Kuwait Government
-
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?
దుబాయ్: ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీంతో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా ఆ దేశం వదిలి రావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకోవాలన్న కువైట్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించడంతో త్వరలోనే అక్కడి భారతీయులు కువైట్‌ను వదిలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. కువైట్ జనాభా: 43 లక్షలు ఇందులో కువైటీలు: 13 లక్షలు భారతీయులు: 14.5 లక్షలు 2018లో కువైట్‌లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తం: 480 కోట్ల డాలర్లు విదేశీయులపై వ్యతిరేకత! ముసాయిదా బిల్లు ప్రకారం కువైట్ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్ జనాభా దాదాపు 43 లక్షలు కాగా ఇందులో కువైటీలు 13 లక్షల మంది ఉన్నారు. భారతీయుల సంఖ్య 14.5 లక్షల వరకూ ఉంది. ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్–19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది. కువైట్ జనాభాలో ఎవరెంతమంది? కువైటీలు: 30.36% ఇతర అరబ్ దేశాల వారు:27.29 ఆసియావాసులు:40.42% ఆఫ్రికావాసులు: 1.02% యూరప్‌వాసులు: 0.39% ఇతరులు: 0.52% ప్రస్తుతం కువైట్ మొత్తమ్మీద సుమారు 49 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా విదేశీయుల సంఖ్యను తగ్గించాల్సిందిగా కోరుతున్నారు. కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ గత నెలలో విదేశీయుల సంఖ్యను ప్రస్తుతమున్న 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిద్దామని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్ మర్జూక్ అల్ ఘనేమ్ కువైట్ టీవీతో మాట్లాడుతూ దశలవారీగా విదేశీయులను తగ్గించే అంశంపై ఒక కమిటీ అసెంబ్లీకి సమగ్రమైన ముసాయిదా బిల్లును సమర్పిస్తుందని తెలిపారు కూడా. విదేశాల నుంచి వచ్చిన వారిలో అధిక శాతం మంది నిరక్షరాస్యులు లేదా కేవలం చదవడం, రాయడం మాత్రమే తెలిసిన వారు ఉన్నారని, కువైటీలకు వారి అవసరమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటే ఫర్వాలేదు. కానీ వీసా వ్యాపారుల జిమ్మిక్కు కారణంగా నైపుణ్యం లేని కూలీల వలసలు దేశంలోకి ఎక్కువయ్యాయి’ అని అసెంబ్లీ స్పీకర్ మీడియాతో అన్నారు. సంబంధిత కమిటీలకు ముసాయిదా బిల్లు విదేశీయుల సంఖ్యపై కోటా అమలు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సంబంధిత కమిటీలకు వెళ్లనుంది. దాని ప్రకారం దేశ జనాభాలో భారతీయులు 15 శాతం కంటే ఎక్కువ ఉండరాదు. ఫలితంగా సుమారు ఎనిమిది లక్షల మంది కువైట్ వీడాల్సి ఉంటుంది. కువైట్‌లో భారతీయ ఎంబసీ లెక్కల ప్రకారం సుమారు 28 వేల మంది భారతీయులు ఆ దేశ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు, చమురు కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. సుమారు 5.23 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తూండగా వీరిపై ఆధారపడ్డ వారు 1.16 లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ సుమారు 60 వేల మంది భారతీయ సంతతి విద్యార్థులు దేశంలోని 23 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. -
వలస కార్మికుల ఎదురుచూపులు
మోర్తాడ్ (బాల్కొండ): లాక్డౌన్ అమలు నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమం చేపట్టిన కేంద్రం.. కువైట్‌లో క్షమాభిక్ష పొందిన మనదేశ కార్మికుల పట్ల కనికరం చూపడం లేదు. కువైట్‌లో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ వలస కార్మికులను వారి సొంత ప్రదేశాలకు పంపించడానికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) అమలు చేసిన విషయం విదితమే. మన దేశానికి చెందిన 10 వేల మంది కార్మికులు క్షమాభిక్ష పొందడానికి దరఖాస్తు చేసుకోగా.. అందులో 8 వేల మంది స్వదేశానికి రావడానికి మన రాయబార కార్యాలయం నుంచి ఔట్ పాస్‌పోర్టులను జారీ చేసింది. క్షమాభిక్షకు అర్హత సాధించిన వలస కార్మికులు ఏప్రిల్ 30 నుంచి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కువైట్‌లో లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన భారత పర్యాటకులు, వ్యాపారులు, చట్ట పరంగా ఉన్న కార్మికులు మన దేశానికి తీసుకు రావడానికి 5 విమానాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పటికే, ఒక విమానంలో తెలంగాణ, ఏపీలకు చెందిన 163 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో 4 విమానాల్లో 800 మంది వరకు భారతీయులు స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది. -
కువైట్‌లో మనోళ్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్/మోర్తాడ్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అక్రమ వలసదారులకు కువైట్ ప్రభుత్వం కల్పించిన అత్యవసర క్షమాభిక్షతో 2,500 మంది తెలుగువాళ్లకు ఊరట లభించింది. రెండు విడతల్లో క్షమాభిక్ష కోసం కువైట్ దరఖాస్తులను స్వీకరించగా 10 వేల మంది భారతీయ కార్మికులు ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8 వేల మందికి కువైట్ ఔట్ పాస్పోర్టులిచ్చింది. ఔట్ పాస్‌పోర్టు పొందిన 8 వేల భారతీయుల్లో 2,500 మంది తెలంగాణ, ఏపీ వారని అంచనా. ఔట్ పాస్‌పోర్టులు పొందని మిగతా 2 వేల మంది కార్మికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఔట్ పాస్‌పోర్టుల జారీలో ఏర్పడిన అంతరాయం వల్ల క్షమాభిక్ష గడువును పొడిగించాలని వలస కార్మికులతోపాటు వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు క్షమాభిక్ష పొంది ఔట్ పాస్‌పోర్టులు తీసుకున్న వలస కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం విడిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వరకు విడిది కేంద్రాల్లో భోజన సదుపాయాలను సమకూర్చనుంది. నౌకలు రెడీ క్షమాభిక్షకు అనుమతి లభించి ప్రత్యేక క్యాంపుల్లో ఉండే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం నౌకలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారు సంకేతాలివ్వడంతో నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ సహా రెండు పెద్ద ఓడలు గల్ఫ్ తీరం వెళ్లనున్నాయి. ముందుగా కువైట్ నుంచి వారిని తరలించాలని భావిస్తున్నాయి. నౌకాయానానికి చాలా రోజులు పట్టే అవకాశమున్నందున ఆర్థిక స్థితి బాగుండి విమానాల్లో రావడానికి ఆసక్తి చూపే వారిని విమానాలు పునరుద్ధరించాక విమానాల్లో తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు లేనందున ఒకేసారి వేల మందిని తరలించేందుకు ప్రత్యేక నౌకలు, ఎయిర్ ఇండియా జంబో విమానాలను పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా... లాక్డౌన్ కారణంగా కువైట్‌లోనూ జనజీవనం స్తంభించింది. పరిశ్రమలు, నిర్మాణ రంగ ప్రాజెక్టులు, రిటైల్, చమురు ఉత్పత్తుల కంపెనీ లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వలస కార్మికులు ఉపాధి కోల్పో యే పరిస్ధితి ఏర్పడింది. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కువైట్ సర్కారు వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన, అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)ను వారి స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాణ ఖర్చులను కూడా భరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు క్షమాభిక్ష కోసం పేర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఔట్ పాస్‌పోర్టు రానివారు విలవిల.. ఔట్ పాస్‌పోర్టులు పొందని కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా విదేశాంగ శాఖ సకాలంలో ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయలేదని పలువురు రాష్ట్ర కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. విదేశాంగ శాఖ తప్పిదం వల్ల తాము కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ఆమ్నెస్టీని వినియోగించుకోని వలస కార్మికులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కువైట్ గతంలోనే హెచ్చరించి ందని... ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిసు న్నారు. విడిది కేంద్రాల్లో ఉంటే తమకు భోజన సదుపాయం దక్కేదని, ఇప్పుడు సొంతంగా భోజన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కొన్ని రోజులుగా పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదని, దాతల సహకారం పొందాల్సి వస్తుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 20 మంది కార్మికులు (ఔట్ పాస్‌పోర్టు పొందని వారు) తమను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలంటూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు. ఔట్ పాస్‌పోర్టు ఇప్పించాలి... మూడేళ్ల నుంచి కువైట్‌లో ఖల్లివెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నా. గతంలో వీసా ఇచ్చిన కంపెనీ సరిగా వేతనం ఇవ్వకపోవడంతో మరో కంపెనీలో చేరా. కరోనా వైరస్ వల్ల ఆమ్నెస్టీ పెట్టారు. ఇంటికి రావడానికి దరఖాస్తు చేసుకున్నా. నాతోపాటు 20 మందికి ఔట్ పాస్‌పోర్టులు ఇవ్వలేదు. మాకు ఎలాగైనా ఔట్ పాస్‌పోర్టులు ఇప్పించాలి. – సంతోష్ లకావత్, డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా -
కువైట్‌లో ఔట్ పాస్‌పోర్టుల జారీ
నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ దేశంలో చట్ట విరుద్ధంగా ఉన్న విదేశీ వలస కార్మికులను వారి దేశాలకు పంపించడానికి కువైట్ ప్రభుత్వం అమలు చేసిన అత్యవసర క్షమాభిక్షకు గడువు గురువారంతో ముగిసింది. అత్యవసర క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)లో భాగంగా ఇంటికి రావడానికి మన దేశానికి చెందిన వలస కార్మికులు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే గురువారం నాటికి ఎనిమిది వేల మందికి మాత్రమే కువైట్‌లోని మన విదేశాంగ శాఖ అధికారులు ఔట్ పాస్‌పోర్టులను జారీ చేశారు. మరో రెండు వేల మందికి ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయాల్సి ఉంది. కువైట్‌లో ఉపాధి పొందడానికి కంపెనీ వీసాలు పొంది వీసా జారీ చేసిన కంపెనీలో పని చేయకుండా మరో కంపెనీలో చేరడం, విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడు వు ముగిసినా అక్కడే ఉండిపోవడం, నివాస అనుమతి(అకామా) లేకుండా చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను తమ దేశం నుంచి వెళ్లి పోవడానికి కువైట్ ఆమ్నెస్టీ అమలు చేసిన విషయం విదితమే. చట్ట చట్టవిరుద్ధంగా ఉన్న కార్మికుల వద్ద పాస్‌పోర్టులు ఉండే అవకాశం లేదు. అందువల్ల క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు విదేశాంగ శాఖ ఔట్ పాస్‌పోర్టులను జారీ చేస్తోంది. కువైట్‌లో విదేశీ వలస కార్మికుల కోసం అమలు చేసిన క్షమాభిక్షలో భాగంగా మన దేశానికి చెందిన చట్ట విరుద్ధంగా కార్మికుల దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 16 నుంచి 20వ తేది వరకు సాగింది. ఈ నిర్ణీత సమయంలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోని కార్మికులకు ఇదే నెలలో 26 నుంచి 30వ తేది వరకు మరో అవకాశాన్ని కువైట్ ప్రభుత్వం కల్పించింది. రెండు విడతలలో సాగిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భారతీయ కార్మికులు 10వేల మంది దరఖాస్తు చేసుకోగా 8వేల మందికి ఔట్ పాస్‌పోర్టులు దక్కాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు 3వేల మంది ఉన్నారని ఆమ్నెస్టీ కోసం వాలంటీర్‌గా పని చేసిన మార్క ప్రమోద్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. ఆమ్నెస్టీ గడువు ముగిసిపోగా ఔట్ పాస్‌పోర్టు పొందని కార్మికులు మరో రెండు వేల మంది వరకు ఉండగా వారి కోసం కొంత గడువు పెంచాలని మన విదేశాంగ శాఖ ద్వారా కువైట్ ప్రభుత్వానికి విన్న వించినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. విమానయాన సర్వీసులు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోక పోవడంతో కువైట్‌లో క్షమాభిక్ష పొందిన కార్మికులు అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిదిలలో కొంత కాలం సేద తీరాల్సి ఉంటుంది. -
‘కువైట్’పై జోక్యం చేసుకోండి
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్ పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకొనిభారత కార్మికులకు ఊరట కల్పించాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లేఖలు రాశారు. కువైట్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు తమ సొం దేశాలకు వెళ్లిపోవడానికి అమలు చేసిన క్షమాభిక్ష ఆమ్నెస్టీకి ఈ నెల 22తో గడువు ముగిసిపోనుంది. సమయం తక్కువగా ఉండటంతో మన దేశ కార్మికులు సకాలంలో ఔట్‌పాస్ లను పొందక.. సొంతగడ్డకు చేరుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్రం చొరవ తీసుకుని కువైట్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కార్మికులు సొంతూళ్లకు చేరు కునేలా చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికే కువైట్‌లో తెలంగాణ కార్మికులకు సహకా రం అందించడానికి అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ బృందం మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను కలసి లేఖ అందించింది. కార్మికుల సంఖ్యకు సరిపడే విమాన సర్వీ సులు లేకపోవడం, విమానయాన చార్జీలు పెంచడం వల్ల కలిగిన అసౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. కువైట్‌లో ఉన్న భారత సంతతి చిన్నారులు అక్కడ జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా స్టేట్లెస్ చిల్డ్రన్‌గా పరిగణించబడి ఔట్‌పాస్‌లను పొందలేకపోతున్నారని తెలిపారు. చిన్నారులకు ఔట్‌పాస్‌లు లభించేలా కృషి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. -
కువైట్‌లో క్యూ కడుతున్న కార్మికులు
మోర్తాడ్(బాల్కొండ): కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో అక్కడి మన రాయబార కార్యాలయం వద్ద ఔట్ పాస్ కోసం ఎదుట స్వదేశానికి వచ్చేందుకు కార్మికులు క్యూ కడుతున్నారు. రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది కార్మికులు కువైట్‌లో అక్రమంగా ఉంటున్నారు. ఏజెంట్ల మోసాలు యజమానుల వంచన నేపథ్యంలో చట్టబద్ధంగా అక్కడ ఉండలేక ఇంత కాలం ఇబ్బందులు పడుతూ బతికారు. ఏడేళ్ల తర్వాత కువైట్ ప్రభుత్వం క్షమాభిక్షను అమలు చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 22 వరకు గడువు విధించింది. దీనితో లబ్ధి పొందే కార్మికులలో తెలంగాణ వారే అధికంగా ఉన్నారు. వీరంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2016 చివరి రోజుల్లో అక్కడి పోలీసులు దాడులు నిర్వహించి వందలాది మందిని అరెస్టు చేశారు. వారంతా జైళ్లలోనే మగ్గుతున్నారు. ప్రభుత్వం టికెట్లను సమకూర్చాలి కువైట్ నుంచి తిరిగి రావడానికి ఔట్ పాస్‌లు పొందుతున్న కార్మికులకు ప్రభుత్వం విమాన టికెట్లను అందించాలి. కార్మికులు మన దేశానికి రాలేని పరిస్థితుల్లోనే రహస్యంగా ఉండిపోయారు. దీనిని గుర్తించి ప్రభుత్వం టికెట్లను సమకూరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. – పాట్కూరి బసంత్‌రెడ్డి, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక మండలి అధికార ప్రతినిధి -
కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు
దేశ బహిష్కరణ చేస్తామని కువైట్ హెచ్చరిక తెలుగువారిని అప్రమత్తం చేస్తున్న సంస్థలు మోర్తాడ్: నూతన సంవత్సర వేడుకలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 2015కు వీడ్కోలు చెబుతూ.. 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాలు నిర్వహించరాదంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గతంలో ఎప్పుడు కూడా వేడుకలపై ఆంక్షలను విధించలేదు. ఈసారి మాత్రం ఆంక్షలను విధిస్తూ ముందస్తుగానే ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీల్లో పార్టీలు నిర్వహించడం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారిపై కువైట్ పోలీసులు నిఘా ఉంచనున్నారు. హోటళ్లు, నివాస ప్రాంతాలు, కంపెనీల కార్మికుల క్యాంపులు, ఫ్లాట్లు, రెస్టారెంట్లపై పోలీసులు కన్ను వేశారు. కువైట్ పౌరులకు కఠినశిక్ష, భారీ జరిమానా, విదేశీయులైతే దేశ బహిష్కరణ విధించను న్నారు. ఇప్పటికే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారని బెంగళూర్, హైదరాబాద్‌లకు చెందిన ఏడుగురిని అక్కడి ప్రభుత్వం పంపించివేసింది. ఈ నేపథ్యంలో తెలుగు స్వచ్ఛంద సంస్థలు అక్కడి తెలుగు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. వేడుకలకు దూరంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నాయి.