తెలంగాణ రాష్ట్రంలో నికరంగా వైట్‌కాలర్(ప్రొఫెషనల్) ఉద్యోగులు పెరుగుతున్నారని ఎక్స్‌ఫెనో సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల నుంచి 61,600 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారని, వివిధ కారణాలతో 41,400 మంది రాష్ట్రాన్ని వీడారని సంస్థ పేర్కొంది. ఈమేరకు సంస్థ సహవ్యవస్థాపకులు కమల్ కరంత్ ‘టాలెంట్ పాజిటివ్ తెలంగాణ 2024’(రెండో ఎడిషన్) పేరుతో నివేదిక విడుదల చేశారు.
నివేదికలోని వివరాల ప్రకారం..తెలంగాణలో వైట్‌కాలర్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 12 నెలల కాలంలో 61,600 వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వివిధ కారణాలతో 41,400 మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. నికరంగా తెలంగాణ 20,200 మంది వైట్‌కాలర్ ఉద్యోగులను సంపాదించింది.
రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ వైట్‌కాలర్ ఉద్యోగులు 41.8 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ఏటా 12 శాతం పెరుగుతోంది. అందులో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగిన వారు 50% మంది ఉన్నారు.
కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 18.7 లక్షల మంది అనుభవజ్ఞులైన వైట్ కాలర్ ఉద్యోగులున్నారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, హనుమకొండలో అధికంగా ఈ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు.
2023 లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో పురుషులు 68 శాతం, మహిళలు 32 శాతం ఉన్నారు. 2023తో పోలిస్తే 2024లో మహిళా ఉద్యోగులు సంఖ్య ఒక శాతం పెరిగింది.
టెక్ కంపెనీలు, బీఎఫ్‌ఎస్‌ఐ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, హెచ్‌ఆర్ విభాగాలను ఎంచుకుంటున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే వారి సంఖ్య 12.3 లక్షలు, మాస్టర్స్ డిగ్రీ 4.61 లక్షలు, ఎంబీఏ 3.35 లక్షలు, పీహెచ్‌డీ 41 వేలు, అసోసియేట్ డిగ్రీ 20 వేలుగా ఉంది.
ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
దేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హరియాణా, గుజరాత్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయా మినహా అన్ని రాష్టాల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది.
తెలంగాణకు వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారున్నారు. గడిచిన ఏడాది కాలంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 55,400గా ఉంది.
తెలంగాణ నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు ఎక్కువ మంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 38,700గా ఉంది.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపించడం ద్వారా ఇతర దేశాల్లోని వారు తెలంగాణకు వస్తున్నారు. యూఎస్, యూకే, యూఏఈ, కెనడా నుంచి అధికంగా వలసలున్నాయి. ఏడాదిలో వీరి సంఖ్య 20,400గా ఉంది.
ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 50,700గా ఉంది.
ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
నివేదిక విడుదల సందర్భంగా ఎక్స్‌ఫెనో సహవ్యవస్థపకులు కమల్ కరంత్ మాట్లాడుతూ..‘తెలంగాణ వివిధ రంగాల్లోని వైట్‌కాలర్ ఉద్యోగులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మౌలికసదుపాయాలు పెరిగాయి. వ్యూహాత్మక పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ప్రగతిశీల విధానాలు రూపొందించడం, వ్యాపార ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలతో ఇది సాధ్యమవుతోంది. అయితే రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో మెరుగైన వసతులు, వేతనాలు ఉండడం ఇందుకు కారణం. ఉద్యోగులు ప్రమోషన్ కోసం, ఇతర రంగాలను ఎంచుకోవడానికి, తమ అభివృద్ధికి అనువైన నాయకత్వం..వంటి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment