Domestic Workers
-
పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో
న్యూఢిల్లీ: ఇంట్లో పనిచేసే సహాయకులకు ఏ పండగ్గో,పబ్బానికో కొత్త బట్టలు, లేదంటే ఎంతో కొంత నగదు బోనస్‌లు ఇవ్వడం సహజం. ఎంత పెద్ద గొప్ప వ్యాపారవేత్తలయినా కాస్త అటూ ఇటూగా దాదాపు ఇదే చేస్తారు. కానీ మలేషియాకు చెందిన మహిళా వ్యాపారవేత్త మాత్రం అద్భుతమైన బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచింది. వెబ్సైట్ మదర్షిప్ ప్రకారం, ఫరావెన్ అనే మహిళ తన ముగ్గురు ఇంటి పనివాళ్లకు భారీ బహుమతి ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్. తన ముగ్గురు మహిళా గృహ సహాయకులకు సుమారు రూ. 1.8 లక్షల గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కవర్లు ఇస్తూ టిక్‌టాక్ వీడియోను ఫరా షేర్ చేసింది. ముస్లింలకు అతిపెద్ద సెలవుదినాలలో ఒకటైన హరి రాయ (దీనిని హరి రాయ ఐడిల్ఫిత్రి అని కూడా పిలుస్తారు) కోసం ద్వీపానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసింది. (ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) డిపింగ్ పూల్, బాత్‌టబ్, లాంజ్ ఏరియాతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సూట్లో ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం వారికి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ వీడియోలో హెలికాప్టర్లో సదరు ద్వీపానికి ప్రయాణం అవ్వడాన్ని, అలాగే యజమాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. Jadi bibik pun dapat duit raya 5 angka, siap dapat pakej healing 😭 pic.twitter.com/94Sz6Gzj6V — 🇲🇾 (@localrkyt) April 13, 2023 టిక్‌టాక్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇతర సోషల్‌మీడియాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమె దాతృత్వాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. మరి కొందరు ఇది వాళ్లకి సంతోషాన్నిస్తుందా అని, ఇది ఫేక్ అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళల పట్ల ఓనర్లు ఔదార్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి గతేడాది దీపావళి రోజున చెన్నై వ్యాపారి తన సిబ్బందికి రూ.1.2 కోట్లకు పైగా విలువైన కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) -
మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజూ బండెడు చాకిరీ.. పురుషులు మాత్రం!
అహ్మదాబాద్ : మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటిపనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్ యూజ్ డేటా : ఏ టూల్ ఫర్ జెండర్డ్ పాలిసీ అనాలిసిస్’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే , మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్ నమ్రత చందార్కర్ తెలిపారు. -
World Day Against Child Labour 2022: పని నేర్పించడం వేరు.. పని చేయించడం వేరు
తల్లిదండ్రులు యజమానులు కాదు. పిల్లలు కార్మికులు కాదు. ‘అది ఎత్తు’ ‘ఇది సర్దు’ ‘నీళ్లు తీసుకురా’ ‘ఇల్లు చిమ్ము’ ‘స్కూటర్ తుడువు’ పిల్లలకు పని నేర్పాల్సిందే. కాని వారు మన కడుపున పుట్టినందున మనం చెప్పే పనులన్నీ చేస్తే బాలకార్మికులే అవుతారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద చేసే అజమాయిషీ అన్యాయంగా ఉంటుంది. వారిది ఆడే పాడే చదువుకునే వయసు. ఇంట్లో అయినా బయట అయినా కూలి బతుకు కాదు. ‘అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గ్రహించాల్సింది ఇదే. ఒక సందర్భం: తొమ్మిదో క్లాసు చదువుతున్న వర్థన్ టీవీ చూస్తున్నాడు. అమ్మ బజారుకు వెళ్లి నూనె పేకట్ తెమ్మంది. ఆ షాప్ ఇంటికి కొంచెం దూరం. అమ్మ వెళ్లొచ్చు. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నాన్న కూడా వెళ్లొచ్చు. వర్థన్ చాలాసార్లు వెళ్లి తెస్తాడు. కాని ఆ టైమ్‌లో వాడికి వెళ్లడం ఇష్టం లేదు. అమ్మ పదేపదే చెప్తోంది. వాడు కదలట్లేదు. లాగి ఒక్కటిచ్చింది. ఎదుగుతున్న పిల్లాడు. చాలా హర్ట్ అయ్యాడు. ఇంట్లో నుంచి గంట మాయం అయిపోయాడు. ఆ అమ్మా నాన్నలు పడ్డ కంగారు అంతా ఇంతా కాదు. పని చేసి తీరాల్సిందే అనేది వాడికి రూలు కాదు. వాడు ఆ నియమానికి బద్ధుడు కాదు. వాడు చిన్నపిల్లాడు కనుక పెద్దలు భయపడి చచ్చినట్టు చేయాల్సిందే అనే భావనా సరిౖయెనది కాదు. మరో సందర్భం: పదో క్లాసు చదువుతున్న మాలిక రెండు రోజులకు ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లి రెండు బిందెలు నీళ్లు తేవాలి. వాళ్లు ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటారు. వాడుకునే నీళ్లు ట్యాంకు నుంచి వస్తాయి. తాగే నీళ్లే కింద పట్టుకుని తెచ్చుకోవాలి. పనిమనిషి తేదు. తల్లి రెండేళ్ల క్రితం వరకూ తెచ్చేది. ఇప్పుడు పూర్తి బాధ్యత మాలికకు అప్పజెప్పింది. తండ్రి, అన్నయ్యకు ఈ బాధ్యత లేదు. నీళ్ల బరువు మాలిక నెత్తి మీదే. మాలికకు ఒక్కోసారి చేయబుద్ధి కాదు. ఆ రోజు ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. మూడో సందర్భం: ప్రతి ఇంటి హాలులో సోఫా ఉంటుంది. సోఫాలో తల్లి, తండ్రి కూచుని ఉంటారు. కాని వారికి దూరంగా ఉన్న ఫోన్ పిల్లలు తెచ్చివ్వాలి. ఫ్రిజ్‌లో నుంచి నీళ్లు పిల్లలు తెచ్చివ్వాలి. ఎవరో డోర్ కొడతారు. మరో రూమ్‌లో చదువుకుంటున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలు తలుపు తెరవాలి. చెత్తవాడు బయట రిక్షా ఆపుతాడు. పిల్లలు వెళ్లి పోసి రావాలి. అమేజాన్ పార్శిల్ వస్తుంది. పిల్లలే అందుకోవాలి. స్విగ్గి ఆర్డర్ పెట్టాలి. పిల్లలకే ఆ పని చెప్పాలి. ఇవన్నీ పిల్లలు చేయదగ్గ అతి తేలికైన పనులే. కాని పిల్లల స్థానంలో నౌకర్ని ఊహించుకుంటే ఇన్ని పనులు చెప్పగలమో లేదో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పదిహేను పదహారేళ్లు వచ్చే వరకూ పిల్లలకు పని ప్రత్యేకంగా ఇష్టం ఉండదు. వారు సంతోషంగా ఉండటానికి చూస్తారు. ఆడుకోవాలనుకుంటారు. చదువుకుంటారు. టీవీలు, వీడియోలు చూస్తారు. సైకిల్ తొక్కుతారు. ఊరికూరికే నవ్వుకుంటూ ఉంటారు. వారికి పని నేర్పించడం పెద్దల బాధ్యత. ఇంటి పనుల్లో కూడా పిల్లలకు భాగం ఉంటుంది. బాత్రూమ్లో వస్తువులు నీట్‌గా పెట్టడం, స్నానం చేశాక వారి బట్టలు తీసుకెళ్లి వాష్ ఏరియాలో పడేయడం, చెప్పుల స్టాండ్‌లో చెప్పులు నీట్‌గా సర్దుకోవడం, నిద్ర లేచాక దుప్పట్లు మడత వేయడం, అవసరం అయితే టీ పెట్టడం నేర్చుకోవడం... ఇవి కూడా పనులే. ఈ మాత్రం పనులు వారు తెలుసుకుని ఉండాలి. అంతమాత్రం చేత వారికి పనులు రావాల్సిందే అని పంతం పెట్టి ఇల్లు చిమ్మించడం, బట్టలు ఉతికించడం, అంట్లు తోమించడం, నీళ్లు మోయించడం, దూరాలకు పంపి పదే పదే వస్తువులను తెప్పించడం... వారిని బాల కార్మికుల కింద మార్చడమే అవుతుంది. పిల్లలు కొంత ఎదిగిన వెంటనే ఇక పనులు వారి నెత్తిన వేసే ధోరణి తల్లిదండ్రుల్లో ఉంటుంది. అది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే అనుమతించదగింది. వారు ఏ మాత్రం ఇంటి నౌకర్లు కారు. ఇంటి సభ్యులు. మరో విషయం. కొందరికి చదువు బాగా వంటబట్టినట్టు కొందరు పిల్లలకు పనులు బాగా వంటబడతాయి. కొందరు పిల్లలకు ఎంతమాత్రం పనులు రావు. దానికి ఏం చేయలేము. ఉదాహరణకు కొందరు పిల్లలు టక్కున వస్తువు పట్టుకురాలేరు. ‘షెల్ఫ్‌లో జండూబామ్ ఉంటుంది తీసుకురా’ అని తల్లి ఆర్డర్ వేస్తే కొందరు పిల్లలకు భూతద్దం ఇచ్చినా ఆ జండూబామ్ కనపడదు. వారికి కనపడదు అని తల్లికి కూడా తెలుసు. ‘కనపడిందా.. కనపడిందా’ అని తల్లి అరుస్తూ ఉంటుంది. పిల్లాడికి అది చాలా యాంగ్జయిటీని ఇస్తుంది. తల్లో, తండ్రో ‘నా బిపి టాబ్లెట్ స్ట్రిప్ తీసుకురా’ అనంటే అది టక్కున వెతికి తెచ్చే వరకు, అలా వెతకడం రాకపోతే ఆ పిల్లాడి నెత్తి మీద పిడుగు పడుతుందంటే అది వింతగా ఉండొచ్చు. కాని అది నిజం. కొందరు పిల్లల దుర్బలంగా ఉంటారు. కొన్ని పనులు చేయలేరు. కొందరు పిల్లలు బద్దకంగా ఉంటారు. వేగంగా కదల్లేరు. కొందరు పిల్లలు అసలు పని అంటేనే లోలోపల కుమిలిపోతారు. వారిని చాలా మెల్లగా అవసరం మేరకు దారిలో పెట్టుకోవాలి తప్ప కొరడా పట్టుకుని అదిలించే పద్ధతిలో కాదు. బయట షాపుల్లో వీధుల్లో కనిపించే బాల కార్మికులను చూసి జాలి పడటం కాదు. మన ఇళ్లల్లో మన పిల్లలు ‘కార్మికులు’గా ఎన్ని పని గంటలు ఇంటి పని చేస్తున్నారు, ఆ శ్రమ వల్ల వారి మానసిక, భౌతిక స్థితిలో ఏం తేడా కనిపిస్తోంది అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలి. పిల్లలు పుట్టడమే సున్నితంగా పుడతారు. వారితో సున్నితంగా వ్యవహరించాల్సింది పెద్దలే. -
టేకాఫ్
వలసల కష్టాలు కథలుగా వినే ఉన్నాం.. వాటిని ‘కరోనా’ ఇప్పుడు నిజాలుగా చూపిస్తోంది.. పరాయి రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం మన దగ్గరకు వచ్చినవాళ్ల కన్నీళ్లనే కాదు.. పని వెదుక్కుంటూ పరాయి దేశం పోయిన మన వాళ్ల వ్యథలనూ! కువైట్‌లోని మన మహిళా డొమెస్టిక్ హెల్పర్స్ (ఇళ్లలో పని చేసే వాళ్లు) పడుతున్న ఇబ్బందుల గురించిన కథనం ఇది.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆమ్నెస్టీ ప్రకటించింది కువైట్. వీసా గడువు అయిపోయాక కూడా ఆ దేశంలో ఉంటున్న వారికి, జరిమానా శిక్షలు పడ్డవారికి క్షమాభిక్ష పెట్టి వాళ్ల వాళ్ల దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం అక్కడున్న మన మహిళా డొమెస్టిక్ హెల్పర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా అరబ్బీ మాట్లాడలేక, నిరవధికంగా పన్నెండు గంటలు, ఒక్కోసారి 20 గంటలు పనిచేయలేక, తిండి, నిద్రలేక అనారోగ్యం పాలై.. యజమానుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి ఈ ఆమ్నెస్టీ ఓ వరంలా కనిపించింది. దాంతో యజమానుల కళ్లు గప్పి, రెండంతస్తుల మేడ మీద నుంచి చీర సహాయంతో కిందకు దూకి .. ఇలా రకరకాల ప్రయత్నాలతో బయటపడ్డారు. కొందరైతే ఆమ్నెస్టీ పెట్టకముందే బయటకు వచ్చేశారు... పాస్‌పార్టుల సంగతి అటుంచి చేతిలో చిల్లిగవ్వ, కాళ్లకు చెప్పుల్లేక కట్టుబట్టలతో. ఎటు వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎక్కుడుండాలి? ఏమీ తెలియదు. స్నానం లేదు, తిండి లేదు. పైగా కరోనా లాక్డౌన్. బయట కనిపిస్తే జరిమానా, జైలు. వీటన్నిటి నుంచీ తప్పించుకుంటూ తిరుగుతుండగా అక్కడ వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలుగు స్వచ్ఛందసేవా కార్యకర్తల సాయంతో షెల్టర్ హోమ్‌కి చేరారు. వాళ్లలో కొంతమంది నేపథ్యాలు.. కూలోనాలో చేసుకుంటా... అంటోంది ఈడిపల్లి లక్ష్మి. ఆమె స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలోని రామారావుపేట. కువైట్‌కు వెళ్లి మూడేళ్ల అవుతోంది. ‘నా తాగుబోతు భర్తతో పడలేక విడాకులు తీసుకున్నా. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు, పొలం లేవు. అప్పలు తీరాలి, పూట గడవాలి. అందుకే కువైట్‌కు వచ్చా. ఇక్కడి భాష రాక బాధలు పడ్డా. ఇంక నావల్ల కాక ఓరోజు షేక్ ఇంట్లోంచి పారిపోయా. తిండిలేక కడుపు మాడ్చుకుంటాను కాని అద్దె కట్టకపోతే గదిలో ఉండనివ్వరు కదా! నయా పైసా లేక నానా తిప్పలు. చివరికిలా క్యాంపులోకొచ్చి పడ్డా. మా సొంతూరెళ్లిపోయి కూలోనాలో చేస్కోని బతుకుతాను’’ అంటూ చేతులు జోడిస్తోంది లక్ష్మి. ఇంట్లోంచి గెంటేశారు.. అని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తోంది కోన కృష్ణవేణి. ఆమె స్వస్థలమూ తూర్పు గోదావరి జిల్లానే. యేడాది కిందట భర్త చనిపోయాడు. అమ్మానాన్నా, అత్తమామల అండ లేదు. జీవనాధారమూ లేదు. దాంతో పొరుగుదేశంలో పనిమనిషిగానైనా నాలుగు డబ్బులు వెనకేసుకుందామని కువైట్ చేరింది. ఇంతలో కరోనా వల్ల కష్టమొచ్చిపడింది. ‘‘పనివాళ్ల వల్ల కరోనా వస్తుందని భయపడ్డారో ఏమో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. ఎక్కడికెళ్లాలో తెలియదు. భాష రాదు. తిండి, నీళ్లు లేక తిరుగుతుంటే తెలుగు వాళ్లే చూసి క్యాంప్‌కు తీసుకొచ్చారు’ అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి. అకామా బ్లాక్ అయిందని.. భయపెడ్తున్నారు అని బాధపడుతోంది పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలు మండలం, ఆట్లపాడుకు చెందిన సత్యభారతి. 2019, నవంబరులో కువైట్‌కు వచ్చింది భారతి. అయితే గల్ఫ్ ఆమెకు కొత్త కాదు. ఇదివరకు ఖతర్, దుబాయ్, బహరెయిన్లలో డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేసింది. కాని ఇప్పుడు కువైట్‌లో ఎదురైన సమస్యే భయపెడుతోంది ఆమెను. ‘ఖతర్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైంది. ఇండియాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈలోపు మా నాన్న చనిపోవడం, నా భర్తతో గొడవలు.. మానసికంగానూ దెబ్బతిన్నా. కూర్చుంటే రోజు గడిచే దారి లేదు. అందుకే మళ్లీ గల్ఫ్‌కు ట్రై చేసుకొని కువైట్కొచ్చా. నాలుగు నెలలుగా జీతం ఆపేశారు. నా పరిస్థితి గురించి మా చుట్టాలకు ఫోన్ చేద్దామన్నా డబ్బుల్లేవు. కొంచెం టెన్షన్ పడ్డా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. ఇండియా వెళ్లిపోతాను సహాయం చేయండని తెలిసిన వాళ్లను అడిగితే నీ అకామా (రెసిడెంట్ స్టాంప్)బ్లాక్‌లో ఉంది, రెండు లక్షల రూపాయలవుతాయి అని చెప్పారు. బ్లాక్‌లో ఎందుకు ఉంటుందని భయపడి ఏజెంట్‌కు ఫోన్ చేస్తుంటే అతణ్ణించి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆమ్నెస్టీ నాకోసమే వచ్చినట్టయింది’ చెప్పుకొచ్చింది సత్యభారతి. వీళ్లంతా కువైట్ నుంచి టేకాఫ్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అక్కడున్న మన రాయబార కార్యాలయం ద్వారా వైట్‌పాస్ (లేదా అవుట్పాస్ అంటే ఆపద్ధర్మ పాస్‌పార్ట్)లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛందసేవా కార్యకర్తలు. -
కువైట్‌తో ‘పని మనుషుల’ ఒప్పందానికి కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: పని మనుషుల నియామకంలో సహకారానికి కువైట్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల కువైట్‌లో పనిచేస్తున్న 3 లక్షల మంది భారతీయుల(అందులో 90 వేల మంది మహిళలే)కు ప్రయోజనం కలుగుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఎంఓయూలో భారత పని మనుషుల హక్కుల పరిరక్షణకు కొన్ని రక్షణలు కల్పించారు. ఐదేళ్ల వరకు అమల్లో ఉండే ఈ ఒప్పందాన్ని ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు సంయుక్త కమిటీని ఏర్పాటుచేయనున్నారు. -
గల్ఫ్ గోస; ఓ భారతీయురాలి దీనగాథ
సాక్షి, న్యూఢిల్లీ : అరబ్ దేశమైన ఓమన్ రాజధాని మస్కట్ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు. దాంతో ఆమెకు వెన్నుముకతోపాటు రెండు కాళ్లు విరిగాయి. ఎడమ వైపు నడుము నుంచి పాదం వరకు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. ఓమన్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను మే 26వ తేదీన భారత్‌లోని కేరళకు పంపించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం జిల్లా, చిరాయింకీజు గ్రామంలోని చిన్న ఇంటిలో జీవచ్చవంలా రోజులు లెక్కపెడుతోంది. కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఆమె భర్త బిజుమన్ సదాశివన్ సపర్యలు చేస్తున్నారు. శీజా దాస్ ఇంతటి దుస్థితికి కారణమైన ఆమె యజమానురాలి నుంచి మాత్రం ఆమెకు నష్టపరిహారంగా ఒక్క పైసా రాలేదు. అందుకు ప్రస్తుత భారత ప్రభుత్వం కారణమవడం బాధాకరం. నేడు శీజా దాస్‌కు జరిగిన అన్యాయం.. 2015లో తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నంకు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎదురైన దారుణాన్ని గుర్తుచేస్తోంది. అతి తక్కువ డబ్బులకు తనతో అరవచాకిరి చేయిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2015, అక్టోబర్ 8వ తేదీన ఆమె కుడిచేతిని ఇంటి యజమాని నరికేశారు. ఈ సంఘటనపై నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వార్త తెల్సిన మరుక్షణమే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆమె అక్టోబర్ 9వ తేదీన తొమ్మిది గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే: ‘గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కంట్రీస్’గా పిలిచే ఓమన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిలో శీజా దాస్, మునిరత్నంలాంటి బాధితులు కూడా వేలల్లో ఉంటారని అక్కడి భారతీయ సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచు కొస్తోందనే భయంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయరని వారు చెబుతున్నారు. పస్తులు, వీపు దెబ్బలు శీజా దాస్ 2016వ సంవత్సరం నుంచి మస్కట్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిచేస్తున్నారు. అదే యజమాని కింద 2013 నుంచి ఆమె భర్త శివదాసన్ పనిచేస్తుండడంతో తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని శీజా భావించారు. ఇద్దరి జీతాల నుంచి కూడ బెట్టుకున్న సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకోవచ్చని వారు కలలుగన్నారు. గత వేసవి సెలవుల్లో వారు తమ ఇద్దరు పిల్లల (13 ఏళ్ల శ్రీరప్, రెండేళ్ల శోభిత్)ను తీసుకొని మస్కట్ వెళ్లారు. ఎంత పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇంటి యజమానురాలు కర్రతో ఎప్పుడూ శీజా వీపుపై బాదేదట. పస్తులు ఉంచేదట. మే నాలుగవ తేదీన ఏదో సాకుతో చితకబాదడం మొదలు పెట్టిందట. ఎంత వేడుకున్నా వదిలి పెట్టలేదట. తరిమి తరిమి కొట్టిందట. ఆ దెబ్బలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు మేడ మీదకు పరుగెత్తిందట. అయినా వెంటపడడంతో తప్పించుకునేందుకు మరో మార్గం లేక కిందకు దూకేసిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మస్కట్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారట. మస్కట్‌కు రాకముందు తన భార్య శీజా 48 కిలోల బరువు ఉండేదని, ఆస్పత్రిలో చేరనాటికి ఆమె బరువు 30 కిలోలే ఉందని భర్త శివదాసన్ తెలిపారు. తన భార్యకు నెలకు 50 ఓమన్ రియల్స్ (8,750 రూపాయలు) ఇస్తానన్న హామీతో పనిమనిషిగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, యజమాని ప్రతి నెల ఆమె బ్యాంక్ ఖాతాలో ఆ జీతం మొత్తాన్ని జమచేసి మళ్లీ అదే రోజు విత్‌డ్రా చేయించి తీసుకునే వారని ఆయన తెలిపారు (అక్కడ పని మనుషుల జీతాలను తప్పనిసరిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలి). అంతా కలిపి మళ్లీ భారత్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తానని చెప్పేవారని, అనుమానం ఉన్నా చేసేదేమీ లేక ఊరుకున్నామని ఆయన చెప్పారు. తనకు మాత్రం నెలకు 17,500 రూపాయలు వచ్చేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన తన భార్యకు నష్టపరిహారం చెల్లించకపోగా, జీతంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భారత్‌కు పంపించేందుకు తన భార్య శీజాకు మాత్రమే తమ యజమాని విమాన టిక్కెట్టు కొన్నారని, తనకు, తమ పిల్లలకు కొనలేదని శివదాసన్ తెలిపారు. వీరి పరిస్థితి గురించి ఓమన్‌లో సామాజిక, సాంస్కతి సంస్థగా రిజిస్టర్ అయిన ‘ఇండియన్ సోషల్ క్లబ్’ అధ్యక్షుడు, ‘కేరళ నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డ్’ డైరెక్టరయిన పీఎం జబీర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. ఆమె ఆదేశం మేరకు మస్కట్‌లోని భారతీయ ఎంబసీ జోక్యం చేసుకొని బిజూమన్, ఇద్దరు పిల్లలకు కూడా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు పంపించారు. ఒక్క నయాపైసా కూడా యజమాని నుంచి శీజాకు రాలేదు. చట్టాలు ఏమి చెబుతున్నాయి? విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం 2,600 డాలర్ల ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి 2,850 డాలర్ల (దాదాపు రెండు లక్షల రూపాయలు) చొప్పున భారత అంబసీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని అంబసీ సెక్యూరిటీ డిపాజిట్‌గా పరిగణిస్తుంది. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు, నష్టపరిహారం కోసం బాధితుడికి అంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని 280 డాలర్లు (దాదాపు 18,800 రూపాయలు)గా నిర్దేశించింది. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతోపాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుతో మొబైల్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఏడాదికోసారి భారత్ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఈమ్రైగ్రేషన్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించిన అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహించాలి. నష్టపరిహారం ఎత్తివేశారు విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండంతో భారతీయ అంబసీ కోరుతున్న బ్యాంక్ గ్యారంటీ అందుకు కారణం అవుతుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో గల్ఫ్‌తోపాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతు ఎత్తివేసింది. పర్యవసానంగా నేడు శీజా దాస్‌కు నష్టపరిహారం అందకుండా పోయింది. ‘ఇంటి కల ఎలాగు చెదిరిపోయింది. నా వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇక నేనా లేవలేను. నేను ఎప్పుడు కన్నుమూసినా ఫర్వాలేదు. కానీ ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత, బరువు నా భర్తపై పడింది. ఎలా నెట్టుకొస్తాడో ఏమో’ అంటూ ఆమె మీడియాతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయ పని మనుషులకు సరైన భద్రత కల్పించాలి. లేకపోతే శీజా లాంటి కథలు వింటూనే ఉంటాం’ అని పీఎం జబీర్ వ్యాఖ్యానించారు. -
మెయిడ్ ఇన్ ఇండియా!
ఎక్కువ పని.. తక్కువ వేతనం.. ఆపై వేధింపులు.. మనదేశంలో ఇంటి పనిమనుషుల పరిస్థితి ఇదీ.. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత దశాబ్ద కాలంలో ఇంట్లో పని మనుషుల (డొమెస్టిక్ వర్కర్లు) సంఖ్య 120 శాతం పెరిగిందట. 1991లో వీరి సంఖ్య 7.4 లక్షలైతే.. 2001 నాటికి అది 16.2 లక్షలకు చేరిందట. జనాభా లెక్కల ఆధారంగా ‘మెయిడ్ ఇన్ ఇండియా’ పుస్తకం ఈ విషయాన్ని వెల్లడించింది. క్వార్ట్జ్ డిజిటల్ మీడియా న్యూస్ ఆర్గనైజేషనల్లో ఆసియా బ్యూరో చీఫ్‌గా ఉన్న తృప్తి లాహిరి ఈ పుస్తకాన్ని రచించారు. అసంఘటిత రంగమైన దీనిలో మూడింట రెండొంతుల మంది మహిళలే ఉన్నారని చెబుతూ.. పలు ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు. 1931లో పనిమనుషుల సంఖ్య 27,00,000 1971 నాటికి.. 67,000 1991లో... 7,40,000 2001 నాటికి.. 16,20,000 1991–2001 మధ్య కాలంలో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల 120 శాతం వేధింపులు సర్వసాధారణం.. అతి తక్కువ అభివృద్ధి ఉన్న రాష్ట్రాలైన జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అస్సాం తదితర ప్రాంతాల నుంచే మహిళా డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరు పని కోసం రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి మరీ వెళుతున్నారు. అయితే ధనవంతుల ఇళ్లలో పనిచేస్తున్నా.. చట్ట ప్రకారం పనిచేసే వయసు కలిగి ఉన్నా.. ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనం కూడా వీరు పొందలేకపోతున్నారు. నిందలు, దూషణలు, శారీరక, మానసిక లైంగికపరమైన వేధింపులు అనేవి మహిళా సేవకులపై సర్వసాధారమైపోయాయి. కాలానుగుణంగా భారీ మార్పులు.. గత దశాబ్ద కాలంలో ఇంటి పనిమనుషుల సంఖ్య కాలానుగుణంగా భారీగా తగ్గుతూ.. అనూహ్యంగా పెరుగుతూ ఉంది. జనాభా లెక్కల ప్రకారం 1931లో 27 లక్షల మంది సేవకులుగా ఉన్నారు. 1971 నాటికి సేవకులుగా ఉన్న వారి సంఖ్య 67 వేలకు తగ్గింది. ఇది 1991 నుంచి 2001 నాటికి వచ్చే సరికి 120 శాతం పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం.. 2001– 2011 మధ్యలో 15–59 ఏళ్ల వయసు కలిగిన మహిళా వర్కర్ల సంఖ్య 17 శాతం పెరిగింది. అదే నగరాల విషయానికి వచ్చేటప్పటికి ఇది 70 శాతం పెరగడం గమనార్హం. 2001లో 1.47 కోట్ల మంది ఉన్న మహిళా వర్కర్ల సంఖ్య 2011 నాటికి 2.5 కోట్లకు చేరింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ మహిళలు 35 గంటలు..మగవారు 2 గంటలే.. మన దేశంలో ఇంట్లో పని విషయంలో స్త్రీలకు, పురుషులకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇళ్లలో ఆడవారు చేసే పనిని సాధారణ కుటుంబ విధులుగానే చూస్తున్నారు. మహిళలు వారానికి 35 గంటలు ఇంటి పనులు చేస్తుంటే.. మగవారు పని చేసేది రెండు గంటలే. ప్రపంచంలో అతి తక్కువ రేషియో ఇదే కావడం గమనార్హం. 2014లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈ విషయం వెల్లడించింది.