కేంద్రం తప్పుడు విధానాలు | KCR Fires On Central Government | Sakshi
Sakshi News home page

కేంద్రం తప్పుడు విధానాలు

Published Wed, May 6 2020 4:51 AM | Last Updated on Wed, May 6 2020 8:27 AM

KCR Fires On Central Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కరోనా రాకకు ముందే దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిని ఉందన్నారు. పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో మరింతగా దెబ్బతిందన్నారు. తెలంగాణకు ప్రతి నెలా అన్నీ కలిపి రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఇందులో సొంత పన్నుల ఆదాయమే రూ.10,800 కోట్లు అన్నారు. వచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రతి నెలా రూ.3వేల కోట్లు కావాలన్నారు. ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదన్నారు. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్‌డౌన్

దేశ ద్రవ్య నియంత్రణ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులివ్వట్లేదని, వేరే మార్గాల్లోనైనా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించట్లేదని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న హెలికాప్టర్‌ మనీ వంటి మార్గాల్లో డబ్బు సమీకరించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచాలని, రాష్ట్రాల అప్పుల కిస్తీలను వాయిదా వేయాలని విజ్ఞప్తిచేసినా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. ఈ పనులను ఎందుకు చేయడం లేదు?, చేస్తే మీ మీద భారం పడుతుందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నెలలో కూడా అప్పులకు సంబంధించిన రూ.2,500 కోట్ల వడ్డీలను ఆర్బీఐ కట్‌ చేసుకుందన్నారు.

కొంత సమయం వేచి చూస్తామని, ఆ తర్వాత తీవ్రంగా స్పందిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం అధికారాలను తన దగ్గర పెట్టుకుని వాడుకోవట్లేదని, చేతకాకపోతే రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు వారి నుంచి రైలు టికెట్‌ చార్జీలను కేంద్రం వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. స్పెషల్‌ రైళ్లు, రిజర్వేషన్ల పేరుతో ఈ సమయంలో కూడా దోపిడీ అవసరమా అని మండిపడ్డారు. వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపేందుకు టికెట్‌ చార్జీల కింద మంగళవారం రూ.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కట్టిందన్నారు.  చదవండి: ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు

విద్యుత్‌ బిల్లుతో తీవ్ర వైపరీత్యాలు 
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విద్యుత్‌ చట్టం సవరణ ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించేలా ఈ బిల్లు ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితిలో పార్లమెంట్లో పాస్‌కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్ల అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, దీనిని కేంద్రం లాగేసుకునేందుకు ఈ బిల్లును తెచ్చిందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్‌ సబ్సిడీలకు మంగళం పాడాల్సి ఉంటుందని, రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ వం టి పథకాలు ఉండవన్నారు. అందరూ సబ్సి డీ లేకుండా విద్యుత్‌చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత నగదు బదిలీ రూపంలో సబ్సిడీలను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు సైతం పెట్టాలని కేంద్రం కోరుతుందన్నారు. విద్యుత్‌ సరఫరాను ప్రైవేటుపరం చేసేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారని, ప్రజల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలుచేసే పరిస్థితి వస్తుందన్నా రు. విద్యుత్‌ అంశం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉందని, దీనికి సంబంధించిన మొత్తం అధికారాలను లాక్కోవడానికి కేం ద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించి న కొన్ని అధికారాలను లాక్కునేందుకు ప్ర యత్నిస్తే, బీజేపీ ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారాలను లాగేసుకుంటోందన్నా రు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విఘాతమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement