జెడ్డా జైలు నుంచి విముక్తి
బందీలకు అవుట్ పాస్‌పోర్టులు: మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి మూడు నెలలుగా జెడ్డా జైలులో బందీలుగా ఉన్న తెలంగాణ వలస కార్మికులకు ఎట్టకేలకు బుధవారం విముక్తి లభించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన మూడు వందల మంది కార్మికులు జెడ్డా జైలులో బందీలుగా ఉన్న విషయాన్ని ఈ నెల 8న ’జెడ్డా జైలులో అరణ్య రోదన’ శీర్షికతో ’సాక్షి’ మెరుున్ ఎడిషన్‌లో కథనం ప్రచురితమైంది. ’సాక్షి’ వరస కథనాల నేపథ్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు స్పందించారు. జెడ్డా జైలులో బందీలైన వారికి అవుట్ పాస్‌పోర్టులు జారీ చేయాలని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులను కోరారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ చర్చించారు.
మంత్రి కేటీఆర్ చొరవతో జైలులో ఉన్న వంద మందికి బుధవారం అవుట్ పాస్‌పోర్టులు అందారుు. ఇంకా కొంతమంది ఉండగా, వారికి ఒకటి రెండు రోజుల్లో పాస్‌పోర్టులు అందుతాయని భావిస్తున్నారు. పాస్‌పోర్టులు అందిన వారిని జెడ్డా జైలు నుంచి నేరుగా విమానాశ్రయానికి పంపిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవుట్ పాస్‌పోర్టులు అందించారని జైలునుంచి విడుదలైన కార్మికులు బుధవారం సాయంత్రం ’సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. జెడ్డా జైలులో నెలల తరబడి బందీలుగా ఉన్న అంశాన్ని పత్రిక ద్వారా వెల్లడించడంతో మంత్రి కేటీఆర్ స్పందించి అవుట్ పాస్‌పోర్టులు తొందరగా అందేలా చూశారని వారు పేర్కొన్నారు. తమ కష్టాలను వెలుగులోకి తెచ్చి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించినందుకు ’సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. జెడ్డా జైలు నుంచి విడుదలైన వారు గురువారం స్వదేశానికి రానున్నారు.