కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర? | Eight lakh Indians may be forced to leave as Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?

Published Tue, Jul 7 2020 5:06 AM | Last Updated on Tue, Jul 7 2020 5:06 AM

Eight lakh Indians may be forced to leave as Kuwait - Sakshi

దుబాయ్‌: ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీంతో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా ఆ దేశం వదిలి రావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకోవాలన్న కువైట్‌ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించడంతో త్వరలోనే అక్కడి భారతీయులు కువైట్‌ను వదిలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.  
 

కువైట్‌ జనాభా:  43 లక్షలు
ఇందులో కువైటీలు:   13 లక్షలు  
భారతీయులు:   14.5 లక్షలు  
2018లో కువైట్‌లోని  భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తం: 480  కోట్ల డాలర్లు 


విదేశీయులపై వ్యతిరేకత!
ముసాయిదా బిల్లు ప్రకారం కువైట్‌ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్‌ జనాభా దాదాపు 43 లక్షలు కాగా ఇందులో కువైటీలు 13 లక్షల మంది ఉన్నారు. భారతీయుల సంఖ్య 14.5 లక్షల వరకూ ఉంది. ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్‌–19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది.

కువైట్‌ జనాభాలో ఎవరెంతమంది?
కువైటీలు:    30.36%
ఇతర అరబ్‌ దేశాల వారు:27.29
ఆసియావాసులు:40.42%
ఆఫ్రికావాసులు: 1.02%
యూరప్‌వాసులు: 0.39%
ఇతరులు: 0.52%  

ప్రస్తుతం కువైట్‌ మొత్తమ్మీద సుమారు 49 వేల కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా విదేశీయుల సంఖ్యను తగ్గించాల్సిందిగా కోరుతున్నారు. కువైట్‌ ప్రధాని షేక్‌ సబా అల్‌ ఖలీద్‌ గత నెలలో విదేశీయుల సంఖ్యను ప్రస్తుతమున్న 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిద్దామని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్‌ మర్జూక్‌ అల్‌ ఘనేమ్‌ కువైట్‌ టీవీతో మాట్లాడుతూ దశలవారీగా విదేశీయులను తగ్గించే అంశంపై ఒక కమిటీ అసెంబ్లీకి సమగ్రమైన ముసాయిదా బిల్లును సమర్పిస్తుందని తెలిపారు కూడా. విదేశాల నుంచి వచ్చిన వారిలో అధిక శాతం మంది నిరక్షరాస్యులు లేదా కేవలం చదవడం, రాయడం మాత్రమే తెలిసిన వారు ఉన్నారని, కువైటీలకు వారి అవసరమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటే ఫర్వాలేదు. కానీ వీసా వ్యాపారుల జిమ్మిక్కు కారణంగా నైపుణ్యం లేని కూలీల వలసలు దేశంలోకి ఎక్కువయ్యాయి’ అని అసెంబ్లీ స్పీకర్‌ మీడియాతో అన్నారు.

సంబంధిత కమిటీలకు ముసాయిదా బిల్లు
విదేశీయుల సంఖ్యపై కోటా అమలు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సంబంధిత కమిటీలకు వెళ్లనుంది. దాని ప్రకారం దేశ జనాభాలో భారతీయులు 15 శాతం కంటే ఎక్కువ ఉండరాదు. ఫలితంగా సుమారు ఎనిమిది లక్షల మంది కువైట్‌ వీడాల్సి ఉంటుంది. కువైట్‌లో భారతీయ ఎంబసీ లెక్కల ప్రకారం సుమారు 28 వేల మంది భారతీయులు ఆ దేశ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు, చమురు కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. సుమారు 5.23 లక్షల మంది ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తూండగా వీరిపై ఆధారపడ్డ వారు 1.16 లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ సుమారు 60 వేల మంది భారతీయ సంతతి విద్యార్థులు దేశంలోని 23 పాఠశాలల్లో చదువుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement