migration workers
-
ఏడాదిలో 61,600 మంది ఉద్యోగులు రాక! కారణం..
తెలంగాణ రాష్ట్రంలో నికరంగా వైట్‌కాలర్(ప్రొఫెషనల్) ఉద్యోగులు పెరుగుతున్నారని ఎక్స్‌ఫెనో సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల నుంచి 61,600 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారని, వివిధ కారణాలతో 41,400 మంది రాష్ట్రాన్ని వీడారని సంస్థ పేర్కొంది. ఈమేరకు సంస్థ సహవ్యవస్థాపకులు కమల్ కరంత్ ‘టాలెంట్ పాజిటివ్ తెలంగాణ 2024’(రెండో ఎడిషన్) పేరుతో నివేదిక విడుదల చేశారు.నివేదికలోని వివరాల ప్రకారం..తెలంగాణలో వైట్‌కాలర్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 12 నెలల కాలంలో 61,600 వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వివిధ కారణాలతో 41,400 మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. నికరంగా తెలంగాణ 20,200 మంది వైట్‌కాలర్ ఉద్యోగులను సంపాదించింది.రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ వైట్‌కాలర్ ఉద్యోగులు 41.8 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ఏటా 12 శాతం పెరుగుతోంది. అందులో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగిన వారు 50% మంది ఉన్నారు.కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 18.7 లక్షల మంది అనుభవజ్ఞులైన వైట్ కాలర్ ఉద్యోగులున్నారు.హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, హనుమకొండలో అధికంగా ఈ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు.2023 లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో పురుషులు 68 శాతం, మహిళలు 32 శాతం ఉన్నారు. 2023తో పోలిస్తే 2024లో మహిళా ఉద్యోగులు సంఖ్య ఒక శాతం పెరిగింది.టెక్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, హెచ్ఆర్ విభాగాలను ఎంచుకుంటున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే వారి సంఖ్య 12.3 లక్షలు, మాస్టర్స్ డిగ్రీ 4.61 లక్షలు, ఎంబీఏ 3.35 లక్షలు, పీహెచ్డీ 41 వేలు, అసోసియేట్ డిగ్రీ 20 వేలుగా ఉంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీదేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హరియాణా, గుజరాత్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయా మినహా అన్ని రాష్టాల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది.తెలంగాణకు వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారున్నారు. గడిచిన ఏడాది కాలంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 55,400గా ఉంది.తెలంగాణ నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు ఎక్కువ మంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 38,700గా ఉంది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపించడం ద్వారా ఇతర దేశాల్లోని వారు తెలంగాణకు వస్తున్నారు. యూఎస్, యూకే, యూఏఈ, కెనడా నుంచి అధికంగా వలసలున్నాయి. ఏడాదిలో వీరి సంఖ్య 20,400గా ఉంది.ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 50,700గా ఉంది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!నివేదిక విడుదల సందర్భంగా ఎక్స్‌ఫెనో సహవ్యవస్థపకులు కమల్ కరంత్ మాట్లాడుతూ..‘తెలంగాణ వివిధ రంగాల్లోని వైట్‌కాలర్ ఉద్యోగులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మౌలికసదుపాయాలు పెరిగాయి. వ్యూహాత్మక పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ప్రగతిశీల విధానాలు రూపొందించడం, వ్యాపార ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలతో ఇది సాధ్యమవుతోంది. అయితే రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో మెరుగైన వసతులు, వేతనాలు ఉండడం ఇందుకు కారణం. ఉద్యోగులు ప్రమోషన్ కోసం, ఇతర రంగాలను ఎంచుకోవడానికి, తమ అభివృద్ధికి అనువైన నాయకత్వం..వంటి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. -
కేర్ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు
లండన్: ఇంటి పనుల్లో సాయపడే కేర్ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ మాట్లాడారు. ‘‘ కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్ వర్కర్లను బ్రిటన్‌లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచనుంది. -
ఇండియన్స్‌పై యూకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ కౌంటర్!
లండన్: వీసా పరిమితి ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉంటున్న వారిలో అధికంగా భారతీయులేనని యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్(ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సుయెల్లా పేర్కొనంటపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్‌లోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. ఒప్పందంలో భాగంగా యూకే వైపు నుంచి సైతం స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపింది. యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ప్రశ్నించగా.. పలు విషయాలను వెల్లడించింది లండన్‌లోని భారత హైకమిషన్. ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందంలో భాగంగా వీసా పరిమితి ముగిసిన తర్వాత బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు యూకేతో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించాం. ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా హామీలను నెరవేర్చేందుకు యూకే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో సరైన పురోగతి కోసం తాము వేచి చూస్తున్నాం.’ అని లండన్‌లోని భారత హైకమిషన్ బదులిచ్చింది. మరోవైపు.. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. భారత్‌తో ఎఫ్‌టీఏపై ఆందోళనలున్నట్లు పేర్కొన్నారు. దీనిపై భారత హైకమిషన్ స్పందిస్తూ.. ‘మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసం కాదు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరుదేశాలకు ప్రయోజనకరంగా ఉండాలి.’ అని పేర్కొంది. మరోవైపు.. యూకే మంత్రి వ్యాఖ్యలతో ఎఫ్‌టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!
న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. వలస కూలీల ఆర్తనాదాలు దేశంలోని అందరికీ వినిపిస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని విమర్శించారు. లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి రూ. 7500 చొప్పున రానున్న ఆరు నెలల పాటు అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ‘స్పీక్ అప్ ఇండియా’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక వీడియో సందేశాన్ని సోనియా పార్టీ సోషల్ మీడియా వేదికలపై గురువారం విడుదల చేశారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అయినా, లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదని సోనియా పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం తరువాత ఈ స్థాయిలో వేదనాభరిత పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదు. వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, మహిళలు, చిన్నపిల్లలు స్వస్థలాలకు వందలాది కిలోమీటర్లు మండుటెండలో, వట్టి కాళ్లతో, ఆహారం, ఔషధాలు, రవాణా సదుపాయాలు లేకుండా నడిచి వెళ్తున్న విషాధ దృశ్యాలు కలచివేస్తున్నాయి. వారి బాధ, వారి వేదన అందరికీ అర్థమవుతోంది. ప్రభుత్వానికి తప్ప’ అని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. -
కేంద్రం తప్పుడు విధానాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కరోనా రాకకు ముందే దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిని ఉందన్నారు. పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో మరింతగా దెబ్బతిందన్నారు. తెలంగాణకు ప్రతి నెలా అన్నీ కలిపి రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఇందులో సొంత పన్నుల ఆదాయమే రూ.10,800 కోట్లు అన్నారు. వచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రతి నెలా రూ.3వేల కోట్లు కావాలన్నారు. ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదన్నారు. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్డౌన్ దేశ ద్రవ్య నియంత్రణ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులివ్వట్లేదని, వేరే మార్గాల్లోనైనా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించట్లేదని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న హెలికాప్టర్ మనీ వంటి మార్గాల్లో డబ్బు సమీకరించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించాలన్నారు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచాలని, రాష్ట్రాల అప్పుల కిస్తీలను వాయిదా వేయాలని విజ్ఞప్తిచేసినా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. ఈ పనులను ఎందుకు చేయడం లేదు?, చేస్తే మీ మీద భారం పడుతుందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నెలలో కూడా అప్పులకు సంబంధించిన రూ.2,500 కోట్ల వడ్డీలను ఆర్బీఐ కట్ చేసుకుందన్నారు. కొంత సమయం వేచి చూస్తామని, ఆ తర్వాత తీవ్రంగా స్పందిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం అధికారాలను తన దగ్గర పెట్టుకుని వాడుకోవట్లేదని, చేతకాకపోతే రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు వారి నుంచి రైలు టికెట్ చార్జీలను కేంద్రం వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. స్పెషల్ రైళ్లు, రిజర్వేషన్ల పేరుతో ఈ సమయంలో కూడా దోపిడీ అవసరమా అని మండిపడ్డారు. వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపేందుకు టికెట్ చార్జీల కింద మంగళవారం రూ.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కట్టిందన్నారు. చదవండి: ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు విద్యుత్ బిల్లుతో తీవ్ర వైపరీత్యాలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విద్యుత్ చట్టం సవరణ ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించేలా ఈ బిల్లు ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితిలో పార్లమెంట్లో పాస్‌కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్ల అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, దీనిని కేంద్రం లాగేసుకునేందుకు ఈ బిల్లును తెచ్చిందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ సబ్సిడీలకు మంగళం పాడాల్సి ఉంటుందని, రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ వం టి పథకాలు ఉండవన్నారు. అందరూ సబ్సి డీ లేకుండా విద్యుత్‌చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత నగదు బదిలీ రూపంలో సబ్సిడీలను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు సైతం పెట్టాలని కేంద్రం కోరుతుందన్నారు. విద్యుత్ సరఫరాను ప్రైవేటుపరం చేసేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారని, ప్రజల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలుచేసే పరిస్థితి వస్తుందన్నా రు. విద్యుత్ అంశం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉందని, దీనికి సంబంధించిన మొత్తం అధికారాలను లాక్కోవడానికి కేం ద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించి న కొన్ని అధికారాలను లాక్కునేందుకు ప్ర యత్నిస్తే, బీజేపీ ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారాలను లాగేసుకుంటోందన్నా రు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విఘాతమన్నారు. -
రహస్యంగా ‘శ్రామిక్’ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల తరలింపు వ్యవహారాన్ని ప్రభుత్వం రహస్యంగా నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపాలని కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 4 రోజు ల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 1,225 మంది కార్మికులతో తొలి రైలు లింగంపల్లి స్టేషన్ నుంచి నడిచింది. సోమవారం తెల్లవారుజామున మూ డున్నరకు ఘట్కేసర్ స్టేషన్ నుం చి 1,248 మందితో బిహార్‌లోని ఖగారియాకు రెండో రైలు పయనమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులను 55 ఆర్టీసీ బస్సుల్లో సోమవారం అర్ధరాత్రి 12 నుంచి ఘట్కేసర్ తరలించారు. ప్రతి ప్రయాణికు డూ మాస్క్‌లు ధరించేలా చర్య లు తీసుకున్నారు. అధికారులే వారికి భోజనం, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ రైళ్లో చార్జీలపై కేంద్రం కొంత రాయితీ ఇవ్వగా.. మిగిలిన చార్జీల ను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇక రోజూ 45–48 వేల మందిని తరలించేలా సర్కారు ఏర్పాట్లు చే స్తోంది. బుధవారం ఉదయం నడిచే శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు మంగళవారం సాయంత్రానికి ఆర్టీసీ 1,300 బస్సులను సిద్ధం చేసింది. ఈ రైళ్లలో వెళ్లే వలస కూలీల చార్జీల కింద ప్రభుత్వం రూ.4 కోట్లను అడ్వాన్సుగా చెల్లించింది. అంతా గోప్యమే..: నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగులు, వ్యా పారులు వీరిలో ఉన్నారు. వీరంతా దాదాపు ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి వారికి స్వస్థలాలకు వెళ్లే అవకాశం లేదు. కేవలం వలస కూలీలు, విద్యార్థులు, లాక్డౌన్ వేళ చిక్కుపడిపోయిన పర్యాటకులకే అనుమతి ఉంది. ఇలాంటి వారు దాదాపు ఏడెనిమిది లక్షల మంది ఉన్నారు. ఇందులో 99 శాతం మంది వలస కార్మికులే. వీరిలో సింహభాగం స్వస్థలాలకు వెళ్లాలని సిద్ధపడ్డారు. కానీ, ఉద్యోగ, వ్యాపార పనుల్లో ఉన్నవారిలో కూడా కొందరు స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్నారు. కానీ వారిని ప్రభుత్వం అ నుమతించటం లేదు. వలస కార్మికుల తరలింపు వేళ వారు కూడా తమకు అవకాశం కల్పించాలంటూ పె ద్దసంఖ్యలో పోలీసుస్టేషన్ల కు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్ని నివా రించేందుకు శ్రామిక్ రైళ్లను నడిపే విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. కార్మికులు ఏ ప్రాంతానికి వెళ్లాలో, ఎంతమంది ఉంటారో ముందే నిర్ణయించి రాత్రి పొద్దుపోయాక, రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రైల్వే నోడ ల్ అధికారికి చెబుతున్నారు. దీంతో సదరు స్టేషన్లో అప్పటికప్పుడు రైలును సిద్ధం చేసి ఉంచుతున్నారు. ఫలితంగా వలస కార్మికుల తరలింపు కార్యక్రమం అవాంతరాలు లేకుండా సాఫీగా సాగుతోంది. వలసకూలీలతో బయల్దేరుతున్న శ్రామిక్ రైలు -
ఏపీకి చేరుకున్న 381 మంది వలస మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: గుజరాత్‌కు వలస వెళ్లిన 381 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్సకారులు శనివారం విశాఖకు చేరుకున్నారు. కాగా వీరందరూ ప్రత్యేక బస్సులలో ఏపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరి కోసం జిల్లాలోని నాలుగు మండపాలలో వసతి సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక అక్కడే వారందరికి భోజన సదుపాయాలు కూడా కల్పించనున్నారు. అదే విధంగా మత్స్య కారులకు మాస్క్‌ల పంపిణీతో పాటు థర్మల్ స్ర్కీనింగ్ కూడా చేయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (‘టీవీ షూటింగ్స్‌కు అనుమతివ్వండి’) ఇక ప్రతీ కళ్యాణ మండపం వద్ద ఒక్కొక్క తహసిల్ధార్‌కు బాధ్యత ఇచ్చినట్లు తెలిపారు. మత్స్య కారులందరికీ ఆధార్ ఐడి నంబర్ ఆధారంగా శాంపిల్స్ సేకంచి కోవిడ్-19 పరీక్షలు చేయించనున్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం వరకు వైద్య పరీక్షల వివరాలు వచ్చే అవకాశం ఉందని, వారిలో కరోనా నెగిటివ్ వచ్చిన మత్స్యకారులను ఇంటికి పంపించి 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించననున్నట్లు అధికారులు వెల్లడించారు. -
టేకాఫ్
వలసల కష్టాలు కథలుగా వినే ఉన్నాం.. వాటిని ‘కరోనా’ ఇప్పుడు నిజాలుగా చూపిస్తోంది.. పరాయి రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం మన దగ్గరకు వచ్చినవాళ్ల కన్నీళ్లనే కాదు.. పని వెదుక్కుంటూ పరాయి దేశం పోయిన మన వాళ్ల వ్యథలనూ! కువైట్‌లోని మన మహిళా డొమెస్టిక్ హెల్పర్స్ (ఇళ్లలో పని చేసే వాళ్లు) పడుతున్న ఇబ్బందుల గురించిన కథనం ఇది.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆమ్నెస్టీ ప్రకటించింది కువైట్. వీసా గడువు అయిపోయాక కూడా ఆ దేశంలో ఉంటున్న వారికి, జరిమానా శిక్షలు పడ్డవారికి క్షమాభిక్ష పెట్టి వాళ్ల వాళ్ల దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం అక్కడున్న మన మహిళా డొమెస్టిక్ హెల్పర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా అరబ్బీ మాట్లాడలేక, నిరవధికంగా పన్నెండు గంటలు, ఒక్కోసారి 20 గంటలు పనిచేయలేక, తిండి, నిద్రలేక అనారోగ్యం పాలై.. యజమానుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి ఈ ఆమ్నెస్టీ ఓ వరంలా కనిపించింది. దాంతో యజమానుల కళ్లు గప్పి, రెండంతస్తుల మేడ మీద నుంచి చీర సహాయంతో కిందకు దూకి .. ఇలా రకరకాల ప్రయత్నాలతో బయటపడ్డారు. కొందరైతే ఆమ్నెస్టీ పెట్టకముందే బయటకు వచ్చేశారు... పాస్‌పార్టుల సంగతి అటుంచి చేతిలో చిల్లిగవ్వ, కాళ్లకు చెప్పుల్లేక కట్టుబట్టలతో. ఎటు వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎక్కుడుండాలి? ఏమీ తెలియదు. స్నానం లేదు, తిండి లేదు. పైగా కరోనా లాక్డౌన్. బయట కనిపిస్తే జరిమానా, జైలు. వీటన్నిటి నుంచీ తప్పించుకుంటూ తిరుగుతుండగా అక్కడ వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలుగు స్వచ్ఛందసేవా కార్యకర్తల సాయంతో షెల్టర్ హోమ్‌కి చేరారు. వాళ్లలో కొంతమంది నేపథ్యాలు.. కూలోనాలో చేసుకుంటా... అంటోంది ఈడిపల్లి లక్ష్మి. ఆమె స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలోని రామారావుపేట. కువైట్‌కు వెళ్లి మూడేళ్ల అవుతోంది. ‘నా తాగుబోతు భర్తతో పడలేక విడాకులు తీసుకున్నా. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు, పొలం లేవు. అప్పలు తీరాలి, పూట గడవాలి. అందుకే కువైట్‌కు వచ్చా. ఇక్కడి భాష రాక బాధలు పడ్డా. ఇంక నావల్ల కాక ఓరోజు షేక్ ఇంట్లోంచి పారిపోయా. తిండిలేక కడుపు మాడ్చుకుంటాను కాని అద్దె కట్టకపోతే గదిలో ఉండనివ్వరు కదా! నయా పైసా లేక నానా తిప్పలు. చివరికిలా క్యాంపులోకొచ్చి పడ్డా. మా సొంతూరెళ్లిపోయి కూలోనాలో చేస్కోని బతుకుతాను’’ అంటూ చేతులు జోడిస్తోంది లక్ష్మి. ఇంట్లోంచి గెంటేశారు.. అని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తోంది కోన కృష్ణవేణి. ఆమె స్వస్థలమూ తూర్పు గోదావరి జిల్లానే. యేడాది కిందట భర్త చనిపోయాడు. అమ్మానాన్నా, అత్తమామల అండ లేదు. జీవనాధారమూ లేదు. దాంతో పొరుగుదేశంలో పనిమనిషిగానైనా నాలుగు డబ్బులు వెనకేసుకుందామని కువైట్ చేరింది. ఇంతలో కరోనా వల్ల కష్టమొచ్చిపడింది. ‘‘పనివాళ్ల వల్ల కరోనా వస్తుందని భయపడ్డారో ఏమో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. ఎక్కడికెళ్లాలో తెలియదు. భాష రాదు. తిండి, నీళ్లు లేక తిరుగుతుంటే తెలుగు వాళ్లే చూసి క్యాంప్‌కు తీసుకొచ్చారు’ అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి. అకామా బ్లాక్ అయిందని.. భయపెడ్తున్నారు అని బాధపడుతోంది పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలు మండలం, ఆట్లపాడుకు చెందిన సత్యభారతి. 2019, నవంబరులో కువైట్‌కు వచ్చింది భారతి. అయితే గల్ఫ్ ఆమెకు కొత్త కాదు. ఇదివరకు ఖతర్, దుబాయ్, బహరెయిన్లలో డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేసింది. కాని ఇప్పుడు కువైట్‌లో ఎదురైన సమస్యే భయపెడుతోంది ఆమెను. ‘ఖతర్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైంది. ఇండియాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈలోపు మా నాన్న చనిపోవడం, నా భర్తతో గొడవలు.. మానసికంగానూ దెబ్బతిన్నా. కూర్చుంటే రోజు గడిచే దారి లేదు. అందుకే మళ్లీ గల్ఫ్‌కు ట్రై చేసుకొని కువైట్కొచ్చా. నాలుగు నెలలుగా జీతం ఆపేశారు. నా పరిస్థితి గురించి మా చుట్టాలకు ఫోన్ చేద్దామన్నా డబ్బుల్లేవు. కొంచెం టెన్షన్ పడ్డా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. ఇండియా వెళ్లిపోతాను సహాయం చేయండని తెలిసిన వాళ్లను అడిగితే నీ అకామా (రెసిడెంట్ స్టాంప్)బ్లాక్‌లో ఉంది, రెండు లక్షల రూపాయలవుతాయి అని చెప్పారు. బ్లాక్‌లో ఎందుకు ఉంటుందని భయపడి ఏజెంట్‌కు ఫోన్ చేస్తుంటే అతణ్ణించి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆమ్నెస్టీ నాకోసమే వచ్చినట్టయింది’ చెప్పుకొచ్చింది సత్యభారతి. వీళ్లంతా కువైట్ నుంచి టేకాఫ్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అక్కడున్న మన రాయబార కార్యాలయం ద్వారా వైట్‌పాస్ (లేదా అవుట్పాస్ అంటే ఆపద్ధర్మ పాస్‌పార్ట్)లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛందసేవా కార్యకర్తలు. -
ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ..!
‘ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ’.. ఈ ఒక్కమాట చాలు లాక్డౌన్ కష్టకాలంలో పేదలు, వలస కూలీల దీనస్థితిని అద్దం పట్టేందుకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆదేశ్ రవి.. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వలస వెళ్లిన శ్రమజీవుల కరోనా లాక్డౌన్ కష్టాలను అక్షరబద్దం చేసిన పాటలోని ఆవేదన ఇది. పాట వింటే కళ్లు చెమ్మగిల్లుతాయి. ‘పూట పూట జేసుకోని బతికేటోళ్లం.. పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్లం..’ అంటూ మొదలై, ‘ఇంటికాడ పిల్ల జెల్ల ఎట్ల ఉన్నరో.. నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతున్నదో.. ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ.. ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ.. అనే విన్నపంతో పాట ముగుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటను విన్న దేశపతి శ్రీనివాస్, చంద్రసిద్ధార్థ, ఆర్పీ పట్నాయక్, సుకుమార్, మరికొంత మంది ప్రముఖులు రవిని అభినందించారు. ఇదే పాటను రవి ఇప్పుడు హిందీలో కూడా పాడబోతున్నారు. ‘పేద రోగం కంటే పెద్ద రోగముందా..? అయినవాళ్ల కంటే అండ ఉందా..? అనే చరణంలో.. కష్టకాలంలో అయినవాళ్ల వద్ద ఉండాలనే తపన, ఆరాటం.. పాటలో వ్యక్తం అవుతున్నాయి. సౌండ్ ఇంజినీర్ అయిన రవి వందకు పైగా సినిమాలకు పని చేశారు. కొన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. బాధ.. సంఘర్షణ నుంచి పుట్టిన పాట దక్షిణాది నుంచి ఉత్తరాదికి.. ఉత్తరాది నుంచి దక్షిణానికి వేలాది వలస జీవులు నడిచి వెళ్తున్నారు. నాకేమైనా ఫర్వాలేదు.. నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుని ఎర్రటి ఎండలో మైళ్లకు మైళ్లు నడుస్తున్న వలస జీవుల్ని మీడియాలో.. సోషల్ మీడియాలో చూసి.. ఎట్లాంటి స్థితిలో ఉన్నాం.. అని బాధనిపించింది. ఆ బాధ, సంఘర్షణలోంచి ఈ పాట పుట్టింది. – ఆదేశ్ రవి – గుర్రాల మహేశ్, సాక్షి, కరీంనగర్ -
చట్టబద్ధంగా.. సురక్షితంగా వెళ్లండి
గల్ఫ్ డెస్క్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాలనుకునే వారికి నిబంధనలు, విధి విధానాలపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్(పీఎంఎల్‌యూ) అవగాహన కల్పిస్తూ వలసదారుల్లో చైతన్యం పెంపొందిస్తోంది. చట్టబద్ధంగా వెళ్లండి.. సురక్షితంగా వెళ్లండి.. అనే నినాదంతో యూనియన్ ప్రతినిధులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలను సమీకరించి.. వలస వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పల్లెల్లో కొంత మంది వలసదారులు నిరక్షరాస్యత కారణంగా మోసాలకు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వారి కుటుంబ సభ్యులకు వివరించి మోసపోకుండా ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో పాఠశాలలను కూడా అవగాహన కార్యక్రమాలకు వేదికగా ఎంచుకుంటున్నారు. ప్రత్యేకంగా కరపత్రాలను ప్రచురించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. కాగా, గల్ఫ్ వలసలపై నిర్వహిస్తున్న అవగాహన సమావేశాల్లో.. పలువురు తాము మోసపోయిన తీరును, గల్ఫ్ దేశాల్లో పడిన ఇబ్బందులను ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తుండడం గమనార్హం. పాస్‌పోర్టు దరఖాస్తు మొదలుకొని.. వలస వెళ్లేవారికి తమ పాస్‌పోర్టును పొందడానికి దరఖాస్తు చేసుకునే దశ నుంచి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో అనేక మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో సరైన వివరాలు అందించకుండా.. అందుబాటులో ఉన్న ఏవో కొన్ని వివరాలతో పాస్‌పోర్టులను పొందారు. దీనివల్ల వలస వెళ్లిన కార్మికులు ఇంటికి వచ్చిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలోనూ నష్టపోయారు. కొందరు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను స్వస్థలానికి తీసుకువచ్చే సమయంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలకు, పాస్‌పోర్టులోని వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందువల్ల పాస్‌పోర్టు దరఖాస్తులలో తప్పుడు వివరాలు అందించవద్దని పీఎంఎల్‌యూ ప్రతినిధులు సూచిస్తున్నారు. తాము వలసవెళ్లే దేశం, కంపెనీ, పని వివరాలపై స్పష్టత ఉండాలని, ఇందుకోసం లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారానే సరైన వీసాలను పొందాలని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రవాసీ బీమాపై... తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందే ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) గురించి కూడా పీఎంఎల్‌యూ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. వలస కార్మికులు రూ.325 ప్రీమియం చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో రూ.10లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పాలసీ పొంది ఇ–మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు చేసుకుని ఎమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. పీబీబీవై లేకుండా కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని ప్రతినిధులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ పొంది.. శిక్షణ పొందిన రంగంలోనే ఉపాధి పొందడానికి వీసా కోసం ప్రయత్నించాలి. విజిట్ వీసాపై వెళ్లవద్దు. ఫ్రీ వీసా, ఆజాద్ వీసా, ఖఫాలత్ వీసా, ప్రైవేట్ వీసాలు ఏమీ లేవు. ఒక వేళ అలాంటి వీసాలు ఇచ్చినా వెళ్లకూడదు. వీసా ఇచ్చే ఏజెంటును చెల్లుబాటు అయ్యే వీసా, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టు, డిమాండ్ లెటర్, పవర్ ఆఫ్ అటార్నీ గురించి ప్రశ్నించి ఆ పత్రాలను తీసుకోవాలి. టామ్‌కామ్ అందించే ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్(ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ)ను తీసుకోవడం వల్ల వలసదారులు ఇబ్బంది పడకుండా ఉంటారు. వలస వెళ్లే ముందు వీసా, పాస్‌పోర్టు ఇతర జిరాక్సు పత్రాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరితో జాయింట్ ఖాతాను బ్యాంకులో తీసుకోవాలి. ఇమిగ్రేషన్ యాక్టు 1983 ప్రకారం లైసెన్స్ ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్‌కు 45 రోజుల వేతనం లేదా గరిష్టంగా రూ.30వేలతో పాటు అదనంగా 18 శాతం జీఎస్టీ అంటే రూ.5,400 మాత్రమే వీసా కోసం చెల్లించాలి. ఇంతకంటే ఎక్కువ చెల్లించవద్దు. వలస వెళ్లిన తర్వాత.. విదేశాలకు వలస వెళ్లిన తరువాత వీసా స్టాంపింగ్, ఐడీ కార్డు పొందిన అనంతరం ఆ దేశంలోని మన విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. దీనివల్ల వలసకు చట్టబద్ధత వర్తిస్తుంది. ఉద్యోగం చేస్తున్న దేశంలో ఆ దేశ ఆచార, సంప్రదాయాలను పాటించాలి. అక్కడి చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో అక్కడి చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేధం. వీసా ఇచ్చిన కంపెనీ లేదా యజమాని వద్ద కాకుండా ఇతరుల వద్ద పనిచేయడం సరికాదు. ఖల్లివెల్లిగా మారిన వారు హక్కులను కోల్పోతారు. యూఏఈకి మనుషుల అక్రమ రవాణా.. కొన్ని నెలల నుంచి యూఏఈలోని పలు ప్రాంతాల్లో హాస్పిటాలిటీ, సూపర్‌మార్కెట్, బల్దియా కంపెనీల్లో ఉపాధి పేరిట మనుషుల అక్రమ రవాణా సాగుతోంది. ఆయా కంపెనీల్లో ఉపాధి కల్పిస్తున్నా నేరుగా వర్క్ వీసా ఇవ్వకుండా మొదట విజిట్ వీసాపై మనుషులను యూఏఈకి తరలిస్తున్నారు. విజిట్ కం ఎంప్లాయ్మెంట్ వీసాలను లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లు జారీచేస్తున్నారు. విజిట్ వీసాపై యూఏఈకి పంపించి అక్కడ వర్క్ వీసా ఇవ్వడం వల్ల కార్మికులు ఎన్నో ప్రయోజనాలను కోల్పోతున్నారు. విజిట్ వీసాలపై విదేశాలకు వెళ్లడం వల్ల మన ప్రభుత్వం రూపొందించిన ఇ–మైగ్రేట్ సిస్టంలో వలస వెళ్లిన వారి పేర్లు నమోదు కావు. దీంతో ఆపద సమయంలో విదేశాంగ శాఖ సహాయం పొందలేకపోతున్నారు. ప్రవాసీ కార్మికులకు అందిస్తున్న రూ.10 లక్షల బీమా, ప్రమాద బీమా వర్తించవు. ఎవరూ నష్టపోవద్దని మా లక్ష్యం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, ఇతర ప్రయోజనాలపై మేము నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చట్టబద్ధంగా వెళ్లకపోతే కలిగే ఇబ్బందులు, ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నాం. అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. గల్ఫ్ వలసల వల్ల ఎవరూ నష్టపోవద్దనేదే మా ఉద్దేశం. ప్రజలు మమ్మల్ని పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. – స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి సౌదీ అరేబియా నుంచి సిద్దిపేట జిల్లా వాసుల వినతి సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, ఎన్సాన్పల్లి, ఇర్కోడ్ గ్రామాలకు చెందిన ఐదుగురు కూలీలు ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చింతమడక గ్రామానికి చెందిన అనుమగారి కోటి, స్వామి, సుతారి కనకయ్య, ఎన్సాన్పల్లి గ్రామానికి చెందిన నర్సింలు, ఇర్కోడ్ గ్రామానికి చెందిన మాట్ల రవీందర్ ఉపాధి కోసం సౌదీకి వెళ్లారు. అయితే, గార్డెనింగ్ పనులు చేయాల్సి ఉంటుందని తమకు ఏజెంట్లు చెప్పారని, కానీ తమను పెట్రోల్ బావుల్లో పనులు చేయిస్తున్నారని వారు చెప్పారు. తాము ఈ పనులు చేయమని కంపనీ యజమానికి చెప్పడంతో.. యజమాని ఒక రోజు ఎండలో నిలబెట్టినట్లు తెలిపారు. గత్యంతరం లేక అదేపని చేస్తున్నామని, కొన్ని రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఉంటున్నామని వారు సౌదీ నుంచి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తాము ఇండియాకు వచ్చేలా చూడాలని కోరారు. –పడిగె వెంకటేశ్, సిద్దిపేట రూరల్ ప్రమాదకర పనులు చేయిస్తున్నారు గార్డెన్ పని అని చెప్పి ఇక్కడ ప్రమాదకరంగా పెట్రోల్ బావుల్లో పనిచేయిస్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగి కొన్ని రోజుల క్రితం 16 మంది మృతి చెందారు. బిక్కుబిక్కుమంటూ పోట్టకూటి కోసం పనిచేస్తున్నాం. నాయకులు, అధికారులు స్పందించి మమ్మల్ని మా కుటుంబం వద్దకు చేర్చాలి. –అనుమగారి స్వామి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం.. బతుకుదెరువు కోసం సౌదీకి వచ్చిన మాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రమాదకరమైన పెట్రోల్ బావుల్లో పనిచేయిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరగుతుందోననే భయంతో గడుపుతున్నాం. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము స్వదేశానికి వచ్చేలా సాయం చేయాలి. –సుతారి కనకయ్య దినదినగండంగా బతుకుతున్నాం.. ఏజెంట్లు మోసం చేయడంతో ఇక్కడ పడరాని పాట్లు పడుతున్నాం. దినదిన గండంగా బతుకుతున్నాం. ప్రమాద స్థలాల్లో పని చేయము అని చెబితే ఇబ్బందులు పెడుతున్నారు. తిండిపెట్టకుండా ఎండలో నిలబెడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ఉంటున్నాం. మాకు ఇక్కడ ఉండాలని లేదు. –నర్సింలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. మేము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఏజెంట్‌కు చెబితే ముంబైలోని కంపనీ వారి ఫోన్ నంబర్ ఇచ్చాడు. ముంబై వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదు. మమ్మల్ని ఇండియాకు పంపాలని ముంబై కంపనీ నుంచి మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తే వెంటనే పంపిస్తారు. కానీ, వారు స్పందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాయకులు, అధికారులు స్పందించి మేము ఇంటికి వచ్చేలా చూడాలని కోరుతున్నాం. –రవీందర్ -
ఎడారి దేశాలతో అనుబంధం
గల్ఫ్ దేశాలతో ఆ పల్లెవాసుల బంధం పెనవేసుకుంది. ఆ గ్రామంలో ముప్పైసంవత్సరాల క్రితం ఇద్దరితో ప్రారంభౖమైన వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వంద మందికిపైగా వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. కార్మికులుగాను,ఉద్యోగులుగాను ఉన్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారుప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. కొరుట్ల శ్రీరాములు, ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కోస్నూరుపల్లె మారుమూల గ్రామం. ఈ గ్రామానికి అనుబంధంగా నాయికపుగూడెం, పెరుమండ్ల గూడెం, కోతులగూడేలున్నాయి. మొత్తం 300 కుటుంబాలు ఉండగా.. 1480 జనాభా ఉంది. కోస్నూరుపల్లె నుంచి మొదట 1989లో గల్ఫ్‌కు వలసలు ప్రారంభమయ్యాయి. చెరుకుపల్లె మల్లారెడ్డి, మూల మోహన్‌రెడ్డిలు మొదటగా దుబాయికి వెళ్లారు. ఇప్పుడు ఈ గ్రామానికి చెందిన దాదాపు 120 మంది గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. దుబాయి, మస్కట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ ప్రాంతాలకు మెరుగైన ఉపాధి కోసం వెళ్లా్లరు. అక్షరజ్ఞానం లేని వారు కూలీలుగాను, ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆయా దేశాల్లో ఉపాధి పొందుతున్న వారు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొందరు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి గ్రామంలోనే స్థిరపడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గల్ఫ్‌కు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డా నేను 1991లో మా స్నేహితుడు తిరుపతిరెడ్డితో కలిసి దుబాయికి వెళ్లి ఐదు సంవత్సరాలు ఓ కంపెనీలో పనిచేసిన తర్వాత మస్కట్‌లో ఐదు సంవత్సరాలు, బహ్రెయిన్‌లో ఐదు సంవత్సరాలు ఉపాధి పొంది వచ్చాను. గల్ఫ్‌లో పొందిన సంపాదనతో ఆర్థికంగా స్థిరపడ్డా. రెండు ఎకరాల భూమి కొనుక్కున్నా. ఆరోగ్యం బాగాలేక గ్రామానికి తిరిగి వచ్చాను. ఇక్కడే వ్యవసాయం చేస్తున్న. గల్ఫ్ దేశాలతో మా కుటుం» ం బాగుపడింది. – మూల మోహన్‌రెడ్డి ఇరవై సంవత్సరాలుకు పైగా పనిచేశాను 1992 నుంచి 2013 వరకు వివిధ దేశాల్లో పనిచేసిన. యూఏఈ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాలకు వెళ్లాను. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌కు గురైన. సంపాదించిన కొద్దిపాటి సొమ్ము వైద్యానికే ఖర్చయింది. కాలు, చేయి పనిచేయక వికలాంగుడినయ్యాను. పింఛన్ ఇస్త్తలేరు. నా తల్లి పింఛన్‌పై బతుకుతున్న.– మడుప రాజరెడ్డి గ్రామానికి తిరిగి వచ్చి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను గల్ఫ్ దేశాల్లో పదిహేను సంవత్సరాలున్నా. ఎన్నో కష్టనష్టాలు అనుభవవించిన. 2007లో ఇంటికి చేరిన. వలస జీవనం వద్దని గ్రామంలోనే ఉంటూ నీటి సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన. తర్వాత గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సర్పంచ్‌గా పట్టం కట్టారు. ప్రజల సహకారంతో గ్రామాభివద్ధికి కృషిచేస్తున్నా. – ఎన్నం లక్ష్మారెడ్డి -
వలసలు బాధించాయి..
‘తెలంగాణ జిల్లాల నుంచి మొదటగా గుజరాత్, మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేసేవారు. ఆ తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్లడం ప్రారంభమైంది. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావనతో వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది’ అని త్రిలోక్ చందన్‌గౌడ్ చెప్పారు. ఆయన ‘గల్ఫ్ వలస కార్మికుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు’ అంశంపై పరిశోధనలను చేసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2017లో ఈయన పరిశోధన ముగిసింది. గల్ఫ్ వలస కార్మికులపై పరిశోధనలను నిర్వహించిన తొలి రిసెర్చ్ స్కాలర్‌గా గుర్తింపు పొందిన త్రిలోక్ చందన్‌గౌడ్ అనుభవాలు ఆయన మాటల్లోనే... – ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ మా స్వస్థలం సంగారెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎంఏ సోషియాలజీ, ఎంఫిల్ చేశాను. పీహెచ్‌డీలో ఏ సామాజిక అంశం ఎంచుకోవాలనే విషయంలో కొంత ఆలోచించాను. అంతకుముందు ఉన్నత చదువులలో భాగంగా కొన్ని సదస్సులలో పాల్గొన్నాను. ఆ సెమినార్లలో గల్ఫ్ వలస కార్మికుల ఆంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ చర్చల సందర్భంగా కార్మికుల కష్టాలు తెలుసుకున్న నాకు కన్నీళ్లు వచ్చాయి. మా ప్రాంతంలో గల్ఫ్ వలసలు లేనప్పటికీ ఆ అంశంపై పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస ఎందుకు వెళ్తున్నారు, వలస కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగయ్యాయా అనే ఆంశంపై పరిశోధన చేయడం వల్ల వలస జీవులకు కొంతైనా ప్రయోజనం కలుగుతుందని భావించాను. అంతేకాక గల్ఫ్ వలసలపై ఇంత వరకు పరిశోధనలు జరగలేదు. నా ద్వారానే పరి శోధనలు మొదలు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా పరిశోధనలకు అనేక మంది ప్రోత్సాహాన్ని అందించారు. పలు అంశాలపై పరిశోధన గల్ఫ్ కంటే ముందు అనేక మంది పొరుగు రాష్ట్రాల్లోని బట్టల మిల్లుల్లో ఉపాధి పొందడానికి వెళ్లేవారు. 1960–70 మధ్య కాలంలో వలసలు మొదలయ్యాయి. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి మొదట సూరత్, గుజరాత్, భీవండి, ముంబై తదితర ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో పనిచేయడానికి కార్మికులు వలస వెళ్లేవారు. తెలంగాణలో వ్యవసాయం ప్రధాన వృత్తి అయినా.. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావన, ఇతర కారణాల వల్ల వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది. అలాగే కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావం అధికం కావడంతో గ్రామాల్లో యువకులను నక్సల్స్ అనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేసే వారు. దీంతో యువకులు పోలీసు దాడుల నుంచి తప్పించుకోవడానికి ముంబైకి.. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పయనమయ్యారు. అప్పట్లో గల్ఫ్ దేశాల్లో చమురు తవ్వకాలకు తోడు భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి కార్మికులు ఎంతో మంది అవసరం అయ్యారు. ముంబై కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. చమురు తవ్వకాలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారికి గల్ఫ్ దేశాల్లో ఎక్కువ వేతనం లభించడంతో వలసలు క్రమంగా పెరిగాయి. ఈ వలసలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశాను. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా వలసలు ఉన్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి పురుషుల వలసలు ఎక్కువగా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మహిళలు అరబ్‌షేక్‌ల ఇళ్లలో పనిచేయడానికి వెళ్తున్నారు. ఈ అంశాలపై లోతుగా పరిశోధన చేశాను. గల్ఫ్ దేశాల్లో వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఆంశంపై అధ్యయనం చేశాను. రీసెర్చిలో భాగంగా ఆ దేశాల్లో పర్యటించి కార్మికులను కలుసుకున్నాను. కార్మికుల ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి, పనికి తగ్గ వేతనం, సామాజిక భద్రత తదితర అంశాలపై ఐదేళ్ల పాటు పరిశోధన నిర్వహించా. గల్ఫ్ వలసలపై పరిశోధనలు నిర్వహించిన అనుభవంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిర్వహించిన సెమి నార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను. తాజాగా 2018 మార్చిలో నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ప్రవాసీ సంక్షేమ వేదిక తరఫున హాజరయ్యాను. ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన ముసాయిదాపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను వినిపించాను. అలాగే ఢిల్లీ, గుజ్రాత్, కేరళ, తమిళనాడు, మహా రాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వలస కార్మికుల అంశాలపై నిర్వహించిన సెమినార్లలో పాల్గొని వలస కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కార్మికుల పక్షాన డిమాండ్లను వినిపించాను. పరిశోధనలు కొనసాగిస్తున్నా.. గల్ఫ్ వలస కార్మికుల ఆంశంపై పీహెచ్డీ పూర్తిచేసినా ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టు డాక్టర్ ఫెల్లోషిప్ పొందుతున్నాను. సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడానికి మా పరిశోధనలు దోహదపడతాయని ఆశిస్తున్నాం. -
వివాదాల సుడిగుండంలో ఇంటింటి సర్వే!
* బతుకుదెరువు కోసం వెళ్లిన లక్షలాది జనం * సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకూ వలసలు * సుదూర ప్రాంతాల్లో గొర్రెలకాపర్లు, కూలీలు * ఒక్కరోజులో సర్వే ఎలా సాధ్యమవుతుంది? * ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ప్రతిపక్షాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇంటింటి సర్వేను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నెల 19న ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏ గ్రామానికి చెందిన వారు ఆ గ్రామంలో లేకుంటే ప్రభుత్వం, సంక్షేమ పథకాల లెక్కల్లో లేనట్టేనని హెచ్చరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, అత్యవసర విధుల్లో ఉన్నవారు, పొట్టకూటి కోసం వివిధ వృత్తులవారు రోజుల తరబడీ, నెలల తరబడీ ఊరికి దూరంగా వెళ్తుం టారు. ఆ ఒక్కరోజు వ్యక్తిగతంగా వెళ్లలేకపోతే జీవితాంతం నష్టపోవాల్సిందేనా? అని వారు భయాందోళన చెందుతున్నారు. ఉదాహరణకు.. తెలంగాణలో గణనీయంగా గొర్రెల కాపరులు దూరప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు వరుసగా ఐదారు నెలల పాటు వలస వెళ్తారు. మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెల మంద(జీవాల)ను ఇటు కరీంనగర్ నుంచి అటు గుంటూరులాంటి జిల్లాలకు కాలినడకన కొట్టుకుని పోతారు. ఇంటింటి సర్వే విషయంపై వీరికి కనీసం సమాచారం అందే అవకాశమే తక్కువ. ఒకవేళ ఇప్పుడున్న సెల్ఫోన్ల వంటి సమాచార వ్యవస్థ వల్ల సమాచారం అందినా.. గొర్రెల మందను ఎక్కడో విడిచిపెట్టి స్వంత గ్రామాలకు చేరడం సాధ్యం కాదు. హైదరాబాద్, ఇతర పట్టణాలకు కూలీ పనులు, చిన్న జీతాల కోసం వెళ్లినవారికీ ఆ ఒక్కరోజే ఊరికి వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆస్పత్రుల్లో ఉన్నవారి సంగతి...? అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, వారికి అటెం డెంట్లుగా ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడానికి అవకాశం లేదు. వైద్యం, ఫైరింగ్, పోలీసు వంటి అత్యవసర ఉద్యోగాల్లో ఉన్నవారూ వ్యక్తిగతంగా హాజరు కావడం చాలా కష్టం. మీడియాలో పనిచేస్తున్నవారు కూడా స్వంత గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందే. అందరికీ ఒకేరోజు సెలవు ఇస్తే ఆస్పత్రులు, మీడియా వంటి సంస్థలు ఎలా నడుస్తాయి? స్వంత గ్రామాల్లోనే వీరి వివరాలను నమోదు చేసుకోవాలనుకున్నవారు వీటిపై సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని వారెట్లా..? పొట్ట చేతపట్టుకుని దుబాయ్‌కి వలస వెళ్లినవారు కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి ఎందరో ఉన్నారు. సూరత్ (గుజరాత్), భీవండి (మహారాష్ట్ర) లాంటి ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేయడానికి తెలంగాణ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు వలస వెళ్లాయి. కాళ్లుచేతుల్లో సత్తువ ఉన్నంతకాలం రెక్కల కష్టంతో కొంత సంపాదించుకుని, సొంత గ్రామంలోనే స్థిరపడాలని చాలామంది కోరుకుంటున్నారు. వీరంతా ఒకేరోజు రావాలంటే రవాణా సదుపాయాలు సాధ్యం కావడం లేదు. వీరిలో కొందరికి సమాచారం లేకపోగా మరికొందరికి ఇదేంటో అర్థం కావడం లేదు. కచ్చితంగా సొంత గ్రామానికి రావాలని కోరుకుంటున్నవారికి రైలు టికెట్లు దొరకడం లేదు. ఇప్పటికే సూరత్ నుంచి వచ్చే రైళ్లకు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇక విదేశాల్లో ఉన్నవారికి విషయం తెలిసినా ఒక్కరోజు కోసం రావడం సాధ్యమేనా? అనే అనుమానాలు ముప్పిరి గొంటున్నాయి. అప్పోసప్పో చేసి విదేశాలకు వెళ్లిన చిరువేతన జీవులు వేలకు వేలు ఖర్చుచేసి ఒక్కరోజుకోసం స్వంత గ్రామానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా.. ఒక్కరోజే ఈ సర్వే అంటే ఎలా సాధ్యమని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి.