మురిపించని టీసీఎస్‌! | TCS net profit up 4.2% YoY; Top eight takeaways from Q4 results | Sakshi
Sakshi News home page

మురిపించని టీసీఎస్‌!

Published Wed, Apr 19 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

మురిపించని టీసీఎస్‌!

మురిపించని టీసీఎస్‌!

నికర లాభం రూ. 6,608 కోట్లు
క్యూ4లో 4.2 శాతం వృద్ధి
ఆదాయం సైతం ఇంతే వృద్ధితో రూ.29,642 కోట్లు
మూడో త్రైమాసికంతో పోలిస్తే తక్కువే
షేరు ఒక్కింటికి రూ.27.50 తుది డివిడెండ్‌
l2017–18 సంవత్సరానికి సానుకూల గైడెన్స్‌


ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల విషయంలో మార్కెట్లను మెప్పించలేకపోయింది. మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 4.2 శాతం వృద్ధితో రూ.6,608 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 4.2 శాతం వృద్ధితో రూ.28,449 కోట్ల నుంచి రూ.29,642 కోట్లకు పెరిగింది.

కానీ, 2016–17 ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్‌ –డిసెంబర్‌ త్రైమాసికంలో పోల్చి చూసుకుంటే మాత్రం నికర లాభం 2.5 శాతం క్షీణించింది. తుది డివిడెండ్‌ కింద రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.27.50ని చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.47 డివిడెండ్‌ ప్రకటించినట్టు అవుతుంది. అమెరికా మార్కెట్లో, రిటైల్‌ రంగంలో ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆశాజనక గైడెన్స్‌ను ప్రకటించడం విశేషం.

ఫలితాలు వివరంగా...
నికర లాభం: నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.6,608 కోట్లు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.6,340 కోట్లతో పోలిస్తే 4.2 శాతం పెరుగుదల. కానీ, 2016–17 ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్‌ – డిసెంబర్‌ క్వార్టర్‌తో పోల్చి చూస్తే 2.5 శాతం తగ్గింది.

ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌: క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ వారీగా చూసుకుంటే నిర్వహణ లాభం 1.4% క్షీణించి రూ.7,627 కోట్లుగా నమోదైంది. కానీ, అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసుకుంటే 2.9% పెరిగినట్టు. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 26–28% లక్ష్యాన్ని కంపెనీ చేరుకోలేకపోయింది. నాలుగో త్రైమాసికంలో ఇది 25.7%కి తగ్గింది. కరెన్సీల్లో హెచ్చుతగ్గులతో 30 బేసిస్‌ పాయిం ట్ల మేర మార్జిన్లు తగ్గడానికి కారణంగా కంపెనీ పేర్కొంది.  

ఆదాయం: రూపాయలలో చూసుకుంటే కంపెనీ ఆదాయం రూ.29,642 కోట్లు. సీక్వెన్షియల్‌గా చూసుకుంటే 0.3 శాతం తగ్గింది. డాలర్ల రూపంలో ఆదాయం 4,452 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవల విభాగాల (బీఎఫ్‌ఎస్‌ఐ) నుంచి వచ్చే ఆదాయంలో క్షీణత చోటు చేసుకుంది. కంపెనీ ఆదాయాల్లో వీటి వాటా సగంకంటే ఎక్కువే. మిగిలిన అన్ని విభాగాల ఆదాయాల్లో పెరుగుదల ఉంది.

డిజిటల్‌ ఆదాయాలు: డిజిటల్‌ విభాగం ద్వారా వచ్చే ఆదాయం 29 శాతం అధికంగా 3.2 బిలియన్‌ డాలర్లు (రూ.20,800 కోట్లు సుమారు)గా నమోదైంది.

ఉద్యోగులు: నాలుగో త్రైమాసికంలో నికరంగా 8,726 మంది ఉద్యోగులు పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,87,223కు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 33,380 మంది ఉద్యోగులు నికరంగా కంపెనీకి జతయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఉద్యోగుల నియామకాలు తగ్గుతాయని,. ఉద్యోగులు కంపెనీని వీడడం (అట్రిషన్‌) తగ్గడం, ఆటోమేషన్‌ ఇందుకు కారణాలుగా కంపెనీ పేర్కొంది.

పూర్తి ఏడాదికి: 2016–17 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ నికర లాభం 8.3 శాతం వృద్ధి చెంది రూ.26,289 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 8.6 శాతం వృద్ధితో రూ.1,17,966 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ 5.3 శాతం పెరుగుదలతో రూ.30,324 కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో షేరువారీ ఆర్జన రూ.133.41గా ఉంది.

ఫలితాలు ఆశాజనకంగానే..
పూర్తిగా సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ ఈ ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నట్టు టీసీఎస్‌ కొత్త సీఈవో, ఎండీ రాజేష్‌ గోపినాథన్‌ చెప్పారు. అమెరికా మార్కెట్లో మారిన పరిస్థితులు, డాలర్‌తో రూపాయి లాభపడటం వంటివి ఆయన ఉదహరించారు. రిటైల్‌ వంటి కొన్ని విభాగాల్లో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మొత్తం మీద 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఫలితాలు కొంచెం సానుకూలంగానే ఉండొచ్చన్నారు. ఆదాయాల వారీగా అంచనాలను మాత్రం ప్రకటించలేదు.

నాలుగో క్వార్టర్లో బీఎఫ్‌ఎస్‌ఐ ఆదాయాలు తగ్గడంపై అంతగా ఆందోళన చెందడం లేదని గోపినాథన్‌ చెప్పారు. అదే సమయలో ఇతర విభాగాల నుంచి వచ్చే ఆదాయాల్లో వృద్ధిని ఆయన కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీసా అప్లికేషన్లు గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఉంటాయని గోపినాథన్‌ చెప్పారు. అజైల్, క్లౌడ్, ఆటోమేషన్‌ విభాగాలపై 2017–18లో రూ.4,000 కోట్లు పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలిపారు.

వీసా నిబంధనలకు అనుగుణంగా మార్పులు
వాషింగ్టన్‌:  అమెరికా వీసా విధానంలో మార్పులకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను సర్దుబాటు చేసుకుంటామని టీసీఎస్‌ ప్రకటించింది. వీసా నిబంధనలను పాటిస్తామని పేర్కొంది. అమెరికాలో మార్కెట్లో కొనసాగుతామని, కస్టమర్ల అవసరాలను చేరుకుంటామని టీసీఎస్‌ గ్లోబల్‌ హెడ్‌ అజోయ్‌ ముఖర్జీ చెప్పారు. హెచ్‌1బీ వీసాల జారీ విధానాన్ని సమూలంగా మార్చే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకాలు చేయనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement