బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసి పరిశ్రమలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామని వివరించారు. పరిశ్రమల డిమాండ్‌కు తగినట్టుగా అభ్యర్థులను తయారు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు.
బుధవారం జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ డెవలప్‌మెంట్’కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ వెబ్‌సైట్‌ను ప్రారంభించి, కోర్సులతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రతి విద్యా సంవత్సరం సగటున లక్ష మంది ఇంజనీర్లు, రెండు లక్షల మంది డిగ్రీ కోర్సులు పూర్తి చేసి పట్టా పొందుతున్నారు.
గత పదేళ్లలో ముప్పై లక్షల మంది గ్రాడ్యుయేట్లుగా అర్హత సాధించినప్పటికీ.. మెజార్టీ పిల్లలు ఇప్పటికీ ఉద్యోగాలు సాధించలేదు. ఇందుకు కారణం వారికి పరిజ్ఞానం ఉన్నా సరైన నైపుణ్యం లేకపోవడమే. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన ఈ అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. మా ప్రభుత్వం ఈ అంశంపై చొరవ తీసుకుని వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది..’’అని రేవంత్ చెప్పారు.
డిమాండ్‌కు తగినట్టుగా..
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి వాటి భర్తీకి చర్యలు వేగవంతం చేశామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసినంత మాత్రాన నిరుద్యోగం తొలగిపోదు. ప్రైవేటు మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్లుగా అభ్యర్థులను తీర్చిదిద్దే బాధ్యతను స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలను ఈ వర్సిటీ పాలకమండలిలో భాగస్వామ్యం చేశాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఐదేళ్లలో దాదాపు 5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థుల తయారీ కోసం బీఎఫ్‌ఎస్‌ఐని సంప్రదించాం. బీఎఫ్‌ఎస్‌ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేలా కోర్సును ప్రారంభించాం..’’అని తెలిపారు. పదివేల మంది అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను సీఎస్‌ఆర్ కింద పారిశ్రామికవేత్తలే సమకూర్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
డ్రగ్ పెడ్లర్లుగా మారడం ఆందోళనకరం
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరగడం ఆందోళనకరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్లలో ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని ఆరోపించారు. ‘‘కొందరు ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన పట్టభద్రులు డ్రగ్ పెడ్లర్లుగా మారడం బాధాకరం. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కేసులు, పట్టుబడుతున్నవారి సమాచారాన్ని వింటున్నప్పుడు ఎక్కువగా యువత ఉండటం కలిచివేస్తోంది..’’అని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడంతోపాటు ఐటీకి డెస్టినీగా అభివృద్ధి చేస్తామని.. వచ్చే ఏడాది కాలంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచబ్యాంకు చైర్మన్ అజయ్‌బంగా, శంతను నారాయణన్, సత్య నాదెళ్ల, అజీమ్ ప్రేమ్‌జీ వంటి ప్రముఖులతో డిసెంబర్‌లో ప్రత్యేక సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజిద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజీ విద్య కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాకల్టీ లేకుంటే కాలేజీల అనుమతులు రద్దు
కొన్ని వృత్తి విద్యా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ఇకపై పూర్తిస్థాయి ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలను నిర్వహిస్తే అనుమతులు రద్దు చేసేందుకు వెనుకాడం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా అప్‌గ్రేడ్ చేశాం.
వాటి ఆధునీకరణ కోసం టాటా సంస్థ ముందుకు రావడం శుభపరిణామం. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి పక్కాగా ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులు అమలు చేస్తున్న 38 కాలేజీల్లో శిక్షణ పొందిన వారికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’’అని పేర్కొన్నారు.
కోర్సు ముగిసిన వెంటనే ఆరు నెలల ఇంటర్న్‌షిప్: మంత్రి శ్రీధర్‌బాబు
బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సు ముగిసిన వెంటనే అభ్యర్థులకు ఆరు నెలలపాటు వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో చూపిన నైపుణ్యానికి అనుగుణంగా వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఒక్కో అభ్యర్ధికి కనిష్టంగా రూ.25 వేల వరకు వేతనం అందుతుందన్నారు.
బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సు నేర్చుకోవాలంటే బహిరంగ మార్కెట్లో వేల రూపాయలను ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇక్విప్ సంస్థ సహకారంతో పదివేల మంది అభ్యర్థులకు ఉచితంగా కోర్సును అందిస్తోందని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా ఆ సంస్థ రూ.2.5 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.
దేశంలోనే మొదటిసారిగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. పదేళ్లపాటు ఎలాంటి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చని గత పాలకులు.. ఇప్పుడు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment