ఔట్ పాస్‌పోర్టులు పొందని నిజామాబాద్ జిల్లా కార్మికులు
సాక్షి, హైదరాబాద్/మోర్తాడ్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అక్రమ వలసదారులకు కువైట్ ప్రభుత్వం కల్పించిన అత్యవసర క్షమాభిక్షతో 2,500 మంది తెలుగువాళ్లకు ఊరట లభించింది. రెండు విడతల్లో క్షమాభిక్ష కోసం కువైట్ దరఖాస్తులను స్వీకరించగా 10 వేల మంది భారతీయ కార్మికులు ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8 వేల మందికి కువైట్ ఔట్ పాస్‌పోర్టులిచ్చింది. ఔట్ పాస్‌పోర్టు పొందిన 8 వేల భారతీయుల్లో 2,500 మంది తెలంగాణ, ఏపీ వారని అంచనా. ఔట్ పాస్‌పోర్టులు పొందని మిగతా 2 వేల మంది కార్మికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఔట్ పాస్‌పోర్టుల జారీలో ఏర్పడిన అంతరాయం వల్ల క్షమాభిక్ష గడువును పొడిగించాలని వలస కార్మికులతోపాటు వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు క్షమాభిక్ష పొంది ఔట్ పాస్‌పోర్టులు తీసుకున్న వలస కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం విడిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వరకు విడిది కేంద్రాల్లో భోజన సదుపాయాలను సమకూర్చనుంది.
నౌకలు రెడీ
క్షమాభిక్షకు అనుమతి లభించి ప్రత్యేక క్యాంపుల్లో ఉండే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం నౌకలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారు సంకేతాలివ్వడంతో నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ జలాశ్వ సహా రెండు పెద్ద ఓడలు గల్ఫ్ తీరం వెళ్లనున్నాయి. ముందుగా కువైట్ నుంచి వారిని తరలించాలని భావిస్తున్నాయి. నౌకాయానానికి చాలా రోజులు పట్టే అవకాశమున్నందున ఆర్థిక స్థితి బాగుండి విమానాల్లో రావడానికి ఆసక్తి చూపే వారిని విమానాలు పునరుద్ధరించాక విమానాల్లో తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు లేనందున ఒకేసారి వేల మందిని తరలించేందుకు ప్రత్యేక నౌకలు, ఎయిర్ ఇండియా జంబో విమానాలను పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మునుపెన్నడూ లేనివిధంగా...
లాక్‌డౌన్ కారణంగా కువైట్‌లోనూ జనజీవనం స్తంభించింది. పరిశ్రమలు, నిర్మాణ రంగ ప్రాజెక్టులు, రిటైల్, చమురు ఉత్పత్తుల కంపెనీ లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వలస కార్మికులు ఉపాధి కోల్పో యే పరిస్ధితి ఏర్పడింది. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కువైట్ సర్కారు వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన, అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)ను వారి స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాణ ఖర్చులను కూడా భరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు క్షమాభిక్ష కోసం పేర్ల నమోదుకు అవకాశం కల్పించింది.
ఔట్ పాస్‌పోర్టు రానివారు విలవిల..
ఔట్ పాస్‌పోర్టులు పొందని కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా విదేశాంగ శాఖ సకాలంలో ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయలేదని పలువురు రాష్ట్ర కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. విదేశాంగ శాఖ తప్పిదం వల్ల తాము కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ఆమ్నెస్టీని వినియోగించుకోని వలస కార్మికులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కువైట్ గతంలోనే హెచ్చరించి ందని... ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిసు న్నారు. విడిది కేంద్రాల్లో ఉంటే తమకు భోజన సదుపాయం దక్కేదని, ఇప్పుడు సొంతంగా భోజన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కొన్ని రోజులుగా పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదని, దాతల సహకారం పొందాల్సి వస్తుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 20 మంది కార్మికులు (ఔట్ పాస్‌పోర్టు పొందని వారు) తమను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలంటూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు.
ఔట్ పాస్‌పోర్టు ఇప్పించాలి...
మూడేళ్ల నుంచి కువైట్‌లో ఖల్లివెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నా. గతంలో వీసా ఇచ్చిన కంపెనీ సరిగా వేతనం ఇవ్వకపోవడంతో మరో కంపెనీలో చేరా. కరోనా వైరస్ వల్ల ఆమ్నెస్టీ పెట్టారు. ఇంటికి రావడానికి దరఖాస్తు చేసుకున్నా. నాతోపాటు 20 మందికి ఔట్ పాస్‌పోర్టులు ఇవ్వలేదు. మాకు ఎలాగైనా ఔట్ పాస్‌పోర్టులు ఇప్పించాలి. – సంతోష్ లకావత్, డిచ్‌పల్లి, నిజామాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment