రూ. 6,608 కోట్లు ♦ క్యూ4లో 4.2 శాతం వృద్ధి ♦ ఆదాయం సైతం ఇంతే వృద్ధితో రూ.29,642 కోట్లు ♦ మూడో త్రైమాసికంతో పోలిస్తే తక్కువే ♦ షేరు ఒక్కింటికి రూ.27.50 తుది డివిడెండ్ ♦ l2017–18 సంవత్సరానికి సానుకూల గైడెన్స్ ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల విషయంలో మార్కెట్లను మెప్పించలేకపోయింది. మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 4.2 శాతం వృద్ధితో రూ.6,608 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 4.2 శాతం వృద్ధితో రూ.28,449 కోట్ల నుంచి రూ.29,642 కోట్లకు పెరిగింది. కానీ, 2016–17 ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్ –డిసెంబర్ త్రైమాసికంలో పోల్చి చూసుకుంటే మాత్రం నికర లాభం 2.5 శాతం క్షీణించింది. తుది డివిడెండ్ కింద రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.27.50ని చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.47 డివిడెండ్ ప్రకటించినట్టు అవుతుంది. అమెరికా మార్కెట్లో, రిటైల్ రంగంలో ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆశాజనక గైడెన్స్‌ను ప్రకటించడం విశేషం. ఫలితాలు వివరంగా... నికర లాభం: నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.6,608 కోట్లు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.6,340 కోట్లతో పోలిస్తే 4.2 శాతం పెరుగుదల. కానీ, 2016–17 ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్ – డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చి చూస్తే 2.5 శాతం తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్: క్వార్టర్ ఆన్ క్వార్టర్ వారీగా చూసుకుంటే నిర్వహణ లాభం 1.4% క్షీణించి రూ.7,627 కోట్లుగా నమోదైంది. కానీ, అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసుకుంటే 2.9% పెరిగినట్టు. ఆపరేటింగ్ మార్జిన్ 26–28% లక్ష్యాన్ని కంపెనీ చేరుకోలేకపోయింది. నాలుగో త్రైమాసికంలో ఇది 25.7%కి తగ్గింది. కరెన్సీల్లో హెచ్చుతగ్గులతో 30 బేసిస్ పాయిం ట్ల మేర మార్జిన్లు తగ్గడానికి కారణంగా కంపెనీ పేర్కొంది. ఆదాయం: రూపాయలలో చూసుకుంటే కంపెనీ ఆదాయం రూ.29,642 కోట్లు. సీక్వెన్షియల్‌గా చూసుకుంటే 0.3 శాతం తగ్గింది. డాలర్ల రూపంలో ఆదాయం 4,452 మిలియన్ డాలర్లుగా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల విభాగాల (బీఎఫ్ఎస్ఐ) నుంచి వచ్చే ఆదాయంలో క్షీణత చోటు చేసుకుంది. కంపెనీ ఆదాయాల్లో వీటి వాటా సగంకంటే ఎక్కువే. మిగిలిన అన్ని విభాగాల ఆదాయాల్లో పెరుగుదల ఉంది. డిజిటల్ ఆదాయాలు: డిజిటల్ విభాగం ద్వారా వచ్చే ఆదాయం 29 శాతం అధికంగా 3.2 బిలియన్ డాలర్లు (రూ.20,800 కోట్లు సుమారు)గా నమోదైంది. ఉద్యోగులు: నాలుగో త్రైమాసికంలో నికరంగా 8,726 మంది ఉద్యోగులు పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,87,223కు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 33,380 మంది ఉద్యోగులు నికరంగా కంపెనీకి జతయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఉద్యోగుల నియామకాలు తగ్గుతాయని,. ఉద్యోగులు కంపెనీని వీడడం (అట్రిషన్) తగ్గడం, ఆటోమేషన్ ఇందుకు కారణాలుగా కంపెనీ పేర్కొంది. పూర్తి ఏడాదికి: 2016–17 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం 8.3 శాతం వృద్ధి చెంది రూ.26,289 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 8.6 శాతం వృద్ధితో రూ.1,17,966 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 5.3 శాతం పెరుగుదలతో రూ.30,324 కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో షేరువారీ ఆర్జన రూ.133.41గా ఉంది. ఫలితాలు ఆశాజనకంగానే.. పూర్తిగా సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ ఈ ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నట్టు టీసీఎస్ కొత్త సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ చెప్పారు. అమెరికా మార్కెట్లో మారిన పరిస్థితులు, డాలర్‌తో రూపాయి లాభపడటం వంటివి ఆయన ఉదహరించారు. రిటైల్ వంటి కొన్ని విభాగాల్లో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మొత్తం మీద 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఫలితాలు కొంచెం సానుకూలంగానే ఉండొచ్చన్నారు. ఆదాయాల వారీగా అంచనాలను మాత్రం ప్రకటించలేదు. నాలుగో క్వార్టర్లో బీఎఫ్ఎస్ఐ ఆదాయాలు తగ్గడంపై అంతగా ఆందోళన చెందడం లేదని గోపినాథన్ చెప్పారు. అదే సమయలో ఇతర విభాగాల నుంచి వచ్చే ఆదాయాల్లో వృద్ధిని ఆయన కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీసా అప్లికేషన్లు గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఉంటాయని గోపినాథన్ చెప్పారు. అజైల్, క్లౌడ్, ఆటోమేషన్ విభాగాలపై 2017–18లో రూ.4,000 కోట్లు పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలిపారు. వీసా నిబంధనలకు అనుగుణంగా మార్పులు వాషింగ్టన్: అమెరికా వీసా విధానంలో మార్పులకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను సర్దుబాటు చేసుకుంటామని టీసీఎస్ ప్రకటించింది. వీసా నిబంధనలను పాటిస్తామని పేర్కొంది. అమెరికాలో మార్కెట్లో కొనసాగుతామని, కస్టమర్ల అవసరాలను చేరుకుంటామని టీసీఎస్ గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. హెచ్1బీ వీసాల జారీ విధానాన్ని సమూలంగా మార్చే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు చేయనున్న విషయం తెలిసిందే. -
మార్చిలో నియామకాలు 5 % జంప్
న్యూఢిల్లీ: ఉద్యోగ నియమాకాలు మార్చి నెలలో 5 శాతం పెరిగాయి. దీనికి బీఎఫ్ఎస్ఐ, బీపీవో, ఆటో, నిర్మాణ రంగాలు బాగా దోహదపడ్డాయి. రానున్న నెలల్లో కూడా నియామకాల జోరు కొనసాగవచ్చనే అంచనాలు ‘నౌకరి.కామ్’ నివేదికలో వెల్లడయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి నౌకరి జాబ్‌స్పీక్ ఇండెక్స్ 2,073 వద్ద ఉంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 5 శాతం వృద్ధి నమోదయ్యింది. ‘వార్షిక ప్రాతిపదికన చూస్తే జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో 5 శాతం వృద్ధి కనిపిస్తోంది. నిర్మాణ, ఇంజనీరింగ్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లోని నియామకాల్లో మంచి వృద్ధి నమోదయ్యింది’ అని నౌకరి డాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ చెప్పారు. స్వల్పకాల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వచ్చే త్రైమాసికాల్లో జాబ్ మార్కెట్ జోరు కొనసాగుతుందన్నారు. నియామకాల కదలికలను రంగాల వారీగా చూస్తే... బీఎఫ్ఎస్ఐలో 26 శాతం వృద్ధి నమోదయింది. బీపీవో/ఐటీఈఎస్, నిర్మాణ రంగాల్లో 9 శాతం చొప్పున పెరుగుదల కనిపించింది. ఐటీ–సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి పురోగతి లేదు. టెలికం రంగంలో మాత్రం 15% క్షీణత నమోదైంది. ప్రాంతాల వారీగా.. 13 ప్రధాన నగరాలకు గాను ఎనిమిదింటిలో నియామకాలు తగ్గాయి. ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో నియామకాలు వరుసగా 15%, 12%, 4%, 10% పడ్డాయి. కాగా 13–16 ఏళ్ల అనుభవమున్న వారి కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించాయి. -
ఈ రంగాల వారికి భారీగా వేతనపెంపు
ముంబై : బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేస్తున్నారా? అయితే మీకు ఏడాది శుభకాలమేనట. గత రెండేళ్లుగా పోలిస్తే ఈ ఏడాది ఈ రంగాల్లో వేతనాలు భారీగా పెంపు ఉంటుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. టీమ్-లీజ్ జాబ్స్, శాలరీస్ ప్రీమియర్-2017 అధ్యయన రిపోర్టు ఈ విషయాన్ని రివీల్ చేసింది. గత నాలుగేళ్లుగా వేతనాల ఇంక్రిమెంట్లో టాప్ లో మోనోపలి సాగిస్తున్న ఐటీ రంగం తర్వాత ఈ ఏడాది బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగానికే ఎక్కువ వేతన ఇంక్రిమెంట్ ఉండబోతున్నట్టు పేర్కొంది. ఎన్నడూ లేనంతగా సగటున 11.2 శాతం వేతన ఇంక్రిమెంట్లు ఉంటాయని తెలిపింది. విద్యా, ఈ-కామర్స్ రంగాల్లో 100కిపైగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించింది. అదేవిధంగా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, దాని అనుబంధ పరిశ్రమల్లో ఇంక్రిమెంట్లు తగ్గిపోనున్నాయట. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ రంగాలను భారీగా దెబ్బకొట్టిందని తాజా రిపోర్టు వెల్లడించింది. ఇతర రంగాలు ఎఫ్ఎమ్సీజీ, రిటైల్ ర్యాలీ నిర్వహిస్తాయని పేర్కొంది. తక్కువ సప్లై, ఎక్కువ డిమాండ్ కారణంగా బ్లూ-కాలర్ జాబ్స్ కు కొన్నేళ్లుగా డిమాండ్ భారీగానే ఉంటుందట. శారీరక శక్తి, వ్యాయామం, బేసిక్ రీడింగ్, రాత, మౌఖిక కమ్యూనికేషన్, వ్యక్తిగత నేర్పు వంటి స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. ఈ సందర్భంగానే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాల మధ్య ఏమేర తేడా ఉంటుందో కూడా వెల్లడించింది. ఆరు నగరాల్లో ఏడు రంగాలపై జరిపిన సర్వేలో తాత్కాలిక, శాశ్వత ఉద్యోగాల మధ్య తేడా స్వల్పంగానే ఉన్నట్టు తేల్చింది. ఈ విషయంలో చండీఘర్(0.92శాతం-2.85శాతం), కోల్ కత్తా(1% - 3.14%), అహ్మదాబాద్(1.08% - 2.73%)లు టాప్ ఉన్నట్టు పేర్కొంది. రంగాల్లో ఐటీ, తయారీ, టెలికమ్యూనికేషన్లు, బీఎఫ్ఎస్ఐలు టాప్ లో ఉన్నాయట.