మెయిడ్ ఇన్ ఇండియా!
మెయిడ్ ఇన్ ఇండియా!
Published Mon, Jul 17 2017 2:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
ఎక్కువ పని.. తక్కువ వేతనం.. ఆపై వేధింపులు..
మనదేశంలో ఇంటి పనిమనుషుల పరిస్థితి ఇదీ..
దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత దశాబ్ద కాలంలో ఇంట్లో పని మనుషుల (డొమెస్టిక్ వర్కర్లు) సంఖ్య 120 శాతం పెరిగిందట. 1991లో వీరి సంఖ్య 7.4 లక్షలైతే.. 2001 నాటికి అది 16.2 లక్షలకు చేరిందట. జనాభా లెక్కల ఆధారంగా ‘మెయిడ్ ఇన్ ఇండియా’ పుస్తకం ఈ విషయాన్ని వెల్లడించింది. క్వార్ట్‌జ్ డిజిటల్ మీడియా న్యూస్ ఆర్గనైజేషనల్‌లో ఆసియా బ్యూరో చీఫ్‌గా ఉన్న తృప్తి లాహిరి ఈ పుస్తకాన్ని రచించారు. అసంఘటిత రంగమైన దీనిలో మూడింట రెండొంతుల మంది మహిళలే ఉన్నారని చెబుతూ.. పలు ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు.
1931లో పనిమనుషుల సంఖ్య 27,00,000
1971 నాటికి.. 67,000
1991లో... 7,40,000
2001 నాటికి.. 16,20,000
1991–2001 మధ్య కాలంలో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల 120 శాతం
వేధింపులు సర్వసాధారణం..
అతి తక్కువ అభివృద్ధి ఉన్న రాష్ట్రాలైన జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అస్సాం తదితర ప్రాంతాల నుంచే మహిళా డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరు పని కోసం రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి మరీ వెళుతున్నారు. అయితే ధనవంతుల ఇళ్లలో పనిచేస్తున్నా.. చట్ట ప్రకారం పనిచేసే వయసు కలిగి ఉన్నా.. ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనం కూడా వీరు పొందలేకపోతున్నారు. నిందలు, దూషణలు, శారీరక, మానసిక లైంగికపరమైన వేధింపులు అనేవి మహిళా సేవకులపై సర్వసాధారమైపోయాయి.
కాలానుగుణంగా భారీ మార్పులు..
గత దశాబ్ద కాలంలో ఇంటి పనిమనుషుల సంఖ్య కాలానుగుణంగా భారీగా తగ్గుతూ.. అనూహ్యంగా పెరుగుతూ ఉంది. జనాభా లెక్కల ప్రకారం 1931లో 27 లక్షల మంది సేవకులుగా ఉన్నారు. 1971 నాటికి సేవకులుగా ఉన్న వారి సంఖ్య 67 వేలకు తగ్గింది. ఇది 1991 నుంచి 2001 నాటికి వచ్చే సరికి 120 శాతం పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం.. 2001– 2011 మధ్యలో 15–59 ఏళ్ల వయసు కలిగిన మహిళా వర్కర్ల సంఖ్య 17 శాతం పెరిగింది. అదే నగరాల విషయానికి వచ్చేటప్పటికి ఇది 70 శాతం పెరగడం గమనార్హం. 2001లో 1.47 కోట్ల మంది ఉన్న మహిళా వర్కర్ల సంఖ్య 2011 నాటికి 2.5 కోట్లకు చేరింది. – సాక్షి, తెలంగాణ డెస్క్
మహిళలు 35 గంటలు..మగవారు 2 గంటలే..
మన దేశంలో ఇంట్లో పని విషయంలో స్త్రీలకు, పురుషులకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇళ్లలో ఆడవారు చేసే పనిని సాధారణ కుటుంబ విధులుగానే చూస్తున్నారు. మహిళలు వారానికి 35 గంటలు ఇంటి పనులు చేస్తుంటే.. మగవారు పని చేసేది రెండు గంటలే. ప్రపంచంలో అతి తక్కువ రేషియో ఇదే కావడం గమనార్హం. 2014లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ఈ విషయం వెల్లడించింది.
Advertisement
Advertisement