మోర్తాడ్ (బాల్కొండ): లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమం చేపట్టిన కేంద్రం.. కువైట్‌లో క్షమాభిక్ష పొందిన మనదేశ కార్మికుల పట్ల కనికరం చూపడం లేదు. కువైట్‌లో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ వలస కార్మికులను వారి సొంత ప్రదేశాలకు పంపించడానికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) అమలు చేసిన విషయం విదితమే. మన దేశానికి చెందిన 10 వేల మంది కార్మికులు క్షమాభిక్ష పొందడానికి దరఖాస్తు చేసుకోగా.. అందులో 8 వేల మంది స్వదేశానికి రావడానికి మన రాయబార కార్యాలయం నుంచి ఔట్ పాస్‌పోర్టులను జారీ చేసింది.
క్షమాభిక్షకు అర్హత సాధించిన వలస కార్మికులు ఏప్రిల్ 30 నుంచి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కువైట్‌లో లాక్‌డౌన్ వల్ల చిక్కుకుపోయిన భారత పర్యాటకులు, వ్యాపారులు, చట్ట పరంగా ఉన్న కార్మికులు మన దేశానికి తీసుకు రావడానికి 5 విమానాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పటికే, ఒక విమానంలో తెలంగాణ, ఏపీలకు చెందిన 163 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో 4 విమానాల్లో 800 మంది వరకు భారతీయులు స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment