వలసల కష్టాలు కథలుగా వినే ఉన్నాం.. వాటిని ‘కరోనా’ ఇప్పుడు నిజాలుగా చూపిస్తోంది.. పరాయి రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం మన దగ్గరకు వచ్చినవాళ్ల కన్నీళ్లనే కాదు.. పని వెదుక్కుంటూ పరాయి దేశం పోయిన మన వాళ్ల వ్యథలనూ! కువైట్‌లోని మన మహిళా డొమెస్టిక్ హెల్పర్స్ (ఇళ్లలో పని చేసే వాళ్లు) పడుతున్న ఇబ్బందుల గురించిన కథనం ఇది..
కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆమ్నెస్టీ ప్రకటించింది కువైట్. వీసా గడువు అయిపోయాక కూడా ఆ దేశంలో ఉంటున్న వారికి, జరిమానా శిక్షలు పడ్డవారికి క్షమాభిక్ష పెట్టి వాళ్ల వాళ్ల దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం అక్కడున్న మన మహిళా డొమెస్టిక్ హెల్పర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా అరబ్బీ మాట్లాడలేక, నిరవధికంగా పన్నెండు గంటలు, ఒక్కోసారి 20 గంటలు పనిచేయలేక, తిండి, నిద్రలేక అనారోగ్యం పాలై.. యజమానుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి ఈ ఆమ్నెస్టీ ఓ వరంలా కనిపించింది.
దాంతో యజమానుల కళ్లు గప్పి, రెండంతస్తుల మేడ మీద నుంచి చీర సహాయంతో కిందకు దూకి .. ఇలా రకరకాల ప్రయత్నాలతో బయటపడ్డారు. కొందరైతే ఆమ్నెస్టీ పెట్టకముందే బయటకు వచ్చేశారు... పాస్‌పార్టుల సంగతి అటుంచి చేతిలో చిల్లిగవ్వ, కాళ్లకు చెప్పుల్లేక కట్టుబట్టలతో. ఎటు వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎక్కుడుండాలి? ఏమీ తెలియదు. స్నానం లేదు, తిండి లేదు. పైగా కరోనా లాక్‌డౌన్. బయట కనిపిస్తే జరిమానా, జైలు. వీటన్నిటి నుంచీ తప్పించుకుంటూ తిరుగుతుండగా అక్కడ వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలుగు స్వచ్ఛందసేవా కార్యకర్తల సాయంతో షెల్టర్ హోమ్‌కి చేరారు. వాళ్లలో కొంతమంది నేపథ్యాలు..
కూలోనాలో చేసుకుంటా...
అంటోంది ఈడిపల్లి లక్ష్మి. ఆమె స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలోని రామారావుపేట. కువైట్‌కు వెళ్లి మూడేళ్ల అవుతోంది. ‘నా తాగుబోతు భర్తతో పడలేక విడాకులు తీసుకున్నా. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు, పొలం లేవు. అప్పలు తీరాలి, పూట గడవాలి. అందుకే కువైట్‌కు వచ్చా. ఇక్కడి భాష రాక బాధలు పడ్డా. ఇంక నావల్ల కాక ఓరోజు షేక్ ఇంట్లోంచి పారిపోయా. తిండిలేక కడుపు మాడ్చుకుంటాను కాని అద్దె కట్టకపోతే గదిలో ఉండనివ్వరు కదా! నయా పైసా లేక నానా తిప్పలు. చివరికిలా క్యాంపులోకొచ్చి పడ్డా. మా సొంతూరెళ్లిపోయి కూలోనాలో చేస్కోని బతుకుతాను’’ అంటూ చేతులు జోడిస్తోంది లక్ష్మి.
ఇంట్లోంచి గెంటేశారు..
అని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తోంది కోన కృష్ణవేణి. ఆమె స్వస్థలమూ తూర్పు గోదావరి జిల్లానే. యేడాది కిందట భర్త చనిపోయాడు. అమ్మానాన్నా, అత్తమామల అండ లేదు. జీవనాధారమూ లేదు. దాంతో పొరుగుదేశంలో పనిమనిషిగానైనా నాలుగు డబ్బులు వెనకేసుకుందామని కువైట్ చేరింది. ఇంతలో కరోనా వల్ల కష్టమొచ్చిపడింది. ‘‘పనివాళ్ల వల్ల కరోనా వస్తుందని భయపడ్డారో ఏమో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. ఎక్కడికెళ్లాలో తెలియదు. భాష రాదు. తిండి, నీళ్లు లేక తిరుగుతుంటే తెలుగు వాళ్లే చూసి క్యాంప్‌కు తీసుకొచ్చారు’ అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి.
అకామా బ్లాక్ అయిందని..
భయపెడ్తున్నారు అని బాధపడుతోంది పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలు మండలం, ఆట్లపాడుకు చెందిన సత్యభారతి. 2019, నవంబరులో కువైట్‌కు వచ్చింది భారతి. అయితే గల్ఫ్ ఆమెకు కొత్త కాదు. ఇదివరకు ఖతర్, దుబాయ్, బహరెయిన్‌లలో డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేసింది. కాని ఇప్పుడు కువైట్‌లో ఎదురైన సమస్యే భయపెడుతోంది ఆమెను. ‘ఖతర్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైంది. ఇండియాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈలోపు మా నాన్న చనిపోవడం, నా భర్తతో గొడవలు.. మానసికంగానూ దెబ్బతిన్నా. కూర్చుంటే రోజు గడిచే దారి లేదు. అందుకే మళ్లీ గల్ఫ్‌కు ట్రై చేసుకొని కువైట్‌కొచ్చా. నాలుగు నెలలుగా జీతం ఆపేశారు. నా పరిస్థితి గురించి మా చుట్టాలకు ఫోన్ చేద్దామన్నా డబ్బుల్లేవు. కొంచెం టెన్షన్ పడ్డా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. ఇండియా వెళ్లిపోతాను సహాయం చేయండని తెలిసిన వాళ్లను అడిగితే నీ అకామా (రెసిడెంట్ స్టాంప్)బ్లాక్‌లో ఉంది, రెండు లక్షల రూపాయలవుతాయి అని చెప్పారు. బ్లాక్‌లో ఎందుకు ఉంటుందని భయపడి ఏజెంట్‌కు ఫోన్ చేస్తుంటే అతణ్ణించి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆమ్నెస్టీ నాకోసమే వచ్చినట్టయింది’ చెప్పుకొచ్చింది సత్యభారతి.
వీళ్లంతా కువైట్ నుంచి టేకాఫ్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అక్కడున్న మన రాయబార కార్యాలయం ద్వారా వైట్‌పాస్ (లేదా అవుట్‌పాస్ అంటే ఆపద్ధర్మ పాస్‌పార్ట్)లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛందసేవా కార్యకర్తలు.
Comments
Please login to add a commentAdd a comment