అనకాపల్లి: అనకాపల్లి.. గ్రామీణ విశాఖ జిల్లాలో ఓ ముఖ్య వ్యాపార కూడలి. జాతీయ స్థాయిలో బెల్లం మార్కెట్‌కు ప్రసిద్ధి. ఆధ్యాత్మికంగానూ పేరున్న చిన్న పట్టణం. అయితే ఆ పట్టణంలో కరోనా వైరస్ కలకలం రేపింది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక కూడా జనతా కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితొచ్చింది. ఇలాంటి ఆపత్కాలంలో అనకాపల్లి ప్రజలకు వలంటీర్లు వెన్నంటి నిలిచారు. కరోనా నుంచి కాపాడే రక్షణ కవచాలయ్యారు. మార్చి 20వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. (దుర్గగుడి సిబ్బందికి కరోనా సెగ)
కరోనా పాజిటివ్ వ్యక్తులకు వైద్యుల ద్వారా సకాలంలో వైద్యం అందిస్తుండటంతో రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. మొదట్లో కరోనా అంటే భయపడిపోయిన ప్రజలను వలంటీర్లు చైతన్యపరిచారు. తరచూ చేతుల శానిటేషన్, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తే మన దరిదాపులకు కూడా కరోనా రాదంటూ ధైర్యం చెప్పారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు వలంటీర్లు కూపన్లు ఇవ్వడం, ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం వంటివి సత్ఫలితాలనిచ్చాయి.
► ఐదుగురికి పాజిటివ్ రావడంతో వలంటీర్ మజ్జి ధనుంజయ్ అప్రమత్తమయ్యారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. నిత్యం బ్లీచింగ్ చల్లిస్తూ పారిశుద్ధ్య సమస్యల్లేకుండా చూస్తున్నారు.
► నలుగురికి పాజిటివ్ రావడంతో వలంటీర్ పొలమరశెట్టి జ్యోతి.. వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా చూశారు. ఇరుగుపొరుగులో ధైర్యం నింపి.. శానిటైజేషన్, మాస్క్‌లు, భౌతిక దూరం ఆవశ్యకతపై వారిని చైతన్య పరిచారు. ప్రస్తుత వర్షాకాలంలో విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆదుకోవడంలో ముందున్నారు..
కరోనా సమయంలో మమ్మల్ని ఆదుకోవడంలో వలంటీర్లు ముందున్నారు. ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఇంటికే తెచ్చి అందిస్తున్నారు.
– మజ్జి సూర్యకాంతం, కోట్నివీధి, అనకాపల్లి
రేషన్ తీసుకోవడానికి సాయం..
కరోనా సమయంలో పెద్దవాళ్లు అస్సలు బయటకు రాకూడదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలంటీర్లు బాగా అక్కరకొస్తున్నారు. పింఛన్ కూడా ఇళ్లకే తెచ్చిస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇళ్లకొచ్చి టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఏ ఇబ్బందీ లేకుండా రేషన్ తీసుకోవడంలో సాయపడుతున్నారు.
– పల్లేల పద్మ, కుంచంగి గ్రామం, అనకాపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment