కువైట్‌లో రాయబార కార్యాయలయం వద్ద ఔట్ పాస్‌ల కోసం బారులు తీరిన కార్మికులు
మోర్తాడ్(బాల్కొండ): కువైట్‌లో క్షమాభిక్ష అమలులోకి వచ్చిన నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు తెలంగాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఔట్‌పాస్‌లు జారీ అయినా.. విమాన టికెట్ కోసం చేతిలో చిల్లి గవ్వ లేక అవస్థలు పడుతున్నారు. ఏడేళ్ల తరువాత కువైట్‌లో క్షమాభిక్ష అమలులోకి రావడంతో ఇన్నేళ్ల పాటు అక్రమంగా ఉంటున్న కార్మికులకు స్వదేశానికి వచ్చేందుకు అవకాశం లభించింది.
కువైట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికుల్లో తెలంగాణ జిల్లాలకు చెం దిన వారు దాదాపు 50 వేల మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మరో 30 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా ఎంతో కాలం నుంచి కువైట్‌లో వర్క్ పర్మిట్, వీసా లేకుండా అక్రమంగా ఉంటున్నారు. క్షమాభిక్ష నేపథ్యం లో ఇందులో చాలా మందికి ఔట్‌పాస్‌లు జరీ అయ్యాయి. స్వదేశానికి విమాన టికెట్ ధర రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఔట్ పాస్‌పోర్టులు పొందుతున్న కార్మికుల్లో ఎంతోమంది టిక్కెట్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ క్రమంలో దాతలు, ప్రభుత్వాలు స్పం దించి తమను స్వదేశానికి రప్పించేందుకు టికెట్‌లను సమకూర్చాలని వేడుకుంటు న్నారు. ఏపీకి చెందిన కార్మికుల కోసం అక్కడి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో దాదాపు 4,500 మం దికి టికెట్‌లను కొనుగోలు చేసే అవకాశం లభించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఔట్‌పాస్‌లు పొందిన వారికి టికెట్లు ఇప్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ను కలసి విన్నవిస్తామని గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment