Out passports
-
కువైట్‌లో మనోళ్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్/మోర్తాడ్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అక్రమ వలసదారులకు కువైట్ ప్రభుత్వం కల్పించిన అత్యవసర క్షమాభిక్షతో 2,500 మంది తెలుగువాళ్లకు ఊరట లభించింది. రెండు విడతల్లో క్షమాభిక్ష కోసం కువైట్ దరఖాస్తులను స్వీకరించగా 10 వేల మంది భారతీయ కార్మికులు ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8 వేల మందికి కువైట్ ఔట్ పాస్పోర్టులిచ్చింది. ఔట్ పాస్‌పోర్టు పొందిన 8 వేల భారతీయుల్లో 2,500 మంది తెలంగాణ, ఏపీ వారని అంచనా. ఔట్ పాస్‌పోర్టులు పొందని మిగతా 2 వేల మంది కార్మికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఔట్ పాస్‌పోర్టుల జారీలో ఏర్పడిన అంతరాయం వల్ల క్షమాభిక్ష గడువును పొడిగించాలని వలస కార్మికులతోపాటు వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు క్షమాభిక్ష పొంది ఔట్ పాస్‌పోర్టులు తీసుకున్న వలస కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం విడిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వరకు విడిది కేంద్రాల్లో భోజన సదుపాయాలను సమకూర్చనుంది. నౌకలు రెడీ క్షమాభిక్షకు అనుమతి లభించి ప్రత్యేక క్యాంపుల్లో ఉండే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం నౌకలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారు సంకేతాలివ్వడంతో నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ సహా రెండు పెద్ద ఓడలు గల్ఫ్ తీరం వెళ్లనున్నాయి. ముందుగా కువైట్ నుంచి వారిని తరలించాలని భావిస్తున్నాయి. నౌకాయానానికి చాలా రోజులు పట్టే అవకాశమున్నందున ఆర్థిక స్థితి బాగుండి విమానాల్లో రావడానికి ఆసక్తి చూపే వారిని విమానాలు పునరుద్ధరించాక విమానాల్లో తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు లేనందున ఒకేసారి వేల మందిని తరలించేందుకు ప్రత్యేక నౌకలు, ఎయిర్ ఇండియా జంబో విమానాలను పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా... లాక్డౌన్ కారణంగా కువైట్‌లోనూ జనజీవనం స్తంభించింది. పరిశ్రమలు, నిర్మాణ రంగ ప్రాజెక్టులు, రిటైల్, చమురు ఉత్పత్తుల కంపెనీ లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వలస కార్మికులు ఉపాధి కోల్పో యే పరిస్ధితి ఏర్పడింది. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కువైట్ సర్కారు వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన, అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)ను వారి స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాణ ఖర్చులను కూడా భరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు క్షమాభిక్ష కోసం పేర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఔట్ పాస్‌పోర్టు రానివారు విలవిల.. ఔట్ పాస్‌పోర్టులు పొందని కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా విదేశాంగ శాఖ సకాలంలో ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయలేదని పలువురు రాష్ట్ర కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. విదేశాంగ శాఖ తప్పిదం వల్ల తాము కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ఆమ్నెస్టీని వినియోగించుకోని వలస కార్మికులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కువైట్ గతంలోనే హెచ్చరించి ందని... ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిసు న్నారు. విడిది కేంద్రాల్లో ఉంటే తమకు భోజన సదుపాయం దక్కేదని, ఇప్పుడు సొంతంగా భోజన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కొన్ని రోజులుగా పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదని, దాతల సహకారం పొందాల్సి వస్తుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 20 మంది కార్మికులు (ఔట్ పాస్‌పోర్టు పొందని వారు) తమను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలంటూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు. ఔట్ పాస్‌పోర్టు ఇప్పించాలి... మూడేళ్ల నుంచి కువైట్‌లో ఖల్లివెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నా. గతంలో వీసా ఇచ్చిన కంపెనీ సరిగా వేతనం ఇవ్వకపోవడంతో మరో కంపెనీలో చేరా. కరోనా వైరస్ వల్ల ఆమ్నెస్టీ పెట్టారు. ఇంటికి రావడానికి దరఖాస్తు చేసుకున్నా. నాతోపాటు 20 మందికి ఔట్ పాస్‌పోర్టులు ఇవ్వలేదు. మాకు ఎలాగైనా ఔట్ పాస్‌పోర్టులు ఇప్పించాలి. – సంతోష్ లకావత్, డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా -
టేకాఫ్
వలసల కష్టాలు కథలుగా వినే ఉన్నాం.. వాటిని ‘కరోనా’ ఇప్పుడు నిజాలుగా చూపిస్తోంది.. పరాయి రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం మన దగ్గరకు వచ్చినవాళ్ల కన్నీళ్లనే కాదు.. పని వెదుక్కుంటూ పరాయి దేశం పోయిన మన వాళ్ల వ్యథలనూ! కువైట్‌లోని మన మహిళా డొమెస్టిక్ హెల్పర్స్ (ఇళ్లలో పని చేసే వాళ్లు) పడుతున్న ఇబ్బందుల గురించిన కథనం ఇది.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆమ్నెస్టీ ప్రకటించింది కువైట్. వీసా గడువు అయిపోయాక కూడా ఆ దేశంలో ఉంటున్న వారికి, జరిమానా శిక్షలు పడ్డవారికి క్షమాభిక్ష పెట్టి వాళ్ల వాళ్ల దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం అక్కడున్న మన మహిళా డొమెస్టిక్ హెల్పర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా అరబ్బీ మాట్లాడలేక, నిరవధికంగా పన్నెండు గంటలు, ఒక్కోసారి 20 గంటలు పనిచేయలేక, తిండి, నిద్రలేక అనారోగ్యం పాలై.. యజమానుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి ఈ ఆమ్నెస్టీ ఓ వరంలా కనిపించింది. దాంతో యజమానుల కళ్లు గప్పి, రెండంతస్తుల మేడ మీద నుంచి చీర సహాయంతో కిందకు దూకి .. ఇలా రకరకాల ప్రయత్నాలతో బయటపడ్డారు. కొందరైతే ఆమ్నెస్టీ పెట్టకముందే బయటకు వచ్చేశారు... పాస్‌పార్టుల సంగతి అటుంచి చేతిలో చిల్లిగవ్వ, కాళ్లకు చెప్పుల్లేక కట్టుబట్టలతో. ఎటు వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎక్కుడుండాలి? ఏమీ తెలియదు. స్నానం లేదు, తిండి లేదు. పైగా కరోనా లాక్డౌన్. బయట కనిపిస్తే జరిమానా, జైలు. వీటన్నిటి నుంచీ తప్పించుకుంటూ తిరుగుతుండగా అక్కడ వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలుగు స్వచ్ఛందసేవా కార్యకర్తల సాయంతో షెల్టర్ హోమ్‌కి చేరారు. వాళ్లలో కొంతమంది నేపథ్యాలు.. కూలోనాలో చేసుకుంటా... అంటోంది ఈడిపల్లి లక్ష్మి. ఆమె స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలోని రామారావుపేట. కువైట్‌కు వెళ్లి మూడేళ్ల అవుతోంది. ‘నా తాగుబోతు భర్తతో పడలేక విడాకులు తీసుకున్నా. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు, పొలం లేవు. అప్పలు తీరాలి, పూట గడవాలి. అందుకే కువైట్‌కు వచ్చా. ఇక్కడి భాష రాక బాధలు పడ్డా. ఇంక నావల్ల కాక ఓరోజు షేక్ ఇంట్లోంచి పారిపోయా. తిండిలేక కడుపు మాడ్చుకుంటాను కాని అద్దె కట్టకపోతే గదిలో ఉండనివ్వరు కదా! నయా పైసా లేక నానా తిప్పలు. చివరికిలా క్యాంపులోకొచ్చి పడ్డా. మా సొంతూరెళ్లిపోయి కూలోనాలో చేస్కోని బతుకుతాను’’ అంటూ చేతులు జోడిస్తోంది లక్ష్మి. ఇంట్లోంచి గెంటేశారు.. అని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తోంది కోన కృష్ణవేణి. ఆమె స్వస్థలమూ తూర్పు గోదావరి జిల్లానే. యేడాది కిందట భర్త చనిపోయాడు. అమ్మానాన్నా, అత్తమామల అండ లేదు. జీవనాధారమూ లేదు. దాంతో పొరుగుదేశంలో పనిమనిషిగానైనా నాలుగు డబ్బులు వెనకేసుకుందామని కువైట్ చేరింది. ఇంతలో కరోనా వల్ల కష్టమొచ్చిపడింది. ‘‘పనివాళ్ల వల్ల కరోనా వస్తుందని భయపడ్డారో ఏమో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. ఎక్కడికెళ్లాలో తెలియదు. భాష రాదు. తిండి, నీళ్లు లేక తిరుగుతుంటే తెలుగు వాళ్లే చూసి క్యాంప్‌కు తీసుకొచ్చారు’ అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి. అకామా బ్లాక్ అయిందని.. భయపెడ్తున్నారు అని బాధపడుతోంది పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలు మండలం, ఆట్లపాడుకు చెందిన సత్యభారతి. 2019, నవంబరులో కువైట్‌కు వచ్చింది భారతి. అయితే గల్ఫ్ ఆమెకు కొత్త కాదు. ఇదివరకు ఖతర్, దుబాయ్, బహరెయిన్లలో డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేసింది. కాని ఇప్పుడు కువైట్‌లో ఎదురైన సమస్యే భయపెడుతోంది ఆమెను. ‘ఖతర్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైంది. ఇండియాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈలోపు మా నాన్న చనిపోవడం, నా భర్తతో గొడవలు.. మానసికంగానూ దెబ్బతిన్నా. కూర్చుంటే రోజు గడిచే దారి లేదు. అందుకే మళ్లీ గల్ఫ్‌కు ట్రై చేసుకొని కువైట్కొచ్చా. నాలుగు నెలలుగా జీతం ఆపేశారు. నా పరిస్థితి గురించి మా చుట్టాలకు ఫోన్ చేద్దామన్నా డబ్బుల్లేవు. కొంచెం టెన్షన్ పడ్డా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. ఇండియా వెళ్లిపోతాను సహాయం చేయండని తెలిసిన వాళ్లను అడిగితే నీ అకామా (రెసిడెంట్ స్టాంప్)బ్లాక్‌లో ఉంది, రెండు లక్షల రూపాయలవుతాయి అని చెప్పారు. బ్లాక్‌లో ఎందుకు ఉంటుందని భయపడి ఏజెంట్‌కు ఫోన్ చేస్తుంటే అతణ్ణించి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆమ్నెస్టీ నాకోసమే వచ్చినట్టయింది’ చెప్పుకొచ్చింది సత్యభారతి. వీళ్లంతా కువైట్ నుంచి టేకాఫ్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అక్కడున్న మన రాయబార కార్యాలయం ద్వారా వైట్‌పాస్ (లేదా అవుట్పాస్ అంటే ఆపద్ధర్మ పాస్‌పార్ట్)లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛందసేవా కార్యకర్తలు. -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్‌లోనే తన ఔట్‌పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
కువైట్‌లో టికెట్ ఇక్కట్లు
మోర్తాడ్(బాల్కొండ): కువైట్‌లో క్షమాభిక్ష అమలులోకి వచ్చిన నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు తెలంగాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఔట్‌పాస్‌లు జారీ అయినా.. విమాన టికెట్ కోసం చేతిలో చిల్లి గవ్వ లేక అవస్థలు పడుతున్నారు. ఏడేళ్ల తరువాత కువైట్‌లో క్షమాభిక్ష అమలులోకి రావడంతో ఇన్నేళ్ల పాటు అక్రమంగా ఉంటున్న కార్మికులకు స్వదేశానికి వచ్చేందుకు అవకాశం లభించింది. కువైట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికుల్లో తెలంగాణ జిల్లాలకు చెం దిన వారు దాదాపు 50 వేల మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మరో 30 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా ఎంతో కాలం నుంచి కువైట్‌లో వర్క్ పర్మిట్, వీసా లేకుండా అక్రమంగా ఉంటున్నారు. క్షమాభిక్ష నేపథ్యం లో ఇందులో చాలా మందికి ఔట్‌పాస్‌లు జరీ అయ్యాయి. స్వదేశానికి విమాన టికెట్ ధర రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఔట్ పాస్‌పోర్టులు పొందుతున్న కార్మికుల్లో ఎంతోమంది టిక్కెట్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో దాతలు, ప్రభుత్వాలు స్పం దించి తమను స్వదేశానికి రప్పించేందుకు టికెట్లను సమకూర్చాలని వేడుకుంటు న్నారు. ఏపీకి చెందిన కార్మికుల కోసం అక్కడి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో దాదాపు 4,500 మం దికి టికెట్లను కొనుగోలు చేసే అవకాశం లభించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఔట్‌పాస్‌లు పొందిన వారికి టికెట్లు ఇప్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ను కలసి విన్నవిస్తామని గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి చెప్పారు. -
జెడ్డా జైలు నుంచి విముక్తి
బందీలకు అవుట్ పాస్‌పోర్టులు: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి మూడు నెలలుగా జెడ్డా జైలులో బందీలుగా ఉన్న తెలంగాణ వలస కార్మికులకు ఎట్టకేలకు బుధవారం విముక్తి లభించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన మూడు వందల మంది కార్మికులు జెడ్డా జైలులో బందీలుగా ఉన్న విషయాన్ని ఈ నెల 8న ’జెడ్డా జైలులో అరణ్య రోదన’ శీర్షికతో ’సాక్షి’ మెరుున్ ఎడిషన్‌లో కథనం ప్రచురితమైంది. ’సాక్షి’ వరస కథనాల నేపథ్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు స్పందించారు. జెడ్డా జైలులో బందీలైన వారికి అవుట్ పాస్‌పోర్టులు జారీ చేయాలని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులను కోరారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ చర్చించారు. మంత్రి కేటీఆర్ చొరవతో జైలులో ఉన్న వంద మందికి బుధవారం అవుట్ పాస్‌పోర్టులు అందారుు. ఇంకా కొంతమంది ఉండగా, వారికి ఒకటి రెండు రోజుల్లో పాస్‌పోర్టులు అందుతాయని భావిస్తున్నారు. పాస్‌పోర్టులు అందిన వారిని జెడ్డా జైలు నుంచి నేరుగా విమానాశ్రయానికి పంపిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవుట్ పాస్‌పోర్టులు అందించారని జైలునుంచి విడుదలైన కార్మికులు బుధవారం సాయంత్రం ’సాక్షి’కి ఫోన్లో తెలిపారు. జెడ్డా జైలులో నెలల తరబడి బందీలుగా ఉన్న అంశాన్ని పత్రిక ద్వారా వెల్లడించడంతో మంత్రి కేటీఆర్ స్పందించి అవుట్ పాస్‌పోర్టులు తొందరగా అందేలా చూశారని వారు పేర్కొన్నారు. తమ కష్టాలను వెలుగులోకి తెచ్చి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించినందుకు ’సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. జెడ్డా జైలు నుంచి విడుదలైన వారు గురువారం స్వదేశానికి రానున్నారు. -
తిండీ తిప్పలూ కరువే
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): ‘సౌదీలో రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకుంటాం.. వారిని సురక్షితంగా ఇళ్లకు రప్పిస్తాం..’ ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన ఇది! కానీ కార్మికుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. స్వయంగా మంత్రి ఆదేశించినా.. సౌదీలో రాయబార కార్యాలయం అధికారులు కదలడం లేదు. జైళ్లలో మగ్గుతున్నవారికి తాత్కాలిక పాస్‌పోర్టులు(ఔట్ పాస్‌పోర్టులు) ఇవ్వకపోవడంతో వారంతా నరకం అనుభవిస్తున్నారు. సరైన వసతి, భోజన సదుపాయం లేక తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు.. ఆర్థిక సంక్షోభంతో సౌదీలోని ప్రధాన కంపెనీలు అయిన బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ కంపెనీలు మూతపడ్డాయి. అనేక చిన్న కంపెనీలు సైతం లాకౌట్ ప్రకటించాయి. మూతబడిన కంపెనీలు కార్మికులను క్యాంపుల నుంచి గెంటివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. కంపెనీల యాజమాన్యాలు కార్మికుల పాస్‌పోర్టులను ఇస్తే వారంతా స్వదేశాలకు చేరేవారు. కానీ కంపెనీలు పాస్‌పోర్టులు చేతికి ఇవ్వకుండా.. నెలల తరబడి బకాయి పడ్డ వేతనాలు చెల్లించకుండా కార్మికులను బజారున పడేశాయి. దీంతో అనేకమంది తమకు తెలిసిన వారి గదుల్లో ఆశ్రయం పొందుతుండగా మరికొందరు ఎలాంటి దారి లేక పోవడంతో రోడ్లపై బతుకీడుస్తున్నారు. వీరంతా పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఔట్ జైళ్లకు తరలించారు. జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు సరైన వసతి, భోజన సదుపాయం లేదు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వీరికి ఔట్ పాస్‌పోర్టులను జారీ చే స్తే స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జెద్దా, రియాద్, హాయ్‌లలో ఉన్న రాయబార కార్యాలయం అధికారులు సకాలంలో ఈ పాస్‌పోర్టులు ఇవ్వడం లేదు. సెలవుల పేరుతో వారంలో మూడు నాలుగు రోజులు కార్యాలయాలను మూసి ఉంచుతున్నారు. ఇప్పటికే ఔట్ పాస్‌పోర్టుల కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. సెప్టెంబర్ 25లోపు భారత్‌కు వచ్చే కార్మికులకు సౌదీలోని కంపెనీల నుంచి బకాయి పడిన వేతనం సొమ్మును ఇప్పిస్తామని, ఇతర సంరక్షణ చర్యలను తీసుకుంటామని విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే ఇంకా ఔట్ పాస్‌పోర్టుల ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఎక్కువ సమయం కార్యాలయాన్ని నిర్వహించి ఔట్ పాస్‌పోర్టుల జారీని వేగవంతం చేయాలని కోరుతున్నారు. రాయబార కార్యాలయంలో పట్టించుకోవడం లేదు సౌదీలోని రాయబార కార్యాలయాల్లో సరైన స్పందన లేదు. ఔట్ పాస్‌పోర్టు జారీకి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అధికారులు పని వేళలు పాటించడం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. - సత్యనారాయణ, ఎలక్ట్రీషియన్, రియాద్