నిర్మల్ జిల్లాలో నిర్వహించిన గల్ఫ్ వలసలపై అవగాహన సమావేశంలో కరపత్రాలను ప్రదర్శిస్తున్న ప్రవాసీ మిత్ర యూనియన్ ప్రతినిధులు (ఫైల్)
గల్ఫ్ డెస్క్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాలనుకునే వారికి నిబంధనలు, విధి విధానాలపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్(పీఎంఎల్‌యూ) అవగాహన కల్పిస్తూ వలసదారుల్లో చైతన్యం పెంపొందిస్తోంది. చట్టబద్ధంగా వెళ్లండి.. సురక్షితంగా వెళ్లండి.. అనే నినాదంతో యూనియన్ ప్రతినిధులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలను సమీకరించి.. వలస వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పల్లెల్లో కొంత మంది వలసదారులు నిరక్షరాస్యత కారణంగా మోసాలకు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వారి కుటుంబ సభ్యులకు వివరించి మోసపోకుండా ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో పాఠశాలలను కూడా అవగాహన కార్యక్రమాలకు వేదికగా ఎంచుకుంటున్నారు. ప్రత్యేకంగా కరపత్రాలను ప్రచురించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. కాగా, గల్ఫ్ వలసలపై నిర్వహిస్తున్న అవగాహన సమావేశాల్లో.. పలువురు తాము మోసపోయిన తీరును, గల్ఫ్ దేశాల్లో పడిన ఇబ్బందులను ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తుండడం గమనార్హం.
పాస్‌పోర్టు దరఖాస్తు మొదలుకొని..
వలస వెళ్లేవారికి తమ పాస్‌పోర్టును పొందడానికి దరఖాస్తు చేసుకునే దశ నుంచి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో అనేక మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో సరైన వివరాలు అందించకుండా.. అందుబాటులో ఉన్న ఏవో కొన్ని వివరాలతో పాస్‌పోర్టులను పొందారు. దీనివల్ల వలస వెళ్లిన కార్మికులు ఇంటికి వచ్చిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలోనూ నష్టపోయారు. కొందరు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను స్వస్థలానికి తీసుకువచ్చే సమయంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలకు, పాస్‌పోర్టులోని వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందువల్ల పాస్‌పోర్టు దరఖాస్తులలో తప్పుడు వివరాలు అందించవద్దని పీఎంఎల్‌యూ ప్రతినిధులు సూచిస్తున్నారు. తాము వలసవెళ్లే దేశం, కంపెనీ, పని వివరాలపై స్పష్టత ఉండాలని, ఇందుకోసం లైసెన్స్‌డ్ ఏజెంట్ల ద్వారానే సరైన వీసాలను పొందాలని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రవాసీ బీమాపై...
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందే ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) గురించి కూడా పీఎంఎల్‌యూ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. వలస కార్మికులు రూ.325 ప్రీమియం చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో రూ.10లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పాలసీ పొంది ఇ–మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు చేసుకుని ఎమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. పీబీబీవై లేకుండా కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని ప్రతినిధులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
- నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ పొంది.. శిక్షణ పొందిన రంగంలోనే ఉపాధి పొందడానికి వీసా కోసం ప్రయత్నించాలి.
- విజిట్ వీసాపై వెళ్లవద్దు. ఫ్రీ వీసా, ఆజాద్ వీసా, ఖఫాలత్ వీసా, ప్రైవేట్ వీసాలు ఏమీ లేవు. ఒక వేళ అలాంటి వీసాలు ఇచ్చినా వెళ్లకూడదు.
- వీసా ఇచ్చే ఏజెంటును చెల్లుబాటు అయ్యే వీసా, ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్టు, డిమాండ్ లెటర్, పవర్ ఆఫ్ అటార్నీ గురించి ప్రశ్నించి ఆ పత్రాలను తీసుకోవాలి.
- టామ్‌కామ్ అందించే ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్(ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ)ను తీసుకోవడం వల్ల వలసదారులు ఇబ్బంది పడకుండా ఉంటారు.
- వలస వెళ్లే ముందు వీసా, పాస్‌పోర్టు ఇతర జిరాక్సు పత్రాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరితో జాయింట్ ఖాతాను బ్యాంకులో తీసుకోవాలి.
- ఇమిగ్రేషన్ యాక్టు 1983 ప్రకారం లైసెన్స్ ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్‌కు 45 రోజుల వేతనం లేదా గరిష్టంగా రూ.30వేలతో పాటు అదనంగా 18 శాతం జీఎస్టీ అంటే రూ.5,400 మాత్రమే వీసా కోసం చెల్లించాలి. ఇంతకంటే ఎక్కువ చెల్లించవద్దు.
వలస వెళ్లిన తర్వాత..
- విదేశాలకు వలస వెళ్లిన తరువాత వీసా స్టాంపింగ్, ఐడీ కార్డు పొందిన అనంతరం ఆ దేశంలోని మన విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. దీనివల్ల వలసకు చట్టబద్ధత వర్తిస్తుంది.
- ఉద్యోగం చేస్తున్న దేశంలో ఆ దేశ ఆచార, సంప్రదాయాలను పాటించాలి. అక్కడి చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది.
- ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో అక్కడి చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేధం.
- వీసా ఇచ్చిన కంపెనీ లేదా యజమాని వద్ద కాకుండా ఇతరుల వద్ద పనిచేయడం సరికాదు. ఖల్లివెల్లిగా మారిన వారు హక్కులను కోల్పోతారు.
యూఏఈకి మనుషుల అక్రమ రవాణా..
కొన్ని నెలల నుంచి యూఏఈలోని పలు ప్రాంతాల్లో హాస్పిటాలిటీ, సూపర్‌మార్కెట్, బల్దియా కంపెనీల్లో ఉపాధి పేరిట మనుషుల అక్రమ రవాణా సాగుతోంది. ఆయా కంపెనీల్లో ఉపాధి కల్పిస్తున్నా నేరుగా వర్క్ వీసా ఇవ్వకుండా మొదట విజిట్ వీసాపై మనుషులను యూఏఈకి తరలిస్తున్నారు. విజిట్ కం ఎంప్లాయ్‌మెంట్ వీసాలను లైసెన్స్‌డ్ రిక్రూటింగ్ ఏజెంట్లు జారీచేస్తున్నారు. విజిట్ వీసాపై యూఏఈకి పంపించి అక్కడ వర్క్ వీసా ఇవ్వడం వల్ల కార్మికులు ఎన్నో ప్రయోజనాలను కోల్పోతున్నారు. విజిట్ వీసాలపై విదేశాలకు వెళ్లడం వల్ల మన ప్రభుత్వం రూపొందించిన ఇ–మైగ్రేట్ సిస్టంలో వలస వెళ్లిన వారి పేర్లు నమోదు కావు. దీంతో ఆపద సమయంలో విదేశాంగ శాఖ సహాయం పొందలేకపోతున్నారు. ప్రవాసీ కార్మికులకు అందిస్తున్న రూ.10 లక్షల బీమా, ప్రమాద బీమా వర్తించవు.
ఎవరూ నష్టపోవద్దని మా లక్ష్యం
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, ఇతర ప్రయోజనాలపై మేము నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చట్టబద్ధంగా వెళ్లకపోతే కలిగే ఇబ్బందులు, ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నాం. అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. గల్ఫ్ వలసల వల్ల ఎవరూ నష్టపోవద్దనేదే మా ఉద్దేశం. ప్రజలు మమ్మల్ని పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు.
– స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్
కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి
సౌదీ అరేబియా నుంచి సిద్దిపేట జిల్లా వాసుల వినతి
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, ఎన్సాన్‌పల్లి, ఇర్కోడ్ గ్రామాలకు చెందిన ఐదుగురు కూలీలు ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చింతమడక గ్రామానికి చెందిన అనుమగారి కోటి, స్వామి, సుతారి కనకయ్య, ఎన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన నర్సింలు, ఇర్కోడ్ గ్రామానికి చెందిన మాట్ల రవీందర్ ఉపాధి కోసం సౌదీకి వెళ్లారు. అయితే, గార్డెనింగ్ పనులు చేయాల్సి ఉంటుందని తమకు ఏజెంట్లు చెప్పారని, కానీ తమను పెట్రోల్ బావుల్లో పనులు చేయిస్తున్నారని వారు చెప్పారు. తాము ఈ పనులు చేయమని కంపనీ యజమానికి చెప్పడంతో.. యజమాని ఒక రోజు ఎండలో నిలబెట్టినట్లు తెలిపారు. గత్యంతరం లేక అదేపని చేస్తున్నామని, కొన్ని రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఉంటున్నామని వారు సౌదీ నుంచి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తాము ఇండియాకు వచ్చేలా చూడాలని కోరారు.
–పడిగె వెంకటేశ్, సిద్దిపేట రూరల్
ప్రమాదకర పనులు చేయిస్తున్నారు
గార్డెన్ పని అని చెప్పి ఇక్కడ ప్రమాదకరంగా పెట్రోల్ బావుల్లో పనిచేయిస్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగి కొన్ని రోజుల క్రితం 16 మంది మృతి చెందారు. బిక్కుబిక్కుమంటూ పోట్టకూటి కోసం పనిచేస్తున్నాం. నాయకులు, అధికారులు స్పందించి మమ్మల్ని మా కుటుంబం వద్దకు చేర్చాలి.
–అనుమగారి స్వామి
దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం..
బతుకుదెరువు కోసం సౌదీకి వచ్చిన మాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రమాదకరమైన పెట్రోల్ బావుల్లో పనిచేయిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరగుతుందోననే భయంతో గడుపుతున్నాం. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము స్వదేశానికి వచ్చేలా సాయం చేయాలి.
–సుతారి కనకయ్య
దినదినగండంగా బతుకుతున్నాం..
ఏజెంట్లు మోసం చేయడంతో ఇక్కడ పడరాని పాట్లు పడుతున్నాం. దినదిన గండంగా బతుకుతున్నాం. ప్రమాద స్థలాల్లో పని చేయము అని చెబితే ఇబ్బందులు పెడుతున్నారు. తిండిపెట్టకుండా ఎండలో నిలబెడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ఉంటున్నాం. మాకు ఇక్కడ ఉండాలని లేదు.
–నర్సింలు
ఇబ్బందులకు గురిచేస్తున్నారు..
మేము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఏజెంట్‌కు చెబితే ముంబైలోని కంపనీ వారి ఫోన్ నంబర్ ఇచ్చాడు. ముంబై వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదు. మమ్మల్ని ఇండియాకు పంపాలని ముంబై కంపనీ నుంచి మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తే వెంటనే పంపిస్తారు. కానీ, వారు స్పందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాయకులు, అధికారులు స్పందించి మేము ఇంటికి వచ్చేలా చూడాలని కోరుతున్నాం.
–రవీందర్
Comments
Please login to add a commentAdd a comment