ముంబై: టెక్నాలజీయేతర రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 2027–28 నాటికి 6 పరిశ్రమలు 10 లక్షల మందికి పైగా టెకీలను నియమించుకోనున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టెక్నాలజీయేతర రంగాలైన బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా).. కన్సల్టింగ్, కమ్యూనికేషన్ మీడియా, రిటైల్, లైఫ్ సైన్సెస్.. హెల్త్‌కేర్ తదితర రంగాల సంస్థలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 లక్షల మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాయి.
ప్రస్తుతం ఈ రంగాల్లో 7 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రమేయం ఉంటోంది. 5జీ సేవలు ప్రారంభం కావడం, డిజిటల్ చెల్లింపుల వృద్ధి, కొత్త తరం వ్యాపారాల వస్తుండటం, ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం పెరుగుతుండటం, డిజిటల్ పరివర్తన మొదలైన పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో టెక్నాలజీయేతర రంగాల్లోనూ టెకీలకు డిమాండ్ ఏర్పడుతోంది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ తెలిపారు.
నిపుణుల కొరత..
ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ నిపుణుల లభ్యత ఆ స్థాయిలో లేకపోవడం పరిశ్రమలకు పెద్ద సవాలుగా ఉంటోందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ (స్పెషలైజ్డ్ స్టాఫింగ్ విభాగం) మునీరా లోలివాలా తెలిపారు. టెకీలను నియమించుకోవడంతో పాటు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ వ్యవస్థను నైపుణ్యాల ఆధారితమైనదిగా తీర్చిదిద్దుకునేందుకు పటిష్టమైన పునాది వేసుకోవచ్చని మునీరా వివరించారు.
‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీయేతర రంగాల్లో ఇప్పటికీ నియామకాలనేవి పర్మనెంట్ ఉద్యోగాల ప్రాతిపదికన ఉండటం లేదు. 54 శాతం సంస్థలు మాత్రమే పర్మనెంట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఏకంగా 30 శాతం సంస్థల్లో నియామకాలు రకరకాల కాంట్రాక్టుల రూపంలో ఉంటున్నాయి‘ అని ఆమె పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్రాంతం, వేతనాలపరంగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ మెరుగ్గా ఉంటున్నాయి. బెంగళూరులో టెకీల్లో 27 శాతం మందికి, హైదరాబాద్‌లో 16 శాతం, ఢిల్లీ.. పుణెల్లో 13 శాతం మందికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment