ఐటీకి బ్యాంకింగ్‌ షాక్‌! | International banking sector in crisis situation | Sakshi
Sakshi News home page

ఐటీకి బ్యాంకింగ్‌ షాక్‌!

Mar 22 2023 4:41 AM | Updated on Mar 22 2023 4:41 AM

International banking sector in crisis situation - Sakshi

రెండు వారాలుగా అమెరికా, యూరప్‌ ప్రాంతాల బ్యాంకింగ్‌ రంగంలో ఒకేసారి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. పలు బ్యాంకులు మూత పడుతున్నాయి. దీంతో దేశీ ఐటీ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ ఆదాయంలో అత్యధిక వాటాకు ప్రాతినిధ్యం వహించే బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం ఇందుకు కారణం కానున్నట్లు అంచనా.

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: కొద్దిరోజులుగా అటు అమెరికా, ఇటు యూరప్‌ బ్యాంకింగ్‌ రంగాలలో ప్రకంపనలు పుడుతున్నాయి. అమెరికాలో ఉన్నట్టుండి సిల్వర్‌గేట్‌ క్యాపిటల్‌ మూతపడగా.. వైఫల్యాల బాటలో ఉన్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్ప్‌(ఎఫ్‌డీఐసీ) టేకోవర్‌ చేసింది.

ఈ బాటలో సిగ్నేచర్‌ బ్యాంక్‌ సైతం దివాలాకు చేరగా.. న్యూయార్క్‌ కమ్యూనిటీ బ్యాంక్‌ ఆదుకుంది. అనుబంధ సంస్థ ఫ్లాగ్‌స్టార్‌ బ్యాంక్‌ ద్వారా ఆస్తుల కొనుగోలుకి అంగీకరించింది. ఇక మరోపక్క యూరోపియన్‌ బ్లూచిప్‌ క్రెడిట్‌ సూసీ దివాలా స్థితికి చేరడంతో స్విస్‌ కేంద్ర బ్యాంకు కల్పించుకుని  ఫైనాన్షియల్‌ రంగ దిగ్గజం యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది.

ఇక తాజాగా ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకును ఆదుకోవాలని జేపీ మోర్గాన్‌ ఇతర దిగ్గజాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2008 తదుపరి మరోసారి ఫైనాన్షియల్‌ రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ ప్రభావం దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవల రంగాన్ని దెబ్బ తీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.  

కోలుకుంటున్న వేళ 
కోవిడ్‌–19 సవాళ్లలో ఊపందుకున్న సాఫ్ట్‌వేర్‌ రంగం ఇటీవల రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కొంత అనిశ్చిత వాతావరణాన్ని చవిచూస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగ నియామకాలు మందగించగా.. వచ్చే ఏడాదిపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి.

అయితే ఇంతలోనే బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం ద్వారా మరో షాక్‌ తగలనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో కుదుపుల కారణంగా దేశీ ఐటీ దిగ్గజాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు.  

బీఎఫ్‌ఎస్‌ఐ దెబ్బ 
దేశీ ఐటీ సేవల రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సాఫ్ట్‌వేర్‌ రంగ సమాఖ్య నాస్కామ్‌ గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 20–40 శాతం వాటాను ఆక్రమిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈ వాటా 41 శాతాన్ని తాకనున్నట్లు అంచనా. ఇటీవల సవాళ్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు ప్రధానంగా దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్‌ సేవలు అందిస్తున్నాయి.

ఉదాహరణకు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్‌ సూసీ, యూబీఎస్‌లకు టీసీఎస్‌ ఐటీసర్వీసులు సమకూర్చుతోంది. ఇన్ఫోసిస్, ఎల్‌టీఐఎం సైతం సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనే ఈ కంపెనీలు ప్రొవిజన్లు చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే 2008లో లేమన్‌ బ్రదర్స్‌ దివాలా తదుపరి బ్యాంకులు వ్యయాల తగ్గింపు, బిజినెస్‌ పెంపు ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో దీర్ఘకాలంలో ఐటీ రంగం బలపడిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు.

స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి  డీల్స్‌ తగ్గనుండగా.. కాంట్రాక్ట్‌ ధరలపై సైతం ఒత్తిడి తలెత్తవచ్చని అంచనా. దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల్లో ఉత్తర అమెరికా, యూరోపియన్‌ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది క్యూ4పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది ప్రతికూలతలు కనిపించవచ్చని నిపుణులు తెలియజేశారు. 

మందగమనం 
అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కొత్త డీల్స్‌ మందగించవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ఆటోమేషన్‌ ప్రాసెస్, ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రణాళికలు తదితరాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడే వీలున్నట్లు తెలియజేశారు.

ఇది ఐటీ కాంట్రాక్టులు ఆలస్యమయ్యేందుకు కారణంకావచ్చని విశ్లేషించారు. తాజా ఐటీ వ్యయ ప్రణాళికలు వాయిదా పడవచ్చని, కొత్త ఆర్డర్లకు విఘాతం కలగవచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎఫ్‌ఎస్‌ఐ అతిపెద్ద విభాగమని దీంతో దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవలకు దెబ్బ తగలవచ్చని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement