pressure cookers
-
కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
భారతీయ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ ప్రెషర్ కుక్కర్లుగా మారుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సంస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలు ఎక్కువకాలం నిలదొక్కుకోలేవని పేర్కొన్నారు.ఈసందర్భంగా శ్రీధర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..‘కార్పొరేట్ సంస్థలు తమ టార్గెట్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోకుండా ఉన్నవారిపైనే టార్గెట్ అంతా మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతూ ప్రెషర్కుక్కర్లుగా మారుతున్నాయి. చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఒంటరితనం పెరుగుతోంది. ఆఫీస్‌లో ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని దూరం చేసేందుకు సంస్థలు వైవిధ్య వాతావరణాన్ని సృష్టించాలి’ అన్నారు.‘టెక్నాలజీ విభాగంలో చాలా కంపెనీలు మోనోపోలి(గుత్తాధిపత్యం)గా అవతరిస్తున్నాయి. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే ఓఎన్డీసీ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇది అన్ని రంగాల్లోనూ వ్యాపించాలి. దానివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని శ్రీధర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లఖ్‌నవూలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీపీఏ ఆగ్రహం!
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌పై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్‌ఫారమ్‌లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను విక్రయించడానికి అనుమతించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్ వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెజర్ కుక్కర్ల వినియోగదారుల పేర్లనూ నోటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విక్రయించిన ప్రెజర్ కుక్కర్లను రీకాల్ చేసి వినియోగదారులకు డబ్బును రీయింబర్స్ (తిరిగి చెల్లింపులు) చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై స్థాయీ నివేదికను 45 రోజుల లోపు సమర్పించాలని కూడా ఇ– కామర్స్ దిగ్గజాన్ని అథారిటీ ఆదేశించింది. తీవ్ర ప్రమాదాల నుంచి వినియోగదారులను రక్షించడానికి, వినియోగదారు ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రెజర్ కుక్కర్లపై ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత గుర్తును ఉపయోగించడాన్ని ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. అన్ని వంటింటి ప్రెజర్ కుక్కర్లు ‘ఐఎస్ 2347:2017’ ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. ప్రెజర్ కుక్కర్లను ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో విక్రయించినా వీటికి సంబంధించి అత్యధిక భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. సీసీపీఏ ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ తన ’వినియోగ నిబంధనల’లో ప్రెజర్ కుక్కర్లకు సంబంధించి ప్రతి ఇన్వాయిస్పై ’ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆధారితం’ అని పేర్కొంది. వివిధ పంపిణీ ప్రయోజనాల కోసం విక్రేతలను ’బంగారం, వెండి, కాంస్య’గా గుర్తించింది. అమ్మకాల విషయంలో ఫ్లిప్‌కార్ట్ పోషించిన పాత్రను ఇది సూచిస్తుంది. తన ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి ప్రెజర్ కుక్కర్లను విక్రయించడం ద్వారా రూ. 1,84,263 ఫీజును సంపాదించినట్లు ఫ్లిప్‌కార్ట్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు విక్రయించడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు, ఇందుకు సంబంధించి బాధ్యత నుండి ఫ్లిప్‌కార్ట్ తప్పించుకోలేదు. విస్తృత అవగాహనా కార్యక్రమాలు.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి దేశ వ్యాప్తంగా విస్తృత అవగాహనా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖేర్ వెల్లడించారు. ఆమె తెలిపిన ముఖ్యాంశాలు... ► ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలను ఉల్లంఘించే నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడం సీసీపీఏ దేశవ్యాప్త ప్రచార లక్ష్యం. ► ఈ ప్రచారంలో ముఖ్యంగా హెల్మెట్లు, ప్రెజర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లపై దృష్టి సారిస్తోంది. ► అటువంటి ఉత్పత్తుల తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది. ► ప్రచారంలో భాగంగా ప్రామాణికంగా లేని పలు హెల్మెట్లు, ప్రెజర్ కుక్కర్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ► నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదుల్లో దాదాపు 38% ఇ–కామర్స్‌కు సంబంధించినవి. ఇందులో లోపభూయిష్ట ఉత్పత్తి డెలివరీ, చెల్లింపుల వాపసులో వైఫల్యం, ఉత్పత్తి డెలివరీలో జాప్యం వంటి అంశాలు ఉన్నాయి. -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్!
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆన్ లైన్లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను అమ్ముతుందంటూ అమెజాన్‌కు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఫైన్ విధించింది. సీసీపీఏ అమెజాన్ ఫ్లాట్ ఫామ్‌లో వినియోగదారులు కొనుగోలు చేసిన 2,265 ప్రెజర్ కుక్కర్లను పరిశీలించింది. వాటి పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని రీకాల్ చేయడంతో పాటు కొనుగోలు దారులకు డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ) నిబంధనకు విరుద్దంగా ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు జరిపిన అమెజాన్ లక్షరూపాయల పెనాల్టీని సీసీపీఏకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమెజాన్ క్యూసీవో నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ సీపీపీఏ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అమెజాన్ ఎంత సంపాదించిందంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ) ప్రకారం.. 2,265 ప్రెజర్ కుక్కర్లలలో నాణ్యత లోపించింది. ఆ కుక్కర్లను అమ్మగా అమెజాన్ రూ.6,14,825.41 సంపాదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ఆన్లైన్లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!
మీరు ఆన్లైన్లో కొత్త ప్రెషర్ కుక్కర్ కొనాలని చూస్తున్నారా? అయితే, జాగ్రత్త. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే ఈ-కామర్స్ కంపెనీలకు, అమ్మకందారులకు సీసీపీఏ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వాటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే గృహోపకరణ వస్తువులను వినియోగదారులను కొనుగోలు చేయకుండా ఉండటానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) భద్రతా నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 18(2)(జె) కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించి ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఈ కామర్స్ సంస్థలు, అమ్మకందారులపై సుమోటోగా చర్యలు తీసుకుంది. ఇటువంటి ఉల్లంఘనలకు Pressure Cookersసంబంధించి ఇప్పటికే 15 సార్లు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. దేశీయ ప్రెషర్ కుక్కర్ల అమ్మకందారులు క్యూసీఓ(క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్) నిబందనలు ఉల్లంఘించినందుకు ఈ -కామర్స్ సంస్థలపై 3 సార్లు, హెల్మెట్ల విక్రయం విషయంలో 2 సార్లు నోటీసులు జారీ చేసినట్లు సీసీపీఏ తెలిపింది. ప్రమాదాల భారీ నుంచి వినియోగదారులను రక్షించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. క్యూసీఓ ఆర్డర్ ప్రకారం దేశీయ ప్రెషర్ కుక్కర్లు ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ IS 2347:2017కి అనుగుణంగా ఉండాలి. 1 ఆగస్ట్ 2020 నుంచి అమలులోకి వచ్చే బిఐఎస్ నుంచి లైసెన్స్ కింద స్టాండర్డ్ మార్క్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. క్యూసీఓ పేర్కొన్న ప్రమాణాలను ఉల్లంఘించడం అంటే ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడమే కాకుండా, వినియోగదారులను తీవ్రమైన గాయాలకు గురిచేస్తుందని సీసీపీఏ తెలిపింది. గృహోపకరణాల విషయంలో కుటుంబ సభ్యులు అటువంటి వస్తువులకు సమీపంలో ఉంటారు. కాబట్టి, వారికి ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువ. క్యూసీఓ ప్రమాణాలను ఉల్లంఘించే హెల్మెట్, ప్రెషర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయకుండా వినియోగదారులు ఉండటానికి డిసెంబర్ 6న సీసీపీఏ దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను పరిశోధించడానికి సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్..!) -
భార్య పుట్టిన రోజు వేడుకలు... దొరికిపోయిన ఎమ్మెల్యే
ఓ వైపు ఎన్నికలు... ఓటర్లకు తాయిలాలు పంచుదామంటే ఎన్నికల సంఘం ఆంక్షలు ఏం చేయాలి... ఆలోచనలతో మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి బుర్ర వెడేక్కిపోయింది. అంతలో ఎమ్మెల్యేగారికి బుర్రలో మెరుపులాంటి ఆలోచన ఉరుమై మెరిసింది. అంతే భార్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేయాలని సంకల్పించాడు. అంతే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఓ ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకోవాలని అనుచర గణాన్ని ఆదేశించాడు. అంతేకాదు వచ్చిన ఆహ్వానితుల కోసం అదేనండి ఓటర్ల కోసం సెల్ఫోన్లు, కుక్కర్లు వగైర పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాడు. భార్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ప్రారంభించాడు. పిలిచిన ఆహ్వానితులంతా పొల్లుపొకుండా వేడుకకు హాజరైయ్యారు. అంతా కనులపండుగగా జరుగుతుంది. ఇంకేమంది ఓటర్లకు సెల్ఫోన్లు, కుక్కర్లు పంపిణీ చేసేయమని అనుచరగణాన్ని ఆదేశించాడు. అంతలో ఎన్నిక సంఘానికి చెందిన అధికారులు, పోలీసులు సంయుక్తంగా అక్కడికి చేరుకుని సైంధవుల్లా అడ్డుపడ్డారు. భారీ ఎత్తున సెల్ఫోన్లు, కుక్కర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా అయిందని జగ్గారెడ్డిగారు బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.