నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ దేశంలో చట్ట విరుద్ధంగా ఉన్న విదేశీ వలస కార్మికులను వారి దేశాలకు పంపించడానికి కువైట్ ప్రభుత్వం అమలు చేసిన అత్యవసర క్షమాభిక్షకు గడువు గురువారంతో ముగిసింది. అత్యవసర క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)లో భాగంగా ఇంటికి రావడానికి మన దేశానికి చెందిన వలస కార్మికులు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే గురువారం నాటికి ఎనిమిది వేల మందికి మాత్రమే కువైట్‌లోని మన విదేశాంగ శాఖ అధికారులు ఔట్ పాస్‌పోర్టులను జారీ చేశారు. మరో రెండు వేల మందికి ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయాల్సి ఉంది. కువైట్‌లో ఉపాధి పొందడానికి కంపెనీ వీసాలు పొంది వీసా జారీ చేసిన కంపెనీలో పని చేయకుండా మరో కంపెనీలో చేరడం, విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడు వు ముగిసినా అక్కడే ఉండిపోవడం, నివాస అనుమతి(అకామా) లేకుండా చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను తమ దేశం నుంచి వెళ్లి పోవడానికి కువైట్ ఆమ్నెస్టీ అమలు చేసిన విషయం విదితమే.
చట్ట చట్టవిరుద్ధంగా ఉన్న కార్మికుల వద్ద పాస్‌పోర్టులు ఉండే అవకాశం లేదు. అందువల్ల క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు విదేశాంగ శాఖ ఔట్ పాస్‌పోర్టులను జారీ చేస్తోంది. కువైట్‌లో విదేశీ వలస కార్మికుల కోసం అమలు చేసిన క్షమాభిక్షలో భాగంగా మన దేశానికి చెందిన చట్ట విరుద్ధంగా కార్మికుల దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 16 నుంచి 20వ తేది వరకు సాగింది. ఈ నిర్ణీత సమయంలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోని కార్మికులకు ఇదే నెలలో 26 నుంచి 30వ తేది వరకు మరో అవకాశాన్ని కువైట్ ప్రభుత్వం కల్పించింది. రెండు విడతలలో సాగిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భారతీయ కార్మికులు 10వేల మంది దరఖాస్తు చేసుకోగా 8వేల మందికి ఔట్ పాస్‌పోర్టులు దక్కాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు 3వేల మంది ఉన్నారని ఆమ్నెస్టీ కోసం వాలంటీర్‌గా పని చేసిన మార్క ప్రమోద్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. ఆమ్నెస్టీ గడువు ముగిసిపోగా ఔట్ పాస్‌పోర్టు పొందని కార్మికులు మరో రెండు వేల మంది వరకు ఉండగా వారి కోసం కొంత గడువు పెంచాలని మన విదేశాంగ శాఖ ద్వారా కువైట్ ప్రభుత్వానికి విన్న వించినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. విమానయాన సర్వీసులు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోక పోవడంతో కువైట్‌లో క్షమాభిక్ష పొందిన కార్మికులు అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిదిలలో కొంత కాలం సేద తీరాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment