కర్నూలు(అర్బన్): కరోనాను విజయవంతంగా ఎదుర్కొన గలుగుతున్నామంటే అది వలంటీర్ల పుణ్యమే. తరచూ ఇళ్లకు వచ్చి ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి ఆస్పత్రికి తరలించడంలో కీలకపాత్ర వారిదే. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం దగ్గర్నుంచి.. పరీక్షలు చేయించడం, క్వారంటైన్ చేయడం వరకూ ఇతర సిబ్బందితో కలిసి వీరు చేస్తున్న కృషి అభినందనీయం.. అంటూ ప్రజలు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2,70,000 మంది వలంటీర్లు కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి అదనపు బలంగా మారారు. ట్రాకింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌లలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ కష్ట కాలంలో ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారు.
ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో జాతీయ మీడియా కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఈ నెల 15తో ఏడాది పూర్తయిన సందర్భంగా వారి సేవలు, కరోనా కష్టకాలంలో ఎలా పనిచేస్తున్నారన్న విషయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆదివారం కర్నూలు జిల్లా లద్దగిరిలో పర్యటించింది. వలంటీర్ల సేవలపై స్థానికులను ప్రశ్నించింది. ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ‘కరోనా నుంచి రక్షణ కవచాల్లా వలంటీర్లు మమ్మల్ని కాపాడుతున్నారు.. ప్రభుత్వ పథకాలను సైతం ఇళ్ల వద్దకే చేరుస్తూ మాకు కొండంత అండగా నిలుస్తున్నారు’ అని.
► గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఎలాంటి లక్షణాలూ లేకున్నా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వలంటీర్ పి.స్వాములు ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆరోగ్య సిబ్బందికి తెలియజేస్తున్నారు.
► ఇటీవలే ఒకరికి పాజిటివ్ రావడంతో ఇరుగుపొరుగు భయపడిపోయారు. అయితే వలంటీర్ రేష్మా పర్వీన్ వారిని చైతన్య పరిచి ధైర్యం చెప్పారు. వైద్య సిబ్బంది సాయంతో ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
వలంటీర్లు ఉన్నారనే ధైర్యం
పొలం పనులకు వెళ్లేప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలని వలంటీర్లు చెబుతున్నారు. వారు చెప్పినట్టుగానే మాస్క్ ధరిస్తున్నాం. దగ్గు, జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఆశా వర్కర్లతో వైద్యం చేయిస్తున్నారు. వలంటీర్ల వల్ల మాకు ధైర్యంగా ఉంది.
–ఖాజాబీ, గృహిణి
కరోనా సమయంలో అండగా..
వలంటీర్లే ఇంటికొచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ప్రస్తుత కరోనా సమయంలో అండగా నిలుస్తున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లిస్తున్నారు. ఆరోగ్య సమస్య తలెత్తితే ఫోన్ చేయాలన్నారు.
– చిన్న దస్తగిరి, రైతు
Comments
Please login to add a commentAdd a comment