భారతీయ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ ప్రెషర్ కుక్కర్లుగా మారుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సంస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలు ఎక్కువకాలం నిలదొక్కుకోలేవని పేర్కొన్నారు.
ఈసందర్భంగా శ్రీధర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..‘కార్పొరేట్ సంస్థలు తమ టార్గెట్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోకుండా ఉన్నవారిపైనే టార్గెట్ అంతా మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతూ ప్రెషర్‌కుక్కర్లుగా మారుతున్నాయి. చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఒంటరితనం పెరుగుతోంది. ఆఫీస్‌లో ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని దూరం చేసేందుకు సంస్థలు వైవిధ్య వాతావరణాన్ని సృష్టించాలి’ అన్నారు.
‘టెక్నాలజీ విభాగంలో చాలా కంపెనీలు మోనోపోలి(గుత్తాధిపత్యం)గా అవతరిస్తున్నాయి. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే ఓఎన్‌డీసీ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇది అన్ని రంగాల్లోనూ వ్యాపించాలి. దానివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని శ్రీధర్ చెప్పారు.
ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లఖ్‌నవూలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment